Dailyhunt
ప్యాడీ కొనుగోళ్లపై ఉన్నతాధికారుల సర్ప్రైజ్ తనిఖీ

ప్యాడీ కొనుగోళ్లపై ఉన్నతాధికారుల సర్ప్రైజ్ తనిఖీ

పేడకాపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకస్మాత్తుగా తనిఖీ జరిగింది. సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా అక్కడికి చేరుకుని పనులపై సమీక్ష చేశారు.

మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఈ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రబీ సీజన్ కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ధాన్యం అన్‌లోడింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలు పెంచాలని, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలింపును వేగవంతం చేయాలని చెప్పారు. అవసరమైతే అదనంగా లారీలు, హమాలీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, కేంద్ర సిబ్బందితో కలిసి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం వివరాలు ఆయన తెలుసుకున్నారు. హమాలీలు, వాహనాలు, టార్పాలిన్లు వంటి సౌకర్యాలపై వివరాలు అడిగారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు 25 వేల క్వింటాళ్ల ధాన్యం కేంద్రానికి చేరింది. అందులో 7 వేల క్వింటాళ్లు కొనుగోలు పూర్తయింది. ఇంకా పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వలో ఉందని తెలిపారు. ఈ కేంద్రం పెద్దదిగా ఉండటంతో అదనంగా 10 నుంచి 20 లారీలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వివరించారు. హమాలీల కొరత రాకుండా ముందే మిల్లర్లకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు.

ప్రతి కేంద్రంలో సుమారు 30 మంది, మిల్లుల్లో 30 నుంచి 35 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. డ్రైయర్లు, క్లీనింగ్ ప్రక్రియలపై కూడా ఆయన ఆరా తీశారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు సరిపడా ఉండేలా చూడాలని సూచించారు. తరువాత వట్టిమర్తి వద్ద సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్‌ను ఆయన సందర్శించారు. అక్కడ హమాలీల సంఖ్యపై సమాచారం తీసుకుని, అన్‌లోడింగ్ వేగం పెంచాలని, వాహనాల రొటేషన్ మెరుగుపరచాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ధాన్యం వివరాల అప్లోడింగ్, ట్యాబ్ ఎంట్రీ రికార్డులను కూడా పరిశీలించారు. రోజువారీగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA