హైదరాబాద్‌కే పరిమితమైన తెలంగాణ అభివృద్ధికి ఇప్పుడు కొత్త దిశ కనిపిస్తోంది. రాష్ట్ర రాజధానిపై పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, మౌలిక వసతుల ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రాంతీయ సమతుల అభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, ఖమ్మంను కలుపుతూ 'తెలంగాణ గోల్డెన్ ట్రయాంగిల్ గ్రోత్ కారిడార్'కు శ్రీకారం చుట్టింది.
మూడు నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్‌లు, విమానాశ్రయాల అభివృద్ధితో ఈ ప్రాంతాలను రాబోయే 25 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించి,రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలను ఆర్థిక ఇంజన్లుగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'తెలంగాణ గోల్డెన్ ట్రయాంగిల్ గ్రోత్ కారిడార్' ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లను అభివృద్ధి చేసేలా గ్రోత్ కారిడార్ నిర్మించాలని సీఎం అనుముల రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ఈ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించాలని ప్రణాళికలను సిద్ధం చేశారు.భవిష్యత్తులో అత్యంత కీలకమైన నగరాలుగా మారనున్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్ రీజియన్‌లను కలుపుతూ ప్రత్యేక కారిడార్లను, వాటి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలు నగరాల్లోకి రాకుండా నేరుగా బైపాస్ కావడానికి ఈ ఓఆర్ఆర్ లు ఉపయోగపడనున్నాయి.
మూడు నగరాల కారిడార్
భవిష్యత్ తెలంగాణ వృద్ధికి ఈ మూడు నగరాల కారిడార్ అత్యంత కీలకమని, రాబోయే 25 ఏళ్ల జనాభా, పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను డిజైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ మూడు నగరాల్లో రాబోయే ప్రతిపాదిత విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
వరంగల్ మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారుతాయని, దానికి తగినట్లుగా కనెక్టివిటీ ఉండాలని నిర్ణయించారు.ఐటీ , టెక్స్‌టైల్ హబ్...వరంగల్
తెలంగాణ రెండో అతిపెద్ద ఆర్థిక కేంద్రం వరంగల్ నగరాన్ని చారిత్రకంగానే కాకుండా,ఇప్పుడు ఐటీ , టెక్స్‌టైల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు.వరంగల్ నగరం చుట్టూ 73 కిలోమీటర్ల పొడవునా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు.ఈ రోడ్డు వరంగల్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా, నూతన టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు దారితీయనుందని అంచనా వేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ పార్కులు, మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ ఈ కారిడార్‌లో భాగంగా ఉన్నాయి.
ఉత్తర తెలంగాణకు గుండెకాయ...కరీంనగర్
ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి కరీంనగర్ లో గ్రానైట్ పరిశ్రమ,విద్యా సంస్థలకు నిలయంగా ఉండటంతో ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.కరీంనగర్ చుట్టూ 60 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు.ఈ రహదారి పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయనుంది.మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో పాటు ఈ ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల పర్యాటక రంగం కూడా పుంజుకుంటుందని భావిస్తున్నారు.రామగుండం ఎరువుల కర్మాగారం, బొగ్గు గనులకు కరీంనగర్ ప్రధాన సరఫరా కేంద్రంగా మారుతుందని అంచనా.
వెదిర, కొత్తపల్లి, నగునూర్, దుర్శేడ్, బొమ్మకల్, మానకొండూర్, ముంజంపల్లి, నుస్తులాపూర్, గుండ్లపల్లి, మాదాపూర్, గన్నేరువరం, నాగుల మల్యాల కలుపుతూ కరీంనగర్ ఓఆర్ఆర్ నిర్మించాలని నిర్ణయించారు.ఆంధ్రా-తెలంగాణ వాణిజ్య వారధి...ఖమ్మం
ఖమ్మం నగరం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం వల్ల వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.ఆంధ్రా-తెలంగాణ వాణిజ్య వారధి అయిన ఖమ్మం నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగర శివార్లను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇది విజయవాడ-హైదరాబాద్ హైవేకు అనుసంధానంగా ఉంటుంది.ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు మిర్చి, గ్రానైట్ ఎగుమతుల కోసం ఈ రింగ్ రోడ్డు ఒక లైఫ్ లైన్ లా పనిచేయనుంది.
రియల్ ఎస్టేట్ బూమ్
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే వరంగల్, కరీంనగర్, ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు వెలిసే అవకాశం ఉంది.దీని వల్ల పారిశ్రామిక, ఐటీ పెట్టుబడులు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు వేగంగా విస్తరిస్తాయి.
మెగా గ్రోత్ కారిడార్లు
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించి వాటిని మెగా గ్రోత్ కారిడార్లుగా మారుస్తామని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ గ్రోత్ కారిడార్లలో మౌలిక వసతులు, డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, మల్టీ యుటిలిటీ టవర్లను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
గోల్డెన్ ట్రయాంగిల్ జోన్
హైదరాబాద్ ఐటీ రంగానికి గుండెకాయ లాంటి మూడు ప్రధాన ప్రాంతాలను కలిపి సంప్రదాయకంగా గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు.25 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ జోన్ కు దేశంలోనే అత్యధిక రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంది.గచ్చిబౌలి,హైటెక్ సిటీ,కొండాపూర్ ప్రాంతాల్లోనే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్టీ విలువలు,అద్దెలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి.హైదరాబాద్ పశ్చిమ దిశగా విపరీతంగా విస్తరిస్తుండటంతో ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల ఆధారంగా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఇప్పుడు రెండు భాగాలుగా ముందుకు సాగుతోంది.అప్పర్ గోల్డెన్ ట్రయాంగిల్ జోన్ లో ప్రీమియం హై-రైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ హబ్‌లతో కూడిన విలాసవంతమైనగా గుర్తింపు పొందింది. కోకాపేట మెట్రోపొలిస్, కొల్లూరు,
నల్లగండ్ల,తెల్లాపూర్ అభివృద్ధి చెందుతున్నాయి.కోకాపేట నియోపోలిస్ భూముల వేలం, ఐటీ కారిడార్ విస్తరణ, గచ్చిబౌలి-కొండాపూర్-హైటెక్ సిటీల అభివృద్ధి అంతా తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే జరిగిందని కేటీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి నమూనాను వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు విస్తరించే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గ్రోత్ కారిడార్ అమలైతే తెలంగాణ ఆర్థిక పటంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే. ఔటర్ రింగ్ రోడ్లు, పారిశ్రామిక కారిడార్లు, ఐటీ హబ్‌లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్ పార్కుల సమన్వయంతో ఈ మూడు నగరాలు స్వయం సమృద్ధి చెందిన వృద్ధి కేంద్రాలుగా అవతరించే అవకాశం ఉంది. ఫలితంగా హైదరాబాద్‌పై ఉన్న భారం తగ్గడమే కాకుండా, పెట్టుబడులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి లక్షలాది ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయి. ప్రాంతీయ అసమానతలు తగ్గి, తెలంగాణ అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాలకు చేరేలా చేసే ఈ మెగా ప్రణాళిక రాష్ట్ర భవిష్యత్తుకు నిజమైన 'గోల్డెన్ ట్రయాంగిల్'గా నిలవనుంది.

