కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం తెలంగాణలో చిన్నారులపై లైంగిక నేరాల తీవ్రతపై మరోసారి దృష్టి సారించింది.
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పోక్సో కేసుల సంఖ్య పెరుగుతుండటం, బాధితులలో ఎక్కువ మంది బాలికలే కావడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు, చట్టం ముందు అందరూ సమానులేననే ప్రశ్నను ముందుకు తెచ్చింది.బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవడంతో తెలంగాణలో పోక్సో కేసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణలో గత ఏడాది కాలంగా పోక్సో కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది.
తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా పోక్సో కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. ఇది నేరాలు పెరగడం వల్ల కావచ్చు లేదా బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం వల్ల కూడా కావచ్చు నని పోలీసులు చెబుతున్నారు.తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం 2024తో పోలిస్తే 2025లో చిన్నారులపై జరుగుతున్న నేరాలు 5.9శాతం పెరిగాయి. ప్రతి లక్ష మంది జనాభాలో చిన్నారులపై నమోదయ్యే నేరాల రేటు 42.3శాతానికి చేరింది. 2023వ సంవత్సరంలో 39.9శాతం ఉన్న నేరాలు అనూహ్యంగా పెరిగాయి.2024తో పోలిస్తే 2025-26 మధ్య చిన్నారులపై నేరాలు 5.9శాతం పెరిగాయి.సికింద్రాబాద్ రైల్వే పోలీస్ పరిధిలో పోక్సో కేసులు 167శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.తెలంగాణ పోలీసు శాఖ, ఎన్‌సిఆర్‌బి (NCRB) నివేదికల ఆధారంగా రాష్ట్రంలో మహిళలు , పిల్లలపై నేరాల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది.తెలంగాణ వార్షిక నేర నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య 22శాతం పెరిగింది. ఇందులో పిల్లలపై జరుగుతున్న నేరాలు, ముఖ్యంగా పోక్సో కేసులు గణనీయంగా ఉన్నాయి.మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో పోక్సో నేరాలు అత్యధికంగా 15.4శాతం పెరిగాయి.90శాతానికి పైగా పోక్సో కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారు లేదా బంధువులే ఉంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 90శాతానికి పైగా కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారు అంటే బంధువులు, స్నేహితులు లేదా పొరుగువారు అని పోలీసుల దర్యాప్తులో తేలింది.గతంలో కంటే ఇప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని షీ టీమ్స్ పోలీసులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ లో సెక్స్‌టార్షన్ ముఠా గుట్టురట్టు
జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల సెక్స్‌టార్షన్ ముఠా గుట్టురట్టు చేశారు. ధనవంతులైన మైనర్ బాలికలను స్నేహం పేరుతో ట్రాప్ చేసి, వారి ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.దాదాపు 30 మందికి పైగా బాలికలు ఈ ముఠా బారిన పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహిళా భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.మార్చి 2026లో ప్రారంభించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ద్వారా సైబర్ వేధింపులు, పోక్సో కేసులపై అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి షీ టీమ్స్ నిఘాను పెంచాయి.
త్వరితగతిన తీర్పులు
తెలంగాణలో అత్యాచారాలు, పోక్సో (POCSO) కేసుల సత్వర విచారణ కోసం ప్రభుత్వం మొత్తం 36 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులను (FTSCs) ఏర్పాటు చేసింది.దీంతో తీర్పులు త్వరగా వస్తున్నాయని రంగారెడ్డి జిల్లా న్యాయవాది ఆర్ శ్రీనివాసరావు 'ఫెడరల్ తెలంగాణ'కు చెప్పారు.ఏప్రిల్ 2026లో రెండు కీలక పోక్సో కేసుల్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చాయి. ఒక నిందితుడికి జీవిత ఖైదు, మరొకరికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాయి.2024లో పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 82 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది.

సంచలనం సృష్టించిన బండి కేసు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (సాయి భగీరథ్) పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం తెలంగాణలో పెను సంచలనంగా మారింది. 2026 మే నెలలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో రెండు పక్షాలు సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషనులో బండి భగీరథ్ పై కేసు నమోదైంది.2025 వసంవత్సరం జూన్‌లో తన కూతురితో పరిచయం పెంచుకున్న భగీరథ్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడని, అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.బాధిత బాలికకు బలవంతంగా మద్యం తాగించాడని, వేధింపులు తట్టుకోలేక జనవరిలో సదరు బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా బాధితురాలి తల్లి ఆరోపించారు.పోలీసులు ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75 (మహిళా గౌరవానికి భంగం, లైంగిక వేధింపులు) పోక్సో చట్టంలోని 11, 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు దీనిని 'అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్' (Aggravated Sexual Assault) గా మార్చారు.
