Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తతలు

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తతలు

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా కమ్‌జోంగ్ జిల్లాలోని ఓ గ్రామంలో పలు ఇళ్లకు నిప్పంటించడం కలకలం రేపింది.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

అక్టోబర్ 21 బుధవారం ఉదయం సుమారు 5.30 గంటలకు చస్సాద్ గ్రామానికి సమీపంలోని ఖోయికై కుకీ గ్రామంలో అనుమానిత మిలిటెంట్లు పలు ఇళ్లకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. కుకీ, నాగా వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో ఈ గ్రామంలోని ప్రజలు ఇప్పటికే ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో జరిగిన నష్టం ఎంత, నిప్పంటించిన వారెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు, ఇటీవల జరిగిన హింసలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే స్పందించాలని ఖర్గే డిమాండ్ చేశారు.

2023 మే నుంచి మణిపూర్‌లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 24,530 మంది ఇప్పటికీ సహాయ శిబిరాల్లో ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, ఇతర బలహీన వర్గాల కుటుంబాలు ఈ సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అన్నారు.

2023 జూన్‌లో అమిత్ షా ఏర్పాటు చేసిన శాంతి కమిటీ ఏం చేస్తోందని ఖర్గే ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ సిఫారసులపై తీసుకున్న చర్యలేంటో వెల్లడించాలని కోరారు. సహాయ శిబిరాల్లో 31 అసహజ మరణాలపై సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పటికీ, వేలాది మంది ఇంకా ఎందుకు నిరాశ్రయులుగా ఉన్నారని ప్రశ్నించారు. బాధిత మహిళలు, చిన్నారులు, నిరాశ్రయ కుటుంబాల భద్రత, పునరావాసం కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఖర్గే ప్రశ్నించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం, ముఖ్యమంత్రిని మార్చడం, తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు జరిగినా శాంతి నెలకొనలేదని విమర్శించారు.

2023 మేలో మెయితీ, కుకీ వర్గాల మధ్య మొదలైన జాతి ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 306 మంది మరణించగా, 49 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వేలాది మంది ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కుకీ, నాగా వర్గాల మధ్య ఘర్షణల్లోనూ 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి. తమాంగ్‌లాంగ్, నోనీ, కాంగ్‌పోక్పి, ఉఖ్రుల్, కమ్‌జోంగ్ జిల్లాల్లో హింస ప్రభావం కనిపిస్తోంది.

మణిపూర్‌లో ప్రజల భద్రత, నిరాశ్రయుల పునరావాసం, శాంతి పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA