దేశంలో పులుల సంఖ్య పెరగడం వన్యప్రాణి సంరక్షణ విజయానికి నిదర్శనంగా నిలుస్తుండగా, వాటి ప్రాణాలకు రైల్వే పట్టాలు పెను ముప్పుగా మారుతున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతాల నుంచి తెలంగాణ అడవులకు వలస వచ్చే పులులు తరచూ రైలు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని టైగర్ కారిడార్ గుండా వెళ్లే రైల్వే మార్గాలు పులులకు మృత్యుమార్గాలుగా మారడంతో వన్యప్రాణి సంరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల వేగ నియంత్రణ, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటి నివారణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.
44 పులుల మృత్యువాత
మహారాష్ట్ర పులులు తెలంగాణలోకి వలస వచ్చేందుకు రైల్వే ట్రాక్ దాటుతూ రైలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లోని రైలు పట్టాలు పులుల పాలిట రక్తసిక్తంగా మారుతున్నాయి.జీవవైవిధ్యాన్ని పరిరక్షించే పులులు తరచూ మృత్యువాత పడుతుండటం వన్యప్రాణుల ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే 44కు పైగా పులులు మృత్యువాత పడ్డాయని సాక్షాత్తూ మహారాష్ట్ర వన్యప్రాణుల విభాగం అధికారులే ప్రకటించారు.

టైగర్ కారిడార్ లో రైలు పట్టాలు పులులకు మృత్యుమార్గం
తాడోబా, అంథారీ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లోని కన్హరాగాం, కావలి, ఉమ్రేడ్, కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. చాందా ఫోర్ట్-గోండియా రూట్ లో ఉన్న టైగర్ కారిడార్ లో రైలు పట్టాలు పులులకు మృత్యుమార్గాలుగా మారాయి. ఈ రైలు మార్గం కిల్లర్ లైన్ గా మారిందని వైల్డ్ లైఫ్ యాక్టివిస్టు మిలింద్ పరివాకం ఆరోపించారు. పులుల మరణాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు టైగర్ కారిడార్ లో రైళ్ల వేగం తగ్గించి, రైల్వే అండర్ పాస్ లను నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలకు మిలింద్ లేఖలు రాశారు. అభయారణ్యాల్లోని పులులతోపాటు వివిధ వన్యప్రాణులు తరచూ రైలు పట్టాలను దాటుతుంటాయి. ఇలా పులులు, వన్యప్రాణులు రైల్వే ట్రాక్ దాటుతున్నపుడు వేగంగా వచ్చే రైళ్లు ఢీకొని మృత్యువాతపడుతున్నాయి. 2001 వ సంవత్సరం నుంచి 130 వన్యప్రాణులు రైలుపట్టాలపై ప్రాణాలు కోల్పోయాయని అటవీశాఖ అధికారుల గణాంకాలే చెబతున్నాయి. ఇటీవల 19 పులులు రైళ్ల కింద పడి మరణించాయి. 2018వ సంవత్సరంలో మూడు పులి పిల్లలు జునోనా ప్యాసింజరు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాయి. రైలు వేగం వల్లనే పులి మరణించిందని దర్యాప్తులో తేలింది.
టైగర్ కారిడార్ లో రైళ్ల వేగం తగ్గించరా?
టైగర్ కారిడార్ లో అభయారణ్యాల మీదుగా వెళ్లే రైలు మార్గాల్లో రైళ్లను గంటకు 60 కిలోమీటర్ల వేగం కంటే 40 కిలోమీటర్ల వేగానికి తగ్గించాలని వన్యప్రాణి యాక్టివిస్టు దినేష్ ఖాటే డిమాండ్ చేశారు. పులులు, వన్యప్రాణుల వరుస మరణాలపై నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ వన్యప్రాణి యాక్టివిస్టు దినేష్ ఖాటే బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ లో పిల్ దాఖలు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా రైళ్ల వేగం తగ్గలేదు. ప్రమాదాల నివారణకు వీలుగా వన్యప్రాణులు రైల్వేలైన్ వద్ద అండర్ పాస్ లు నిర్మించాలని కోరినా రైల్వే శాఖ అధికారుులు పట్టించుకోలేదు. దీంతో తరచూ పులులు ప్రమాదాల బారిన పడుతున్నాయి.
తాజాగా ఆడపులి మృత్యువాత
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండియా-బాలార్షా మార్గంలో సిందెవాహి- రాజోలి రైల్వే స్టేషన్ల మధ్య సిందే వాహి రేంజిలోని లొఖారీ బీట్ వద్ద రైల్వేలైన్ ను మూడేళ్ల ఆడ పులి తెల్లవారుజామున 5,15 గంటలకు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలపై పులి అక్కడికక్కడే మరణించింది. రైలు లోకో పైలెట్ రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించగా వారు అటవీశాఖ అధికారులకు చేరవేశారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్ , పశువైద్యులు డాక్టర్ రవికాంత్ ఖోబ్రాగదే, వినోద్ సూర్పం, సీసీఎఫ్ రామానుజం అటవీ శాఖ అధికారులు వచ్చి పులి కళేబరాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
పులుల మృతిపై ఆందోళన
మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో రైలు ప్రమాదంలో ఒక ఆడపులి మృతి చెందింది. సిందేవాహి అటవీ పరిధిలోని లొన్‌ఖైరి బీట్, కంపార్ట్‌మెంట్ నంబర్ 247 వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. 2025వ సంవత్సరంలో మహారాష్ట్రలో మొత్తం 41 పులులు మరణించాయని, వాటిలో అత్యధికం సహజ కారణాలతో మరణించాయని మహారాష్ట్ర మంత్రి అసెంబ్లీకి తెలిపారు.ప్రమాదాలు, విద్యుదాఘాతం, వేట కారణంగా పులుల మరణాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేష్ నాయక్ తెలిపారు. మహారాష్ట్రలోని అనేక అటవీ విభాగాలు, తాడోబా-అంధారి, నవేగావ్-నాగ్జీరా పులి సంరక్షణ కేంద్రాల సున్నితమైన బఫర్ జోన్‌ల గుండా వెళ్లే బల్లార్‌షా-గోండియా రైల్వే లైన్ పులులకు మృత్యుమార్గంగా మారిందని మంత్రి ప్రస్తావించారు. అడవి జంతువుల సురక్షిత సంచారానికి వీలుగా కొత్తగా ప్రతిపాదించిన రైలు మార్గాలపై అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. సున్నితమైన అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైళ్లకు గంటకు 40 కిలోమీటర్ల వేగ పరిమితిని అమలు చేయడం, జంతువులు పట్టాల వైపు ఆకర్షించబడకుండా ఉండేందుకు రైలు ప్రయాణికులు ఆహార వ్యర్థాలను సక్రమంగా పారవేయాలని ప్రతిపాదించారు.
పులుల సంరక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నప్పటికీ, టైగర్ కారిడార్‌ల గుండా వెళ్లే రైల్వే మార్గాలు మాత్రం వాటి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి తెలంగాణ అటవీ ప్రాంతాలకు వలస వచ్చే పులులకు ఈ రైలు పట్టాలు రక్తసిక్త మార్గాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. రైళ్ల వేగ నియంత్రణ, అండర్‌పాస్‌లు-ఓవర్‌పాస్‌ల నిర్మాణం, సాంకేతిక పర్యవేక్షణ వంటి చర్యలు వెంటనే చేపట్టకపోతే విలువైన జాతీయ సంపద అయిన పులులను కోల్పోయే ప్రమాదం ఉందని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పులుల సంచారానికి సురక్షిత మార్గాలు కల్పించడం ద్వారానే జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యం సాకారం అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.

