ఇరాన్ పై రెండో విడత దాడికి సంబంధించి అమెరికా- ఇజ్రాయెల్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలిసింది.
ఈ చర్చల సందర్భంగా అమెరికా, ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి సముఖత వ్యక్తం చేయగా, ఇజ్రాయెల్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం.
మంగళవారం ట్రంప్‌తో ఫోన్ సంభాషణ తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడానికి, దాని కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఆ దేశ పాలనను బలహీనపరచడానికి దాడులను పునఃప్రారంభించాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఆసక్తిగా ఉన్నారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ బుధవారం నివేదించింది.ఖతార్, యూఏఈ సహా అరబ్ దేశాల అభ్యర్థన మేరకు మంగళవారం ఇరాన్‌పై జరపాల్సిన దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ ఆదివారం తెలిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్న అంతరాలను పూడ్చే ప్రయత్నంలో భాగంగా, ఇతర ప్రాంతీయ మధ్యవర్తుల సలహాలతో ఖతార్, పాకిస్తాన్‌లు ఒక సవరించిన శాంతి ఒప్పంద పత్రాన్ని రూపొందించాయని ఆక్సియోస్ వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. అయితే నెతన్యాహూ మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదని, రెండో విడత దాడిలో దాని కీలక సైనిక మౌలిక సదుపాయాలు నాశనం చేసి, దానిని మరింత అంధకారంలోకి నెట్టాలని భావిస్తున్నారు.
ట్రంప్ ఆశాభావం..
ఒక ఒప్పందం కుదరవచ్చని తాను భావిస్తున్నానని, కానీ అది కుదరకపోతే యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెబుతూనే ఉన్నారు. "ప్రశ్న ఏమిటంటే, మనం వెళ్లి దానిని ముగించేస్తామా, లేక వారు ఒక పత్రంపై సంతకం చేస్తారా. ఏం జరుగుతుందో చూద్దాం," అని ఆయన బుధవారం కోస్ట్ గార్డ్ అకాడమీలో అన్నారు.ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి, యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి మధ్య అమెరికా మరియు ఇరాన్ "సరిహద్దు రేఖపై" ఉన్నాయని ఆయన అన్నారు. "ఇది సరిగ్గా సరిహద్దు రేఖపైనే ఉంది, నన్ను నమ్మండి. మాకు సరైన సమాధానాలు లభించకపోతే, ఇది చాలా వేగంగా జరిగిపోతుంది. మేమంతా సిద్ధంగా ఉన్నాము. మాకు సరైన సమాధానాలు లభించాలి. అవి పూర్తిగా 100 శాతం మంచి సమాధానాలు అయి ఉండాలి," అని కనెక్టికట్‌లోని కోస్ట్ గార్డ్ అకాడమీ నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వచ్చిన తర్వాత ట్రంప్ విలేకరులతో అన్నారు.
యుద్ధానికి ఇజ్రాయెల్ మొగ్గు..
ఐడీఎఫ్ లోని కీలక అధికారులు మాత్రం యుద్దానికి మొగ్గు చూపుతున్నారని, ఇరాన్ కావాలనే దౌత్యపరంగా కాలయాపన చేస్తుందని, అమెరికా దాడులకు అనుమతి ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీఎన్ఎన్ వార్తలు ప్రసారం చేసింది. ఇరాన్ విషయంలో నెతన్యాహు "నేను కోరుకున్నది ఏదైనా చేస్తారు" అని ట్రంప్ అన్నారు, అయితే తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు. కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తున్నట్లు ఇరాన్ ధృవీకరించింది. కానీ ఇంకా ఎలాంటి సానుకూలత సంకేతాలు చూపలేదు. "ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన ఆధారంగా" చర్చలు కొనసాగుతున్నాయని, మధ్యవర్తిత్వానికి సహాయపడటానికి పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి టెహ్రాన్‌లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.యుద్ధాన్ని అధికారికంగా ముగించడానికి, ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై 30 రోజుల చర్చల కాలాన్ని ప్రారంభించడానికి అమెరికా, ఇరాన్‌లు సంతకం చేసే "ఉద్దేశ్య పత్రం"పై మధ్యవర్తులు పనిచేస్తున్నారని ట్రంప్ నెతన్యాహుతో చెప్పినట్లు, ఈ సంభాషణ గురించి సమాచారం తెలిసిన కొంతమంది ఆక్సియోస్ కు తెలిపారు.

