Dailyhunt
డ్రగ్స్ తీసుకుంటున్న వారిని కనిపెట్టడం ఎలా ?

డ్రగ్స్ తీసుకుంటున్న వారిని కనిపెట్టడం ఎలా ?

మాజంలో డ్రగ్స్ అన్నది పెద్ద మహమ్మారిగా తయారైంది. దీన్ని కంట్రోల్ చేయాలని ప్రభుత్వాలు, ఎన్జీవోలు ఎంత కష్టపడుతున్నా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు.

తెలంగాణలో ఈమధ్యనే మొదలైన ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్ మెంట్(ఈగల్ ఫోర్స్) మంచిఫలితాలను సాధిస్తోంది. డ్రగ్స్ అమ్మేవాళ్ళు, పెడలర్లతో పాటు ఉపయోగించేవాళ్ళ పనిపట్టడంతో ఆగకుండా ఒక అడుగు ముందుకేసింది. అదేమిటంటే పిల్లల్లో డ్రగ్స్ వాడకాన్ని మొదట్లోనే పసిగట్టడం. ఇందుకోసం మూడు ఏఐ టూల్స్ ను లాంచ్ చేసింది. డ్రగ్స్ వినియోగం మొదలుపెట్టిన పిల్లలను వెంటనే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు డ్రగ్స్ జోలికి వెళ్ళకుండా నిరోధించవచ్చన్నది ఈగల్ భావన.

కొత్తగా తీసుకొచ్చిన మూడు టూల్స్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ఈగల్ ఫోర్స్ రూపొందించింది. ఈ టూల్స్ ను డీజీపీ బీ శివధరరెడ్డి ప్రారంభించారు. https//eagleforce.tspolice.gov.in అనే వెబ్ సైట్లోకి ఎంటరైతే 'సహాయ్ ఏఐ'..'షీల్డ్ ఏఐ'..'మిత్ర-టీజీ' అనే మూడు టూల్స్ కనబడతాయి.

ఈ మూడు ఎలాగ పనిచేస్తాయంటే సహాయ్ ఏఐలోకి ఎంటరైతే డ్రగ్స్ వాడకానికి సంబంధించిన అనేక సందేహాలను నివృత్తిచేస్తుంది. డ్రగ్స్ వినియోగించేవారిని గుర్తించడం ఎలా అన్న ప్రశ్నను టైప్ చేస్తే వెంటనే సమాధానాలు వచ్చేస్తాయి. తరచుగా మూడ్స్ స్వింగ్ అవుతుండటం, అసాధారణంగా వాసనలను పసిగట్టడం, పెదాలు పొడిబారడం, కళ్ళు ఎరుపెక్కడం అనే లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చని చెబుతుంది.

అలాగే షీల్డ్ ఏఐ టూల్ లోకి వెళితే డ్రగ్స్ అనర్ధాలను వివరిస్తుంది. అప్పటికే మత్తుబారినపడిన పిల్లలను బయటపడేసే మార్గాలను షీల్డ్ ఏఐ సూచిస్తుంది. డ్రగ్స్ వాడకం వల్ల అనర్ధాలను వివరిస్తుంది. ఈ టూల్ ప్రత్యేకత ఏమిటంటే 100శాతం గోప్యత పాటించటమే. ఎవరేమి ప్రశ్నలు అడిగినా అడిగిన వాళ్ళకు తప్ప మరొకళ్ళకు ఆ ప్రశ్నలు కనిపించవు.

ఇక చివరది మిత్ర-టీజీ టూల్ ప్రమాదాలను కనిపెడుతుంది. డ్రగ్స్ బారినపడుతున్న 13-19 ఏళ్ళ మధ్య ఉండే టీనేజర్లను కాపాడే ఉద్దేశ్యంతోనే మిత్ర-టీజీ టూల్ ను రూపొందించారు. యుక్తవయసులో తలెత్తే మానసిక, ఆరోగ్య సమస్యలను వివరించి చెబుతుంది. ఉపాధ్యాయులు, తల్లి, దండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిని విశ్లేషించేందుకు అవసరమైన సమస్త సమాచారం ఇందులో ఉంటుంది. పిల్లలు, విద్యార్ధుల ప్రవర్తను గమనించి అందుకు కారణాలను విశ్లేషించేందుకు ఉపయోగపడుతుంది. తల్లి, దండ్రుల కోసమైతే 39 ప్రశ్నలుంటాయి. వీటికి సరైన సమాధానాలు ఇస్తే విశ్లేషించి సమాధానమిస్తుంది. అలాగే టీచర్ల కోసమైతే 7 అంశాలను ప్రశ్నలుగా ఉంచారు. మిత్ర అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోతే వచ్చే విశ్లేషణలు కూడా అలాగే ఉంటాయని గుర్తుంచుకోవాలి. విశ్లేషణల ఆధారంగా అవసరమైన చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు మగతగా ఉండటం, ఒంటరిగా ఉండేదుకు ఇష్టపడటం, తరచూ భోజనం మానేయటం, మాటల్లో తడబాటు లాంటి ప్రశ్నలుంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA