Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనాలపై మరోసారి పెట్రో బాంబ్ ?

జనాలపై మరోసారి పెట్రో బాంబ్ ?

తొందరలోనే చమురు సంస్దలు జనాలపై పెట్రోలు బాంబులను వేయబోతున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. ఈనెలలోనే పెట్రోల్, డీజల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈమధ్యనే లీటర్ పెట్రోల్, డీజల్ పైన 3రూపాయలు పెంచిన చమురు కంపెనీలు తొందరలో పెట్రోలో, డీజల్ పై లీటర్ కు 10 రూపాయలు పెంచే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం చాలా దేశాల మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ప్రభావం అంటే గ్యాస్, చమురు సరఫరాకు అంతరాయాలు, ఫలితంగా వాటికి చాలా దేశాల్లోకొరత ఏర్పడింది. ఎప్పుడైతే చమురు, గ్యాస్ కు కొరత వచ్చేసిందో వెంటనే ధరలు ఆటోమేటిక్కుగా పెరిగిపోతాయి. ప్రపంచం అంతా డిమాండ్-సప్లై సూత్రంమీదే నడుస్తోందన్న విషయం కొత్తేమీకాదు.

యుద్ధం కారణంగా ఇరాన్, గల్ఫ్ దేశాల నుండి మనదేశానికి రావాల్సిన గ్యాస్, చమురు సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చమురు దిగుమతుల్లో మనదేశం గల్ఫ్ దేశాల నుండి 70 శాతం దిగుమతి చేసుకుంటోంది. గ్యాస్ దిగుమతులు కూడా గల్ఫ్ దేశాల నుండే ఎక్కువగా ఉంటోంది. హర్మోజ్ జలసంధి నుండి రవాణా సాఫీగా సాగకపోవటం వల్ల చాలా ఓడలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దాంతో దేశంలో చమురు, గ్యాస్ కు డిమాండ్ పెరిగిపోవటంతో ధరలు పెరిగిపోతున్నాయి. ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ ట్యాక్స్ ను రు. 10 తగ్గించినప్పటికీ కంపెనీలు అమ్మే ప్రతి లీటర్ ఇంధనంపై 17 రూపాయలను నష్టపోతున్నాయి. అందుకనే నష్టాలను తగ్గించుకోవటానికి కంపెనీలు ఈమధ్యనే 3 రూపాయలు పెంచాయి. అయినా నష్టాలు తగ్గకపోవటంతో తొందరలోనే లీటర్ పెట్రోల్, డీజల్ కు 10 రూపాయలు పెంచే ఆలోచనలో ఉన్నాయి.

పెట్రోల్, డీజల్ ధరలు పెరిగితే వెంటనే కూరగాయలు, పాలు, పండ్లు, నూనెలు, పప్పుదినుసులు తదితరాల ధరలన్నీ పెరిగిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో రోజువారీ ఇంధన వినియోగం ఎంతంటే 15 వేల కిలోలీటర్లు. పీక్ సమయంలో వినియోగం 20 వేల కిలీలీటర్లకు కూడా పెరుగుతుంది. లీటర్ కు 3 రూపాయలు పెంచినపుడే జనాలపై రోజువారీ భారం రు. 4.5 కోట్లని అంచనా. నెలకు పడే భారం రు. 135 కోట్లు. ఏడాదికి లెక్కవేసుకుంటే జనాలందరిపై పెరిగే భారం రు. 1600 కోట్లు. అలాంటిది తొందరలోనే లీటర్ కు 10 రూపాయలు పెరుగుతుంది అనుకుంటే జనాలపై పడబోయే భారం ఎంతుంటుందో ఎవరికి వారుగా అంచనా వేసుకోవచ్చు. కారణాలు ఏవైనా, చమురు కంపెనీలు ఎన్ని లెక్కలు చెప్పినా పెరగబోయే ధరల భారం పడేది మాత్రం జనాల మీదే కదా. విచిత్రం ఏమిటంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారెల ధరలు పెరుగుతోందని, యుద్ధం ప్రభావం వల్ల చమురు ధరలు పెంచక తప్పటంలేదని జనాలకు చెబుతున్నాయి.

అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారెల్ ధరలు తగ్గిన దామాషాలో మనదగ్గర చమురు ధరలను కేంద్రప్రభుత్వం లేదా చమురు కంపెనీలు తగ్గించటంలేదు. అలాగే యుద్ధ ప్రభావం తొలగిపోయిన తర్వాత కూడా పెంచిన ధరలను తగ్గించటంలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA