జనగణనలోనే కులగణన కూడా చేయాలన్న అంశంలో వీ హనుమంతరావు సక్సెస్ అయ్యారు. తాజాగా ఇదే విషయాన్ని మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జనగణనతో పాటే కులగణన కూడా చేయాలని ఆదేశించింది.
అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు న్యాయం దక్కిందని అన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన చాలా అవసరమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇదే విషయంపై తమ పార్టీ ఏళ్ల తరబడి పోరాటం చేస్తుందని ఆయన గుర్తు చేశారు.
సామాజిక న్యాయం అందాలంటే కులగణన జరగాలని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. 'భారత్ జోడో యాత్ర' చేస్తున్న సమయంలోనే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. కులగణన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని గుర్తు చేశారు. కులగణన జరిగితేనే వెనకబడిన వర్గాల వారికి సరైన న్యాయం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే విజయవంతం అయిందని ఆయన అన్నారు.
ఇదే అంశంపై స్పందించిన వీ హనుమంతరావు.. ఈ తీర్పు 60కోట్ల మంది ప్రజలకు న్యాయాన్ని అందిస్తుందని అన్నారు. జస్టిస్ సూర్యకాంత్‌కు అంతా రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

