Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళలో మే 26న మాన్సూన్ ఎంట్రీ : తెలంగాణలో త్వరలో వర్షాలు

కేరళలో మే 26న మాన్సూన్ ఎంట్రీ : తెలంగాణలో త్వరలో వర్షాలు

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 26న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రకటించింది.

సాధారణ తేదీ కంటే ముందుగానే మాన్సూన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో తెలంగాణలోనూ జూన్ తొలి పక్షంలో వర్షాలు కురిసి ఎండల తీవ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రుతుపవనాల రాకపై ఐఎండీ అంచనా

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు మే 26వతేదీన కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారత భూభాగంలోకి నైరుతి రుతువపనాల ప్రవేశం కేరళతో ప్రారంభం కానుంది. రుతువపనాలు ఉత్తర దిశగా ముందుకు సాగుతున్న కొద్దీ ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు 'ఫెడరల్ తెలంగాణ'కు చెప్పారు. వేసవికాలం నుంచి వర్షాకాలానికి మారడాన్ని నైరుతి రుతుపవనాలు సూచికగా నిలవనున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళలో జూన్ 1వతేదీన ప్రారంభం అవుతుంటాయి.

గతంలో రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశించాయంటే...

2025వ సంవత్సరంలో మే 27వతేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేయగా మూడు రోజులు ముందుగానే మే 24న వచ్చేశాయి. 2024వ సంవత్సరంలో మే 31 రుతుపవనాలు వస్తాయని అంచనా కాగా ఒక రోజు ముందుగా మే 30 న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఆరంభం అయ్యాయి. 2023వ సంవత్సరంలో జూన్ 4 అంచనా వేయగా జూన్ 8వతేదీన రుతువపనాలు ప్రవేశించాయి. 2022లో మే 27వతేదీ అంచనా వేయగా మే 29న రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ప్రారంభం అయ్యాయి.2021లో జూన్ 3వతేదీన, 2020వ సంవత్సరంలో జూన్ 1వతేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని ఐఎండీ అధికారులు చెప్పారు. గత అనుభవాల నేపథ్యంలో నాలుగురోజుల ఎర్రర్ మోడల్ తో ఈ ఏడాది మే 26వతేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.

తెలంగాణలో రుతుపవనాల ఆరంభ తేదీల్లో మార్పు?

వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ఈ ఏడాది తెలంగాణలో జూన్ మొదటి వారాంతంలో లేదా జూన్ 2వ వారం ప్రారంభంలో రుతుపవనాల ప్రవేశం జరిగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఉత్తర దిశగా కదులుతున్న మిసో (MISO) సిగ్నల్ ముందుగానే ప్రారంభం కావడం వల్ల జూన్ 1వ అర్ధభాగం నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడానికి బలం చేకూరుతుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఎల్ నినో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఈ సంవత్సరం మనం సకాలంలో రుతుపవనాల ప్రవేశాన్ని చూడవచ్చునని పేర్కొన్నారు. అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడితే తప్ప ఇవి వర్తించవు. వివిధ కారణాల వల్ల పరిస్థితులు మారే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వివరించారు.

హైదరాబాద్ లో కురిసిన మోస్తరు వర్షం (ఫొటో కర్టసీ : తెలంగాణ వెదర్ మ్యాన్)

హైదరాబాద్ లో మోస్తరు వర్షం

హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాలుగున్నర గంటలకు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసిందని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది. తూర్పు హైదరాబాద్ వైపున ఉన్న హబ్సిగూడ, చిలకానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మల్కాజిగిరి పరిసరాల్లో అక్కడక్కడా భారీ వర్ష మేఘాలు ఏర్పడ్డాయి.నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి వాతావరణం ఎక్కువగా పొడిగానే ఉండే అవకాశం ఉంది.ఉప్పల్, నాగోల్, రామాంతపూర్, ఓయూ, తార్నాక, మలక్‌పేట్, నాచారం, కాప్రా, మల్కాజ్‌గిరి, మౌలాలి సమీప ప్రాంతాల్లో వర్షం కురిసిందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెదర్ మ్యాన్ వివరించారు.

హీట్ వేవ్ పై తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన చిత్రపటం

తీవ్రమైన వడగాలుల హెచ్చరిక

మే 14 నుంచి మే 21 వరకు తెలంగాణలో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా పై చిత్రపటంలో రెడ్ మార్క్ చేసిన జిల్లాల్లో మే 14 నుంచి తీవ్రమైన వేడి ఉంటుంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47డిగ్రీల సెల్సియస్ కు కూడా చేరవచ్చునని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉందని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ వాసులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాలు, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగుతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 44నుంచి 45డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, దీనివల్ల తీవ్రమైన వేడిగాలులు వీచాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA