Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ బీజేపీలో 'బండి'కి గడ్డు పరిస్ధితేనా ?

తెలంగాణ బీజేపీలో 'బండి'కి గడ్డు పరిస్ధితేనా ?

ఇంటా, బయటా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ఇంట అంటే పార్టీలోపల, బయటా అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలు బండికి వ్యతిరేకంగాను, కార్నర్ చేసేట్లుగానే కనబడుతున్నాయి.

దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పేట్ బషీరాబాద్ పోలీసులు ఈనెల 8వ తేదీన పోక్సో కేసు నమోదుచేశారు. తనపైన లైంగిక దాడికి ప్రయత్నించాడని ఒక బాలిక భగీరథ్ పైన చేసిన ఫిర్యాదుతో అతనిపైన పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. అమ్మాయి మైనర్ అని కాదు కాదు మేజరే అనే వాదనలు బాగా వినబడుతున్నాయి. అమ్మాయి వయసుకు సంబంధించిన ధృవీకరణ హైకోర్టులో తేలబోతోంది.

ఇపుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే అమ్మాయి మైనరా కాదా అన్నది పక్కన పెట్టేస్తే బండికి మద్దతుగా పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటంలేదు. పార్టీలో 8మంది ఎంపీలు, 8 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలున్నారు. 8మంది ఎంపీల్లో బండితో పాటు జీ కిషన్ రెడ్డి కూడా కేంద్రమంత్రే. బండి కేంద్రంగా జరుగుతున్న వివాదంపై మద్దతుగా కిషన్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే మిగిలిన ప్రజాప్రతినిదులు కూడా బండికి మద్దతుగా నిలబడటం తమపనికాదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు బండి వివాదంతో తమకేమీ సంబంధంలేదన్నట్లుగానే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతు బండి వివాదంతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని తేల్చేశారు. పోక్సో వివాదాన్ని బండి కుటుంబ సమస్యగా రామచంద్రరావు స్పష్టంచేశారు.

పార్టీ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల వైఖరిని చూసిన తర్వాత పార్టీలో బండి సంజయ్ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు అన్న విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది.

బండికి ఇలాంటి పరిస్ధితి ఎందుకు వచ్చింది ? ఎందుకంటే బండి వ్యవహర శైలే కారణమని వినబడుతోంది. ఎలాగంటే బండిది పూర్తిగా డామినేటింగ్ నేచర్. కేంద్రమంత్రిగా కాని లేదా అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా ఈ విషయం అనేకమార్లు రుజువైంది. సంజయ్ కు బీసీ ట్యాగ్ ఉన్నా ఇతర బీసీ నేతలను కలుపుకుని వెళ్ళినట్లు ఎక్కడా కనబడదు. బీసీలతో పాటు ఇతర సామాజికవర్గాల నేతలను కూడా డామినేట్ చేస్తున్నట్లే కనబడుతుంది. దీనివల్లే బీసీ ఎంపీలైన ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ కూడా బండికి దూరమైపోయారు. ఇంకో ముఖ్య కారణం ఏమిటంటే 2028 ఎన్నికలకు పార్టీ అధ్యక్షుడిగా కొత్త నేతను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలప్పుడు పార్టీ అధ్యక్షుడు అంటే ఆ ప్రాధాన్యతే వేరుగా ఉంటుంది.

బండికి పోటీ చాలానే ఉందా ?

అధ్యక్ష పదవికోసం బీసీ ఎంపీలు బండి, ఈటల, ధర్మపురి మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది అనే ప్రచారముంది. వీళ్ళతో పాటు మెదక్ ఎంపీ రఘునందరావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా పోటీపడుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం బండి కాకుండా మరో నలుగురు పోటీపడుతున్న కారణంగానే ఎవరు కూడా బండిని ఇపుడు పట్టించుకోవటంలేదు అనే ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల శ్రేణులు బండికి వ్యతిరేకంగా ప్రతిరోజు రెచ్చిపోతున్నారు. పార్టీలోనే ఇన్ సైడ్ టాక్ ఏమిటంటే బీజేపీలోని బండి వ్యతిరేకుల్లో కొందరు పరోక్షంగా బీఆర్ఎస్ కు సహకరిస్తున్నారని.

మామూలుగానే పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశంలో స్వయంగా నరేంద్రమోదీనే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది బండి వివాదంలో ఇరుక్కుంటే మద్దతుగా పార్టీ నిలబడకపోవటంలో వింతేమీలేదని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

'ఇంట' ముచ్చట అయిపోయింది ఇక బయట విషయానికి వస్తే ప్రతిరోజు బండి సంజయ్ టార్గెట్ గా ప్రతిరోజు బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ రెచ్చిపోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్‌ నేతలు ఆందోళనలు చేస్తుంటే మరోవైపు వామపక్షాల నేతలు, ప్రజాసంఘాలు కూడా రోజూ ఆందోళనలు చేస్తున్నాయి. ఇంకోవైపు కొడుకు కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు. అన్నీవైపుల నుండి ఇపుడు బండి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే బండి సంజయ్ ఇపుడు గడ్డు రోజులను ఎదుర్కొంటున్నారని చెప్పింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA