Dailyhunt
మాటలు కలిపిన అమెరికా, రష్యా అధినేతలు

మాటలు కలిపిన అమెరికా, రష్యా అధినేతలు

గ్ర రాజ్యాల అధిపతులైన పుతిన్, ట్రంప్ సుదీర్ఘంగా ఫోన్ లో మాట్లాడుకున్నారని, ఈ సంభాషణలో పశ్చిమాసియా సంక్షోభం, రష్యా- ఉక్రెయిన్ వివాదాల గురించి చర్చించినట్లు క్రెమ్లిన్ తెలిపింది.

ఇరువురు నేతల మధ్య దాదాపు గంటన్నర (90) నిమిషాలు పైగా జరిగిందని వెల్లడించింది.

ఈ సంభాషణ "నిష్కపటంగా, వృత్తిపరంగా" జరిగిందని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ అభివర్ణించారు. మాస్కో ప్రకారం, ఈ చర్చలో ఇరాన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన ఉద్రిక్తతలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఇది చర్చలకు ఆస్కారం కల్పించి, అస్థిర పరిస్థితిని స్థిరీకరించడంలో సహాయపడే ఒక చర్య అని ఆయన అన్నారు.అయితే అమెరికా, ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్ పై సైనిక చర్యకు దిగితే "అత్యంత నష్టదాయక పరిణామాలు" ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. అటువంటి ఉద్రిక్తత కేవలం ఈ ప్రాంతాన్నే కాకుండా విస్తృత అంతర్జాతీయ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు.సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు సాయం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని కూడా ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై ఆరోపణలు.
ఉక్రెయిన్ విషయంలో నాయకులు యుద్ధరంగ పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సరిహద్దు వెంబడి జరుగుతున్న పరిణామాలపై పుతిన్ ట్రంప్‌కు వివరించారని, రష్యా బలగాలు "వ్యూహాత్మక చొరవ" తో ముందుకు సాగుతున్నాయని ఉషాకోవ్ చెప్పారు.క్రెమ్లిన్ ప్రకారం.. ఇద్దరు నాయకులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రభుత్వంపై ఒకే విధమైన అంచనాలను వ్యక్తం చేశారు. యూరోపియన్ మద్దతుతో సంఘర్షణను పొడిగిస్తున్నారని ఆరోపించారు. 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధం వేలాది మంది మరణానికి, లక్షలాది మంది నిరాశ్రయులవడానికి కారణమై, విస్తృతమైన విధ్వంసాన్ని సృష్టించింది. ఉక్రెయిన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణను పుతిన్ ప్రతిపాదించారు.రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ సాధించిన విజయానికి గుర్తుగా మే 9న రష్యా జరుపుకునే విజయ దినోత్సవ వేడుకల సందర్భంగా పుతిన్ తాత్కాలిక కాల్పుల విరమణను కూడా ప్రతిపాదించారు. ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ కు దీనికి మద్దతు పలికారు.ఉక్రెయిన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఏడాది మాస్కోలో జరిగే విజయ దినోత్సవ కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహిస్తామని క్రెమ్లిన్ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA