తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ అయ్యాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపుతో రాష్ట్రంలో 25 వేలకుపైగా మెడికల్ దుకాణాలు మూసివేశారు.
హైదరాబాద్‌లోనే 12 వేలకుపైగా షాపులు బంద్‌లో పాల్గొన్నాయి. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు ఆపాలని, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లను నియంత్రించాలని, నకిలీ మందుల సమస్యను అరికట్టాలని కెమిసిస్టులు డిమాండ్ చేశారు. ఇటీవల ఔషధ నిబంధనల్లో చేసిన మార్పులకు వ్యతిరేకంగానే ఈ బంద్ నిర్వహించినట్లు ఏఐఓసీడీ, హైదరాబాద్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ తెలిపాయి.
అయితే ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులను బంద్ నుంచి మినహాయించారు. అత్యవసర మందులు, ప్రాణాపాయ పరిస్థితుల్లో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ రక్షక మందులు అందించాలని సూచించారు.
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ అవినాష్ మొహంతి మాట్లాడుతూ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆసుపత్రులకు చెందిన ఫార్మసీలు తెరిచి ఉంచాలని ఏఐఓసీడీ తెలంగాణ శాఖతో సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి కెమిస్టుల సంఘాలు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో సమన్వయం కొనసాగిస్తాయని చెప్పారు. అలాగే కార్పొరేట్ మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని సూచించినట్లు వెల్లడించారు.
మందుల లభ్యతపై సమస్యలు ఎదురైతే స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లేదా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969ను అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిరంతరం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలకు మందుల సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

