Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయ వేడికి ఉడికిపోతున్న వరంగల్

రాజకీయ వేడికి ఉడికిపోతున్న వరంగల్

మూడు ప్రధానపార్టీల రాజకీయాలకారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉడికిపోతోంది. ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ వేడి పెరిగిపోతోంది.

రైతు అంశమే కీలకంగా మంగళవారం నుండి మూడురోజుల పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రభుత్వం 'రైతుమేళా'ను ప్రారంభించింది. ఇంతకుముందే ఇదే హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు 'సంగ్రామ సదస్సు' నిర్వహించేందుకు డిసైడ్ అయ్యింది. బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగసభ బుధవారం అయితే ప్రభుత్వం మొదలుపెట్టిన మూడురోజుల రైతుమేళా మంగళవారం ప్రారంభమైపోయింది. ఒకే మైదానంలో ప్రభుత్వ, ప్రతిపక్ష కార్యక్రమం ఎలాగ జరుగుతుందో అర్ధంకావటంలేదు. ఈ రెండుపార్టీల కార్యక్రమాలను పక్కనపెట్టేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కొన్ని ప్రారంభోత్సవాలు, సంకుస్ధాపన కార్యక్రమాలను బీజేపీ పెట్టుకున్నది.

దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ముఖ్యంగా మక్కల(మొక్కజొన్న) రైతులను మోసం చేసిందనే ఆరోపణలపై బహిరంగసభ నిర్వహించబోతోంది. హనుమకొండలోనే బీఆర్ఎస్ రైతుసంగ్రామసభ ఎందుకు పెట్టింది ? ఎందుకంటే ఇదే హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోనే 2022, మే 6వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ తదితరులు 'రైతు సంఘర్షణ' పేరుతో ఒక సభ నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే రైతులకు తాము ఏమి చేస్తాము అనే అంశాలపై స్వయంగా రాహుల్ ఒక డిక్లరేషన్ ప్రకటించారు. అందులో ఏకకాలంలో రైతులకు రు. 2 లక్షల రుణాలను మాఫీచేస్తామని, రైతులు, కౌలు రైతులకు పెట్టుబడిసాయం కింద ఎకరాకు రు. 15 వేలు రైతుభరోసా కింద అందిస్తామని, రైతు కూలీలకు ఏడాదికి రు. 12 వేలు ఆర్ధికసాయం అందిస్తామని, రైతుబీమా లాంటి అనేక హామీలిచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ గుర్తుచేస్తోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతులను మోసంచేసిందని బీఆర్ఎస్ ఆరిపిస్తోంది. ఇది రైతులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులతోనే ప్రత్యేకంగా రైతు సంఘర్షణ పేరుతో బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఎల్ఏలు, మాజీమంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీలకనేతలు, కార్యకర్తలు అందరు పాల్గొనాలని పార్టీ ఇప్పటికే పిలుపిచ్చింది. పార్టీ పిలుపుకు ఎంతమంది సానుకూలంగా స్పందిస్తారో చూడాలి.

అలాగే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇదే హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో మంగళ, బుధ, గురువారాల్లో మూడురోజుల రైతుమేళా మొదలైంది. వ్యవసాయ రంగంలో రేవంత్ ప్రభుత్వం సాదించిన పురోగతిని, రెండున్నరేళ్ళల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలును వివరించటంతో పాటు ఉత్తమసాగు పద్దతులను రైతులకు చేరవేయటం, పరస్పర సహకారాన్ని పెంచుకోవటమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం చెప్పింది. ఈ సదస్సులో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్కతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంఎల్ఏలు, సీనియర్ నేతలంతా పాల్గొంటున్నారు. ఇపుడు మొదలైన రైతుమేళాలో రాజకీయ పరమైన ఆరోపణలు, విమర్శలు కూడా ఉంటాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాగంటే తమ హయాంలో ఏమి చేస్తున్నామని చెప్పేటప్పుడు మంత్రులు కేసీఆర్ హయాంలో రైతులు ఏ విధంగా నష్టపోయారో కూడా వివరిస్తారు కదా. కాబట్టి రైతుమేళా వేదికగా బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అవకాశాలున్నాయి.

ఈ రెండుపార్టీల విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇదే జిల్లాలో బీజేపీ కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహించబోతోంది. అయితే ఆ కార్యక్రమాలన్నీ వర్చువల్ గానే ఉండబోతున్నాయి. ఈనెల 10వ తేదీన నరేంద్రమోదీ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. అంతకన్నా ముందు రు. 9 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు ములుగు జిల్లా, జాకారంలో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటి పనులను మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే గీసుకొండ మండలంలో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను కూడా మోదీ ప్రారంభిస్తారు.

కాజీపేట-విజయవాడ మధ్య రు. 294 కిలీమీటర్ల మేర నిర్మించిన మూడో లైన్ను మోదీ ప్రారంభిచబోతున్నారు. కీలకమైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజను మోదీ చేయబోతున్నారు కాబట్టి దానికి తగ్గట్లే బీజేపీ జనసమీకరణకు రెడీ అయ్యింది. ఇక్కడ ప్రాజెక్టులన్నీ ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవే కాబట్టి జనసమీకరణ కూడా ఉమ్మడి జిల్లానుండే జరగాలని బీజేపీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జోష్ లో ఉన్న కమలనాదులు ప్రధానమంత్రి బహిరంగసభను విజయంవంతం చేయించాలన్న పట్టుదలతో ఉన్నారు. మొత్తంమీద మూడుపార్టీల రాజకీయాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక్కసారిగా వేడెక్కిపోవటం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA