Dailyhunt
పైలట్ ట్రైనింగ్‌లో లైంగిక దాడి, ఇన్‌స్ట్రక్టర్ అరెస్ట్

పైలట్ ట్రైనింగ్‌లో లైంగిక దాడి, ఇన్‌స్ట్రక్టర్ అరెస్ట్

సికింద్రాబాద్ బేగంపేటలోని పైలట్ ట్రైనింగ్ సంస్థలో ఘోర ఘటన వెలుగుచూసింది. యువతిపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్ కేసులో ఇన్‌స్ట్రక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

'ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్'లో శిక్షణ పొందుతున్న యువతిని లక్ష్యంగా చేసుకుని అదే సంస్థలో పనిచేస్తున్న నసిముద్దీన్ దాడికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

బాధితురాలి సమాచారం ప్రకారం, 2025 జనవరి నుంచి శిక్షణ ఇస్తాననే పేరుతో నిందితుడు ఆమెకు దగ్గరయ్యాడు. తరువాత మాయమాటలతో నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిసింది. అక్కడితో ఆగకుండా, దాడి సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను ఉపయోగించి ఆమెను బెదిరిస్తూ కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు నివాసాన్ని మార్చుకున్నప్పటికీ బెదిరింపులు ఆగలేదు.

పరిస్థితులు మరింత దిగజారడంతో ఆమె తన పైలట్ శిక్షణను మధ్యలోనే ఆపేసింది. చివరకు ధైర్యం చేసి బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు 30 ఏళ్ల వయసు గల కేరళకు చెందిన వ్యక్తిగా, అదే సంస్థలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ పాత్రపై కూడా ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ సంఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రక్షణ కల్పించాల్సిన విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసును విచారిస్తూ తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA