జలమండలి జీఎం సగ్గం అనంత లక్ష్మీకుమార్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు చంచల్‌గుడా జైలుకు తరలించారు.
లక్ష్మీకుమార్ నివాంసలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని లక్ష్మీకుమార్ బంధువులు, స్నేహితులకు సంబంధించి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ సోదాల్లో ఆయన నివాసంలో భారీ మొత్తంలో రూ.500 నోట్ల కట్టలు లభించాయి. దాంతో పాటు అనేక ఆస్తులకు సంబంధించి దస్త్రాలు లభించాయి. వాటి రిజిస్ట్రేషన్ విలువే రూ.5.88కోట్లుగా ఉందని అధికారులు గుర్తించారు. ఆ ఆస్తులు బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకుపైగా విలువ చేస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల ప్రకారం ఆయన వద్ద రూ.1.10 కోట్ల నగదు లభించింది.
అలాగే 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇవేకాక సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 18 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో 6 ఇళ్ల స్థలాలు, ఒక ఖరీదైన ఇల్లు, జీహెచ్‌ఎంసీ శివారులోని గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు కూడా ఉన్నట్లు వెల్లడైంది. మారుతి రిట్జ్ కారు, బజాజ్ మోటార్ బైక్‌ను కూడా అధికారులు నమోదు చేశారు.

