Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణకు కేంద్రం మొండిచేయి: రూ.40వేల కోట్ల ప్రాజెక్టులు పెండింగ్

తెలంగాణకు కేంద్రం మొండిచేయి: రూ.40వేల కోట్ల ప్రాజెక్టులు పెండింగ్

తెలంగాణలో పెండింగులో ఉన్న వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇచ్చినా, తెలంగాణలో కీలకమైన మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు మొండిచేయి చూపించింది.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవించినా, ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులకు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ను సమర్పించినా ఫలితం లేకుండా పోయింది.తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరి మరోసారి బహిర్గతమైందని రాష్ట్ర పాలక పక్షం మండిపడుతోంది.

తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ పట్ల కేంద్రం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమకు అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు ఓకే.. తెలంగాణకు నో!

తాజా కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఇతర రాష్ట్రాల మెట్రో, రైల్వే ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసినా, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును మాత్రం పూర్తిగా పక్కనబెట్టింది. మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర కేబినెట్ పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా పరిధిలో 134 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ మౌలిక వసతుల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. గుజరాత్ లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం కాసులిచ్చింది.

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 76.4 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధుల కేటాయింపులు జరపలేదు.

ఎల్‌అండ్‌టీ షేర్లను కొన్నా తాత్సారం

హైదరాబాద్ మెట్రో మొదటి దశలో ఉన్న చట్టపరమైన చిక్కులను, ఎల్‌అండ్‌టీ వాటాలను 100శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రక్రియను క్లియర్ చేసినప్పటికీ కేంద్రం మెట్రో ఫేజ్-2 నిధులను విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాయదుర్గ్ నుంచి కోకాపేట నియోపోలిస్ 11.6 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ కారిడార్ - 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయాత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్ల కీలక మెట్రో మార్గాలతో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రూట్ మ్యాప్‌ను కేంద్రానికి సమర్పించారు. అయినా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రాజకీయ రంగు పులుముకుంటున్న ప్రాజెక్టులు

కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీకి గుజరాత్ మోడల్‌ను గుర్తుచేస్తూ తెలంగాణకు నిధులివ్వాలని కోరారు. దానికి ప్రధాని మోదీ బదులిస్తూ.. ''గత యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌కు ఇచ్చినంతే నేను తెలంగాణకు ఇస్తే, ఇప్పుడు మీకు వస్తున్న నిధుల్లో అది సగం మాత్రమే వస్తుంది'' అని చమత్కరించారు.కానీ, ప్రధాని మాటలకు క్షేత్రస్థాయి నిర్ణయాలకు పొంతన లేదని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల ప్రాజెక్టులకు కేబినెట్ మీటింగ్‌లలో చకచకా నిధులు మంజూరవుతుంటే, దక్షిణాదిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ మెట్రో ఫేజ్-2కు నిధులు నిలిపివేయడం రాజకీయ వివక్షేనని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది.

కేంద్రం వద్ద కాగితాల్లోనే ప్రాజెక్టులు

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి నడిచేందుకు సిద్ధమన్నా.. ఈ రకమైన నిర్లక్ష్యం ఎదురైతే రాబోయే రోజుల్లో కేంద్ర-రాష్ట్రాల మధ్య 'మెట్రో రాజకీయం' మరింత ముదిరేలా కనిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలు,నిధుల అభ్యర్థనలు కేంద్రం వద్దే కాగితాల్లో మగ్గుతున్నాయి.

రాబోయే రోజుల్లో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి రూ.40,000 కోట్లకు పైగా విలువైన కీలక ప్రాజెక్టుల డిమాండ్లు సమర్పించారు.

ఇవీ తెలంగాణ పెండింగు ప్రాజెక్టులు...

-హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఎ అండ్ బీ ప్రాజెక్టులకు రూ. 44,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. 76.4 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్రాల 50:50 జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని రాష్ట్రం కోరింది.

- రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్తర, దక్షిణ భాగాలను ఒకేసారి వేగంగా పూర్తి చేయాలని, ఇందుకోసం కేంద్రం ప్యాకేజీ కింద రూ. 34,367 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రం కోరింది.

- గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ని అనుసంధానించే 10 గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల కోసం రూ. 45,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం విన్నవించారు.

- తెలంగాణలోని డ్రై పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని బందరు (మచిలీపట్నం) పోర్టు వరకు కనెక్ట్ చేసే 12 లేన్ల హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే కోసం రూ.17,000 కోట్లు అడిగింది.

-హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పనులకు అనుమతులు, జాతీయ రహదారుల అప్‌గ్రేడేషన్ నిధులు.

