దేశంలో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రెండు రోజుల క్రితమే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై మూడు రూపాయల చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా పెట్రోల్, డీజిల్ పై చెరో 90 పైసల చొప్పున పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో జాతీయ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 నుంచి రూ. 98.64కు పెరిగింది.
గతంలో లీటరుకు రూ. 90.67గా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు రూ. 91.58కు చేరింది. వారం రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. శుక్రవారం కూడా ధరలు లీటరుకు రూ. 3 పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి రూ. 98.64కు చేరగా, డీజిల్ ధర 91 పైసలు పెరిగి రూ. 91.58కు చేరింది.
ముంబైలో పెట్రోల్ ధర 91 పైసలు పెరిగి రూ. 107.59కు, డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ. 94.08కు చేరాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర అత్యధికంగా 96 పైసలు పెరిగి లీటరుకు రూ. 109.70కి చేరగా, డీజిల్ ధరలు 94 పైసలు పెరిగి లీటరుకు రూ. 96.07కి చేరాయి. చెన్నైలో పెట్రోల్ ధరలు 82 పైసలు పెరిగి లీటరుకు రూ. 104.49కి, డీజిల్ ధరలు 86 పైసలు పెరిగి లీటరుకు రూ. 96.11కి చేరాయి.
ఈ పెంపుతో సామాన్యుల నెత్తిన భారీగా భారం పెరిగినట్లు అయింది. పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యారెల్ ముడి చమురు ధరలు ఏకంగా 60 డాలర్ల నుంచి 111 డాలర్లకు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. తాజాగా ఇరాన్ మీద యుద్ధానికి తాము సిద్ధమవుతున్నామని ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ కూడా సాధారణ పౌరులకు సాయుధ శిక్షణ ఇస్తుండటంతో పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ముగిసిపోదనే సంకేతాలు పంపుతోంది.

