Dailyhunt
మంత్రులు లేని జిల్లాలు.సలహాదారులే సూత్రధారులా?

మంత్రులు లేని జిల్లాలు.సలహాదారులే సూత్రధారులా?

తెలంగాణ రాష్ట్రంలో ఎ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండేళ్లు దాటినా పలు జిల్లాలకు మంత్రుల ప్రాతినిధ్యం లేదు. ఖమ్మం,కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అయితే ముగ్గురేసి, ఇద్దరేసి చొప్పున మంత్రులుండగా, పలు ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో అసలు ప్రాతినిథ్యమే లేకుండా పోయింది.

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా లేదు.రంగారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.రంగారెడ్డి, నిజామాబాద్ వంటి ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని మరింత పెంచుతోంది. మంత్రివర్గ సమావేశం దృష్టికి ఆయా జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పే వారు కరువయ్యారు. జిల్లా ఇన్ చార్జి మంత్రులున్నా, వారు చుట్టపుచూపుగా వచ్చి పోవడం తప్పితే అసలు జిల్లా సమస్యలను పరిష్కరించే వారు కరువయ్యారు.

సలహాదారులే సూత్రధారులు

మంత్రులు లేని పలు జిల్లాల్లో మంత్రుల హోదాలో నియమితులైన సలహాదారులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. సలహాదారుల పోస్టులు నామినేటెడ్ కావడంతో ప్రభుత్వంలో వారికంత ప్రాధాన్యం లభించడం లేదని చెబుతున్నారు.రాష్ట్ర అభివృద్ధిలో సమాన ప్రాతినిధ్యం కీలక అంశం. అయితే ప్రస్తుత తెలంగాణ కేబినెట్‌లో కొన్ని జిల్లాలకు మంత్రులు లేకపోవడం ప్రాంతీయ అసమానతలను వెలుగులోకి తెస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు వీ హనుమంతరావు, షబ్బీర్ అలీ, జితేందర్ రెడ్డి,హర్కార వేణుగోపాల్ రావు,చిన్నారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కేశవరావు తదితరులను సలహాదారులుగా రాష్ట్రప్రభుత్వం నియమించింది.

రెండేళ్లుగా పెండింగులోనే మంత్రివర్గ విస్తరణ

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇంకా రెండు మంత్రి పదవుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.పెండింగ్‌లో ఉన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రెండేళ్లు దాటినా ఇంకా అనిశ్చితంగానే ఉంది. రెండు మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉండటంతో, ఈ జాప్యం అధికార కాంగ్రెస్‌లో తీవ్రమైన ఊహాగానాలకు దారితీసింది. ఈ రెండు పదవుల కోసం 20 మందికి పైగా ఆశావహులు పోటీలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పారు.మంత్రి పదవుల కోసం పోటీ పెరగడంతో అమాత్యుల ఎంపిక ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారింది. కుల సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సీనియర్ నాయకులు మరియు యువ ఎమ్మెల్యేల అంచనాలను సమతుల్యం చేయడం పార్టీ నాయకత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. అంతర్గత అసమ్మతిని రేకెత్తించకుండా జాగ్రత్త పడుతూ, కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.

ఉప ఎన్నిక పుణ్యమా అని మైనారిటీ కోటా మంత్రి పదవి భర్తీ

రెండేళ్ల పాటు తెలంగాణ మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీ సభ్యుడు లేరు. ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న మైనారిటీ మంత్రి కోటాలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మహమ్మద్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కు ఇటీవల ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా కింద నియమించి మంత్రి పదవిలో అజహరుద్దీన్ ను కొనసాగించారు.

మంత్రి పదవుల కోసం లాబీయింగ్

తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానవర్గం పరిశీలించవచ్చని పార్టీ ఆశావహులు చెబుతున్నారు.తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన రాజకీయ అంశంగా మారింది. కేబినెట్‌లో మిగిలి ఉన్న ఖాళీ బెర్త్‌లను దక్కించుకునేందుకు సీనియర్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది.సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. మంత్రి పదవుల కోసం సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు

మంత్రి పదవి ఆశిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏ చిన్న అవకాశం దొరికినా ఢిల్లీ విమానం ఎక్కేస్తున్నారు. ఏఐసీసీ పెద్దలు, పార్టీ అధిష్ఠానం వద్ద తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోశామని, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నామని కొందరు సీనియర్లు వాదిస్తున్నారు.పార్టీ అధికారంలో లేనప్పుడు వలసలు వెళ్లకుండా, ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగిన తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంకొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కుల, సామాజిక సమీకరణాలు

తెలంగాణ రాజకీయాల్లో సామాజిక వర్గాల పాత్ర కీలకం కావడంతో ముఖ్యమంత్రి, అధిష్ఠానం ఈ సమీకరణాలను కచ్చితంగా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.కేబినెట్‌లో తమ వర్గానికి జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం దక్కలేదని, రాబోయే విస్తరణలో కచ్చితంగా బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని ఆయా వర్గాల నేతలు పట్టుబడుతున్నారు.జిల్లాల వారీగా ప్రాతినిధ్యం: ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఉదాహరణకు నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి లాంటి జిల్లాలకు చెందిన సీనియర్లు ఈసారి మంత్రి పదవి తమకే దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు.

సీఎం ముందున్న సవాళ్లు

ఒకవైపు మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, మరోవైపు కేబినెట్‌లో ఉన్న ఖాళీలు తక్కువగా ఉండటం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది.సీనియర్లను, పార్టీలోకి కొత్తగా వచ్చిన బలమైన నేతలను సమన్వయం చేసుకుంటూ వెళ్లడం సీఎంకు సవాలుగా మారింది. పదవి దక్కని వారు అసంతృప్తికి లోనైతే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యే ప్రమాదం ఉంది. దీన్ని ముందే పసిగట్టి, వారికి కార్పొరేషన్ చైర్మన్లు లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానందే...

రాష్ట్ర నాయకత్వం ఎంత కసరత్తు చేసినా, తుది నిర్ణయం మాత్రం ఏఐసీసీ పెద్దలదే. ఇంటెలిజెన్స్ నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, నాయకుల పనితీరును దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది.మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల రేసు ఒక ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌ను తలపిస్తోంది. ఎవరికి పట్టాభిషేకం జరుగుతుందో, ఎవరికి నిరాశ మిగులుతుందో తేలాలంటే అధిష్ఠానం అధికారిక జాబితా విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే!

ఆశావహుల మధ్య తీవ్ర పోటీ

తెలంగాణలో మంత్రి పదవులు కేవలం రెండు మాత్రమే ఖాళీగా ఉండగా, ఆశిస్తున్న సీనియర్ నేతల సంఖ్య పదుల సంఖ్యలో ఉంది.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన సీనియర్లతో పాటు, ఇతర పార్టీల (ముఖ్యంగా బీఆర్ఎస్) నుంచి వచ్చిన బలమైన నేతలు కూడా మంత్రి పదవులను ఆశిస్తుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోవడం ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారింది.రెడ్డి, కమ్మ, వెలమ వర్గాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలను బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. ఏ వర్గానికి అన్యాయం జరిగినా అది ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుంది.లోక్‌సభ ఎన్నికలు, ఇతర కీలక సమయాల్లో పార్టీలో ఎలాంటి అలజడి లేకుండా చూసుకునేందుకే వ్యూహాత్మకంగా మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారు. పదవులపై ఆశలు సజీవంగా ఉంచడం ద్వారా అందరినీ దారిలో పెట్టుకునే రాజకీయ వ్యూహం కూడా ఇందులో దాగి ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పెద్దల చేతుల్లోనే నిర్ణయం

కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న నిర్ణయమైనా ఢిల్లీ కేంద్రంగానే జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.పదవుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి పెద్దల ఆమోదం తప్పనిసరి. అయితే, జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ వ్యవహారాలు, దేశ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం తగిన సమయం వెచ్చించలేకపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.

నామినేటెడ్ పదవులతో బుజ్జగింపులు

మంత్రి పదవులు ఇవ్వలేని వారికి కార్పొరేషన్ చైర్మన్లు . ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం మొదటగా ఎంచుకుంది. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ, అసలైన కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

రెండు అమాత్య పదవులు ఖాళీగానే...

2026 మే నాటికి తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో గరిష్టంగా 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.గత ఏడాది జూన్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు కొత్త మంత్రులు జి వివేక్ వెంకట స్వామి, ఎ. లక్ష్మణ్ కుమార్, వి. శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మహమ్మద్ అజహరుద్దీన్ ను మైనారిటీ మంత్రిగా నియమించారు. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ పరిమాణం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు.

ప్రాతినిధ్యం లేని జిల్లాలు

ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం చూస్తే మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఇక్కడి నుంచి సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి (బోధన్) రేసులో ఉన్నప్పటికీ మొదటి విడతలో అవకాశం రాలేదు. దీంతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి కేబినెట్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పెట్టారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ శివారు ప్రాంతాలు)రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన జిల్లా అయినప్పటికీ ఈ జిల్లా నుంచి ప్రస్తుతం కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. మల్‌రెడ్డి రంగారెడ్డి వంటి నేతలు పదవి కోసం ఎదురుచూస్తున్నారు.ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుతోపాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, ధనసరి అనసూయలున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డితొ పాటు జుపల్లి కృష్ణారావు మంత్రులుగా ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

కేవలం ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లను భర్తీ చేయడమే కాకుండా, పనితీరు సరిగ్గా లేని ఇద్దరు లేదా ముగ్గురు పాత మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.మంత్రి పదవి కోసం ప్రధానంగా ఐదుగురు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు)కి మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం గతంలోనే హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయశాంతి (ఎమ్మెల్సీ)కి ఢిల్లీ పెద్దలతో పరిచయాలున్నాయి.మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేనందున, సీనియార్టీ ప్రాతిపదికన ఈయన పేరు పరిశీలనలో ఉంది.ప్రేంసాగర్ రావు (మంచిర్యాల) వెనుకబడిన వర్గాలు లేదా ఉత్తర తెలంగాణ కోటాలో ఈయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈయనను తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది.బాలు నాయక్, రాంచందర్ నాయక్ లలో ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA