Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ పొదుపు మంత్రం: చేవెళ్లలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అమలు

మోదీ పొదుపు మంత్రం: చేవెళ్లలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అమలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలకు పొదుపు మంత్రం పేరుతో చేసిన సూచనలను చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్నారు.మోదీ పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

ఈవీ కార్లపై ప్రచారం

పెరిగిపోతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో తాను తన వంతు కృషి చేస్తున్నానని ప్రకటించారు. ''చేవెళ్ల నియోజకవర్గంలో నేను, నా బృందం ఎప్పుడూ రెండు డీజిల్ కార్లలో ప్రయాణించేవాళ్లం. యుద్ధం మొదలైనప్పటి నుంచి నేను, నా బృందం ఒకే కారులో వెళ్లడం మొదలుపెట్టాం''అని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఎక్స్ పోస్టులో వెల్లడించారు.మోదీ చమురు దిగుమతులు తగ్గించాలని కోరిన నేపథ్యంలో, విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

ఐటీ కారిడార్ (హైదరాబాద్) లోని ఉద్యోగులు వీలైనంత వరకు ప్రజా రవాణా లేదా ఈవీలు వాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎల్ పీజీ స్టవ్ కు ప్రత్యామ్నాయంగా బీజీఎస్ స్టవ్

ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా బీజీఎస్

ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్‌లు (బీజీఎస్) ప్రారంభించానని, తన ఇంట్లో వంటలో కొంత భాగం బీజీఎస్‌తోనే చేస్తున్నామని ఎంపీ స్వయంగా బీజీఎస్ స్టవ్ పై వంట చేసిన వీడియోలోను ఎక్స్ పోస్టులో పెట్టారు.

బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్‌లను మరింత ఉధృతంగా ప్రోత్సహించాలని ఎంపీ కె విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.

పుల్కాలు తయారు చేస్తున్న ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి (ఫొటో : ఎక్స్ పోస్టు)

చపాతీల స్థానంలో పుల్కాలు

వంటనూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వంటకాల్లో వినూత్న మార్పులు చేశారు.తినే నూనె వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. ఫుల్కాలు మరియు జొన్న రొట్టెల వైపు మారాలి అని ఎంపీ ప్రచారం చేస్తున్నారు. వంటనూనె లేకుండా చపాతీల స్థానంలో పుల్కాలు, జొన్న రొట్టెలు చేయించుకొని తింటున్నానని ప్రకటించారు.ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్‌ పై పుల్కాలు తయారు చేసిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రజలంతా నూనె చపాతీల నుంచి పుల్కాలు, జొన్న రొట్టెలకు మారాలని ఎంపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బంగారం కొనవద్దని ప్రచారం

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పర్యటనల్లో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బంగారం కొనవద్దని ప్రచారం చేపట్టారు. ''బంగారం అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఉత్పాదకత లేని పెట్టుబడి) అది దేశం నుంచి డాలర్లను బయటకు పంపిస్తుంది''అని ప్రజలకు ఎంపీ వివరిస్తున్నారు.భౌతిక బంగారానికి బదులుగా సోవరీన్ గోల్డ్ బాండ్స్ (SGB) లేదా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపాలని ఆయన మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

తెలంగాణలో ప్రధాని మోదీ "పొదుపు మంత్రాన్ని" క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ముఖ్య నాయకులలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA