తెలంగాణలో భద్రతా వ్యవస్థకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి బి. శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించింది.
ఆయన రిటైర్మెంట్ అనంతరం ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఈ పదవి మూడు సంవత్సరాలపాటు కొనసాగనుంది. ఈ బాధ్యతలో ఆయన పోలీసింగ్, లా అండ్ ఆర్డర్, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఈ పదవికి ముఖ్య కార్యదర్శి హోదా ఇవ్వబడింది. నెలకు రూ.2.25 లక్షల వేతనం, నివాస సౌకర్యం, వాహనం మరియు సిబ్బంది అందించనున్నారు.
రిటైర్మెంట్ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో శివధర్ రెడ్డికి ఘన వీడ్కోలు లభించింది. అధికారులు గౌరవ వందనం సమర్పించారు. ఆయన తన 32 ఏళ్ల సేవలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. పోలీసింగ్ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, భవిష్యత్తులో యువ అధికారులు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సేవలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన గురువులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
మావోయిస్ట్‌ల లొంగుబాటులో శివధర్ రెడ్డి కీలక పాత్ర: సీవీ ఆనంద్
మే 1 నుంచి సీవీ ఆనంద్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన శివధర్ రెడ్డి సేవలను ప్రశంసించారు. గతంలో నక్సలిజం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసి సవాళ్లను ఎదుర్కొన్నారని తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కూడా ఆయన కృషి చేశారని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని సీవీ ఆనంద్ తెలిపారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని పోలీసులు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. టీమ్ వర్క్‌తో ముందుకు వెళ్లి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడం పోలీస్ శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.

