పరుల్ చంద్ర
''మనకు శాశ్వత మిత్రులు లేరు.. శాశ్వత శత్రువులు కూడా లేరు. మన ప్రయోజనాలే శాశ్వతమైనవి, నిరంతరాయమైనవి.. ఆ ప్రయోజనాలను సాధించుకోవడం మన కర్తవ్యం'' 1848 లో హౌజ్ ఆఫ్ కామన్స్ లో బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు లార్డ్ పామర్ స్టన్ చెప్పిన ప్రముఖ సూక్తి.
ఇవి తరుచుగా అంతర్జాతీయ దౌత్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి ప్రస్తుతం భారత్- కెనడా దౌత్యంలో కూడా ఉపయోగంలోకి వచ్చారు. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను పునరుద్దరించుకునేందుకు భారత్, కెనడా చర్యలు తీసుకుంటున్నాయి.
ఆచరణాత్మకత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం న్యూఢిల్లీ, అట్టావా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి పున: సమీక్షించుకోవడానికి, పునర్మించడానికి వాస్తవిక రాజకీయాలను అనుసరిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలలో ఎంతో అవసరమైన ఈ పున: ప్రారంభానికి కావలసిన ప్రేరణను అందించిన తన కెనెడియన్ ప్రతిరూపమైన మార్క్ కార్నీ న్యూఢిల్లీ పర్యటన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో కెనడాలో పర్యటించడానికి సిద్దంగా ఉన్నారు.వచ్చే ఏడాది గణతంత్య్ర దినోత్సవ పరేడ్ కు కార్నీని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇరు దేశాలు కూడా పటిష్టమైన బంధాలను పునరుద్ధరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు.ఇప్పుడున్న పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలనే ఆసక్తితో ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిద్దులకు ఆతిథ్యం ఇచ్చింది. వారిద్దరి పర్యటనలు ఒకే సమయంలో జరగడం, దౌత్య, ఆర్థిక రంగాలలో ముందుకు సాగడానికి ఇరుపక్షాలు చేస్తున్న సమష్టి ప్రయత్నాలను స్పష్టం చేసింది.సిద్దూ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రధానమంత్రులు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఇతర విషయాలతో పాటు వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలను ఈ ఏడాది చివరి నాటికి ముగించాలనే తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు నిర్దేశించుకున్నాయి.
భద్రతాపరమైన ఆందోళనలు..
జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వ హాయాంలో సుదీర్ఘకాలం పాటు నెలకున్న దూరం తరువాత ఈ అద్భుతమైన మార్పు చోటుచేసుకుంది. 2018 లోనే కెనడాలోని ఖలిస్తానీ శక్తులకు ఆయన ప్రభుత్వం వంతపాడుతోందని భావించిన న్యూఢిల్లీ, తీవ్ర ఆగ్రహంతో ట్రూడో ను దౌత్యపరంగా దూరం పెట్టింది. కెనెడియన్ సిక్కులు ట్రూడో లిబరల్ పార్టీకీ ఒక ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.అయితే కార్నీ కెనడా పగ్గాలు చేపట్టాక ఒట్టావా వైఖరి మారింది. న్యూఢిల్లీ భద్రతా సున్నితత్వాలను, ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాల గురించిన ఆందోళనలను మరింత పరిణతి చెందిన రీతిలో నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి మూడుసార్లు జరిగిన ఎన్ఎస్ఏ స్థాయి భద్రతా చర్చలు వాటిలో చివరిది.. అక్టోబర్ ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగింది. మొత్తం సంబంధాన్ని దెబ్బతీయకుండా వారి వారి భద్రతా ఆందోళనలను చర్చించడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందించాయి.వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల, ఆర్థిక అవసరాల దృష్ట్యా ఇరుపక్షాలు బలమైన, స్థితిస్థాపకమైన, భవిష్యత్ దృష్టిలో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. ఖలీస్తానీ కార్యకలాపాల వల్ల తమ భద్రత, సార్వభౌమాధికారం దెబ్బతింటున్నాయని న్యూఢిల్లీ భావిస్తున్న నేపథ్యంలో ఒట్టావా ఈ విషయంలో న్యూఢిల్లీ ప్రధాన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.
వాషింగ్టన్ కు అతీతంగా...
