హైడ్రామా మధ్య బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయాడు. శనివారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి బండి సంజయే తన కొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించారు.
మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఫిర్యాదుతో భగీరథ్ పైన పేట్ బషీరా బాద్ పోలీసులు ఈనెల 8వ తేదీన పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపైన పోక్సో కేసు నమోదైందన్న విషయం తెలిసిన దగ్గర నుండి అంటే గడచిన వారంరోజులుగా భగీరథ్ పరారీలో ఉన్నాడు.
కొడుకును అప్పగించిన సందర్భంగా సంజయ్ మాట్లాడుతు ''చట్టంపైన గౌరవంతోనే తన కొడుకును పోలీసులకు అప్పగించాను'' అని చెప్పారు. ''చట్టంముందు తన బిడ్డయినా సామాన్యుడైనా సమానమే'' అన్నారు. ''ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే'' అని చెప్పారు. ''తమ కొడుకు ఏ తప్పూ చేయలేదని ఇప్పటికీ చెబుతున్నాడు'' అని గుర్తుచేశారు. ''ఫిర్యాదు నమోదుకాగానే స్టేషన్లో తానే కొడుకును అప్పగిద్దామని అనుకున్నాను'' అని తెలిపారు. లాయర్లను సంప్రదించి కొడుకుపైన ఆరోపణలను, కొడుకు వాదనను లాయర్ల ముందుంచినట్లు చెప్పారు.
తాము చూపించిన ఆధారాల ప్రకారం కొడుకుపైన నమోదైన కేసును కొట్టేస్తారని లాయర్లు చెప్పటంతోనే కొంత జాప్యం జరిగినట్లు చెప్పారు. అయితే ఇంకా జాప్యం చేయటం సరికాదన్న ఉద్దేశ్యంతోనే అబ్బాయిని లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. న్యాయవ్యవస్ధపైన తనకు సంపూర్ణ విశ్వాసముందని సంజయ్ చెప్పారు.
డ్రామానేనా ?
హైడ్రామా మధ్య భగీరథ పోలీసులకు లొంగిపోయాడని అన్నది ఎందుకంటే లొంగిపోకపోతే పోలీసులు అరెస్టుచేస్తారని సంజయ్ కు అర్ధమైంది. బహుశా ఈ విషయాన్ని లాయర్లు సంజయ్ కు వివరించుంటారు. పోక్సో చట్టం ఎంత బలమైనదో అందులో దోషిగా తేలితే జరగబోయే పరిణామాలన్నింటినీ వివరించి ఉంటారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరగటం కూడా నేరమే అన్న విషయాన్ని లాయర్లు సంజయ్ కు స్పష్టంగా చెప్పుంటారు.
నిజానికి తాను ఏ తప్పుచేయలేదని భగీరథ చెబుతున్నది నిజమే అయితే మొదటిరోజు కొడుకును తీసుకుని సంజయ్ పోలీసులకు అప్పగించి ఉండాల్సింది. కాని సంజయ్ అలాచేయలేదు. కేంద్ర హాంశాఖా మంత్రి కొడుకే పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నాడని, కొడుకును కేంద్రమంత్రే దాచాడనే ప్రచారం ఎంతటి అప్రదిష్ట తెస్తోందో సంజయ్ ఊహించి ఉండరు. ఎప్పుడైతే కొడుకుపైన పోక్సో కేసు నమోదయ్యిందో అప్పటినుండే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు, అనుబంధ సంఘాలు, సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ప్రజాసంఘాలు ప్రతిరోజు సంజయ్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నాయి. ఇంకా కొడుకు తప్పించుకుని తిరుగుతుంటే చివరకు తన పదవికి కూడా ఎసరు వస్తుందనే భయం మొదలయ్యుంటుంది. అందుకనే చివరకు ఏదారీలేక కొడుకును ఈరోజు పేట్ బషీరా బాద్ పోలీసులకు అప్పగించారు. ఇంతోటిదానికి చట్టం ముందు అందరు సమానమే..తప్పుచేస్తే తన కొడుకును అయినా శిక్షించాల్సిందే అని డైలాగులు చెబుతున్నారు.