- మూసీ నది పునరుజ్జీవనం కింద మూసీ నది ప్రక్షాళన, బాపు ఘాట్, గాంధీ సరోవర్ ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ భూముల బదలాయింపుతో పాటు 60 శాతం కేంద్ర గ్రాంట్ ఇవ్వాలని కోరింది.

- హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టు కింద హైదరాబాద్ మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణకు రూ. 17,212 కోట్లు కేటాయించాలని అభ్యర్థించింది.

- ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద తెలంగాణను హైటెక్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ఈ మిషన్‌లో రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేయాలని కోరింది.

- ఆదిలాబాద్, పాల్వంచ, బసంతనగర్ లలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు పౌర విమానయాన శాఖ క్లియరెన్స్‌లు ఇవ్వాలని కోరింది.

- పీఎం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల ఇళ్ల మంజూరు కోసం రూ. 1,800 కోట్లు కేటాయించాలని కోరింది.

- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద 2019 నుండి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (UoH) క్యాంపస్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాలని కోరింది.

అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పోరాటం

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు, రాబోయే రోజుల్లో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవలే (మే 2026 లో) హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ప్రోటోకాల్‌ను గౌరవిస్తూ ప్రధానితో ఒకే వేదికను పంచుకున్నారు.తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రధాని మోదీ కనీసం రెండు గంటల ప్రత్యేక సమయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి బహిరంగంగానే విన్నవించారు.గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి కేంద్రం ఎలాగైతే పెద్ద మనసుతో సహకరించిందో.. అదే పద్ధతిలో తెలంగాణకు కూడా 'పెద్దన్న'లా నిధులు ఇవ్వాలని కోరారు. ఇది కేవలం రాజకీయ వేదిక కాదని, తెలంగాణకు ఇదొక 'అభివృద్ధి పండుగ' అని అభివర్ణించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో నిరంతరం నడిచిన ఘర్షణాత్మక వైఖరిని పక్కనబెట్టి ''రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధిలో కేంద్ర-రాష్ట్రాలు కలిసి నడవాలి'' అనే ఫార్ములాతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

కేంద్రం నిధుల కోసం సీఎం ఢిల్లీ పర్యటనలు : ఎంపీ డాక్టర్ మల్లు రవి

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఢిల్లీకి పోకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధులు కీలకమని, కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి వచ్చినా కలవకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన ఫైనాన్స్, నేషనల్ హైవేలు, రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఫెడరల్ వ్యవస్థను గౌరవిస్తూ ఢిల్లీ వెళ్లి పోరాడుతున్నారని మల్లు రవి పేర్కొన్నారు.

నిధుల కోసం మోదీతో చేతులు కలపాలా ? : ఎంపీ చామల

ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పెండింగ్ సమస్యలు, అభివృద్ధి అంశాలపై సహకారం కోరారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపనలు చేశారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ''రాజకీయాలు మాట్లాడనని చెప్పిన మోదీ చివరకు రాజకీయ వ్యాఖ్యలే చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో గుజరాత్‌కు ఇచ్చిన మద్దతు తరహాలో తెలంగాణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తోంది''అని ఆయన పేర్కొన్నారు. ''ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణను సందర్శించారు... తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీని కోరారు... అయితే, తాను తెలంగాణకు సహాయం చేయాలంటే, రేవంత్ రెడ్డి తనతో చేతులు కలిపితే తప్ప అదనపు బడ్జెట్‌ను కేటాయించలేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు... ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీలూ మనుగడలో ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారు'' అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

జాతీయ రహదారుల నెట్ వర్క్ రెట్టింపు అయింది : బీజేపీ ఎంపీ ఈటెల

గత 11 సంవత్సరాల్లో తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపు అయిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కేవలం జాతీయ రహదారులపైనే దాదాపు రూ. 1.75 లక్షల కోట్లను కేంద్రం పెట్టుబడి పెట్టిందన్నారు.గత 12 సంవత్సరాలుగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అనుసంధానం భారత ప్రభుత్వ అతిపెద్ద ప్రాధాన్యతలలో ఒకటిగా ఉందన్నారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అనుసంధానంపై కేంద్రం పెట్టుబడులు పెడుతుందని ఈటెల వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర-కేంద్ర సంబంధాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇతర రాష్ట్రాలకు వేగంగా ఆమోదాలు లభిస్తుండగా, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం కాగితాలకే పరిమితం కావడం కేంద్రం పట్ల రాష్ట్రంలో అసంతృప్తిని పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA