ఫారం 6కి తెలంగాణలో ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. 73 లక్షల ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అవస్తలు సేకరించటానికి వీలుకాదు అని నిర్ధారించుకున్న ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో భాగంగా 73.30 లక్షల ఓట్లను తొలగించటంపై రాజకీయ పార్టీలు మండిపోతున్నాయి.
మొత్తం 92 లక్షల మంది ఓటర్లకు కమిషన్ నోటీసులు జారీచేసినట్లు ఎన్నికల కమిషనర్ పీ సుదర్శనరెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 14 వరకు నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం ఉన్నట్లు కమిషనర్ చెప్పారు.
కమిషన్ తొలగించిన ఓట్లను ఎలాగైనా తిరిగి చేర్పించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ యంత్రాంగాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ లో యాక్టివేట్ చేస్తున్నాయి. ఆగస్టు 10వ తేదీతో పూర్తయిన సర్ ప్రక్రియలో 3.38 కోట్ల ఓట్లనుండి 73 లక్షల ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. కమిషన్ తొలగించిన 73 లక్షల ఓటర్ల అడ్రస్ లపై రెండు పార్టీలు దృష్టిపెట్టాయి. ఈ విషయంలో బీజేపీలో మాత్రం ఎలాంటి ఆందోళన కనబడటంలేదు.
ఈ ఓట్లన్నింటినీ కమిషన్ ఏఎస్ డీడీ అంటే ఆచూకీలేని, శాశ్వతంగా వలస వెళ్ళిన, చనిపోయిన, డూప్లికేట్ ఓట్ల పేరుతో తొలగించింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కమిషన్ 17వ తేదీన ప్రకటించబోతోంది. తొలగించిన ఓట్లవల్ల తమకు తీవ్రనష్టం తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆందోళన పడుతున్నాయి. అందుకనే తొలగించిన ఓట్లను తిరిగి చేర్పించటానికి ఫారం 6 ను రెడీ చేసుకుంటున్నాయి. డ్రాఫ్ట్‌ఓటర్ల జాబితాను తమ దగ్గరున్న ఓటర్ల జాబితాతో సరిపోల్చుకునేందుకు పై రెండుపార్టీలు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ సిద్ధం చేసుకున్నది.
అలాగే బీఆర్ఎస్ కూడా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించింది. 73 లక్షల ఓట్ల తొలగింపుకు ఇంటింటికి వెళ్ళి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వని బీఎల్వోలే కారణమని రెండుపార్టీలు భావిస్తున్నాయి. అందుకనే ఈ సారి ఓటర్ల జాబితాతో పాటు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగా తొలగించిన 73 లక్షల ఓటర్ల ఇళ్ళకు వెళ్ళి అర్హులైన వాళ్ళని తిరిగి ఓటర్ జాబితాలో చేర్పించేందుకు ఫారం 6తో ఇంటింటికి పార్టీలు వెళ్ళాలని డిసైడ్ అయ్యాయి.