మధ్యేవాద శక్తులతో సంబంధాలు పెంచుకోవడానికి కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల విధానాలను సమన్వయం చేసుకోవడానికి కార్నీ అనుసరిస్తున్న వ్యూహంలో భారత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆర్థికవేత్తగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన కార్నీకి.. ట్రంప్ షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఆ దేశాన్ని తమ 51 స్టేట్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. దీనితో రెండు దేశాల మధ్య అత్యంత కనిష్ట స్థాయికి సంబంధాలు దిగజారాయి.దీనితో ఆ దేశానికి తక్షణం మరో అతిపెద్ద దేశంతో ఒప్పందాలు, సంబంధాలు అవసరం అయ్యాయి. అందుకే యూరప్ తోనూ ఆర్థిక భాగస్వామ్యాల కోసం కెనడా అన్వేషించేలా చేసింది. ప్రస్తుతం మెక్సికో తరువాత అమెరికాకు కెనడా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.కెనడా తన వాణిజ్య సంబంధాలను విస్తరించుకోవాలని చూస్తోంది. భారత్ లో కెనడా ఒక విస్తారమైన ఎగుమతి మార్కెట్ ను గణనీయమైన పెట్టుబడి అవకాశాలను చూస్తోంది. ఈ ప్రయత్నానికి అనుగుణంగా ఆ దేశ వాణిజ్య మంత్రి సిద్దూ నేతృత్వంలో 300 మంది సభ్యులతో కూడిన టీమ్ కెనడా ట్రేడ్ మిషన్ భారత్ కు వచ్చింది. గత మూడు దశాబ్ధాలలో ఇదే అతిపెద్ద మిషన్.
దేశీయ పరిశ్రమలు..
భవిష్యత్ సంబంధాలకు లోతైన, విస్తృతమైన ఆర్థిక సంబంధాలు ముఖ్యమైనవి భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో చర్చలు ముమ్మరం కావడంతో సీఈపీఏను ఖరారు చేసేందుకు డిసెంబర్ గడువును చేరుకోవడానికి ఇరుపక్షాలు పోటీ పడుతున్నాయి. ఈ ఒప్పందం దశాబ్దానికి పైగా చర్చల్లో ఉంది.కెనడా గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలిస్తానీ శక్తులపై భారత్- కెనడా మధ్య నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో సీఈపీఏ చర్చలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రూడో ప్రభుత్వం వారి కార్యకలాపాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని న్యూఢిల్లీ భావిస్తోంది. 2023 లో కెనడాలో ఖలీస్తాన్ ఉగ్రవాదీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని ఒట్టావా చెప్పిన తరువాత ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.సీఈఏపీ చర్చలు ఇప్పుడు తిరిగి ప్రారంభం కావడంతో భారత్ తన దేశీయ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. కెనడాతో బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి దేశ ఆకాంక్షకు అదే సమయంలో అంతగా పోటీతత్వం లేని పరిశ్రమ రంగాలను పరిరక్షించుకోవడానికి మధ్య సున్నితమైన సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది.
యురేనియం.. ఇంధనం..
పశ్చిమాసియా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడిచమురు దిగుమతులు కష్టంగా ఉన్న నేపథ్యంలో భారత్ తన ఇంధన వనరులను వైవిధ్య పరచుకోవడానికి కెనడాను ఆశ్రయించవచ్చు. వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం కింద సంప్రదాయ ఇంధనం, పౌర అణుశక్తి కీలక ఖనిజాలు వంటి రంగాలలో ఇరుపక్షాలు సహకరించుకోవాలని చూస్తున్నాయి.ముఖ్యంగా భారత్ అణు విద్యుత్ అవసరాలను తీర్చడంలో కెనడా సహాయపడుతోంది. కార్నీ మార్చి పర్యటన సందర్భంగా ఇరు దేశాలు దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1.8 బిలియన్ డాలర్ల ఈ ఒప్పందం ప్రకారం.. పది సంవత్సరాల పాటు భారతదేశ అణు రియాక్టర్లకు కెనడా.. యురేనియంను సరఫరా చేస్తుంది. భారత్, కెనడా నుంచి మరింత ఎల్ఎన్జీ, ఎల్పీజీ, ముడి చమురును దిగుమతి చేసుకోవాలని కూడా కోరుకుంటోంది.అంతిమంగా ఇరుపక్షాలు ఒకరి నుంచి ఒకరు ఎంతో ప్రయోజనం పొందగలవు. ఈ పంథాను కొనసాగించడానికి వ్యూహాత్మక ప్రయోజనాలు సర్వోన్నతంగా ఉండేలా, ద్వైపాక్షిక సంబంధాలు సమతుల్యంగా ఉండేలా చూసేందుకు నేర్పుగల దౌత్యం అవసరం.