హనీట్రాప్ చేశారంటూ ఫిర్యాదు
పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కూడా కరీంనగర్ టౌన్-2 పోలీసు స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు.తనను ఒక అమ్మాయి ద్వారా ఉచ్చులోకి లాగి హనీట్రాప్ చేశారని (Honey trap), బాధితురాలి తల్లిదండ్రులు తనను రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.డబ్బులు ఇవ్వకపోతే తమ కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని, తనపై తప్పుడు కేసులు పెడతామని వారు బెదిరించారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఎక్స్టార్షన్ (Extortion)క్రిమినల్ కుట్ర కింద కేసు నమోదు చేశారు.
వయస్సు వివాదం ప్రధాన మలుపు
ఈ కేసులో నిందితుడు భగీరథ్ తరపు న్యాయవాదులు హైకోర్టులో ఒక కీలక పత్రాన్ని సమర్పించారు.2021లో సదరు బాలికపై నమోదైన ఒక మైనర్ డ్రైవింగ్ కేసులో ఆమె వయస్సు 15 ఏళ్లుగా రికార్డై ఉంది. ఆ లెక్కన ప్రస్తుతం ఆమెకు 19 లేదా 20 ఏళ్లు ఉంటాయని, కాబట్టి ఆమె మైనర్ కాదని,ఈ కేసులో పోక్సో చట్టం చెల్లదని వారు వాదిస్తున్నారు. బండి సంజయ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికే కావాలని ఎనిమిది నెలల ఆలస్యంగా ఈ కేసు పెట్టారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
సీఎం రేవంత్ ఆదేశంతో సిట్ ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోక్సో కేసు విచారణ కోసం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.నిందితుడు బండి భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలని భగీరథ్ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, మే 14 (నేడు) ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డ్ చేసి, ఆమె వయస్సుపై స్పష్టత తెచ్చే పనిలో ఉన్నారు.
నాపై కుట్ర పన్నారు : కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్
బండి భగీరథ్ పై పోక్సో కేసుపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అత్యంత భావోద్వేగంతో స్పందించారు.తన కొడుకు తనతో ఏడుస్తూ ఏ తప్పూ చేయలేదు, మేము స్నేహితులం మాత్రమే అని చెప్పాడని ఆయన పేర్కొన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.''చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేసిన వారు ఎవరైనా, అది తన కొడుకైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుంది''అని స్పష్టం చేశారు.
పోక్సో కేసు విచారణకు సీఎం సిట్ ఏర్పాటు
బండి భగీరథ్ పై పోక్సో కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ కేసులో సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు.విచారణలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, కేసు పురోగతిపై ప్రతిరోజూ నివేదిక అందించాలని పోలీసు అధికారులను ఆయన కోరారు.
కేటీఆర్ విమర్శలు
బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.''ఒక కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉండటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారా?'' అని ఆయన ప్రశ్నించారు.తన అధికారాన్ని ఉపయోగించి బండి సంజయ్ తన కొడుకును రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం కూడా మౌనంగా ఉండి సహకరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సంస్కృతి, విలువల గురించి మాట్లాడే వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. నిందితుడు పోలీసుల విచారణకు సహకరించాలని అసద్ సూచించారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా కేసు నమోదు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని బాలల హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించి, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ కోసం కమిషన్ ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితురాలికి జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీకి కమిషన్ తరపున లేఖ రాశారు. ఈ కేసులో నిందితుడు ఎంతటి వారైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదని సీతా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.బాధితురాలు మైనర్ కాబట్టి ఆమె వివరాలు బయటకు రాకుండా చూడాలని, ఆమెకు, ఆమె కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరారు.
సిట్ అధికారి రితిరాజ్ ఏం చెప్పారంటే...
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తుకు సంబంధించి కూకట్‌పల్లి డీసీపీ, సిట్ ఇన్ చార్జ్ రితిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా సరే.. విచారణలో ఎలాంటి రాజీ పడబోమని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దర్యాప్తు పూర్తిగా పారదర్శకగా జరుగుతుందని హామీ ఇచ్చారు.ఇప్పటికే బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ (ఫోన్ కాల్ డేటా), సోషల్ మీడియా వీడియోలు, ఆడియో క్లిప్పింగ్‌లు వంటి అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు.మొదట నమోదైన సెక్షన్లకు అదనంగా, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా మరికొన్ని కఠినమైన లైంగిక వేధింపుల సెక్షన్లను బీఎన్ఎస్, పోక్సో కింద చేర్చినట్లు ఆమె వెల్లడించారు. బాధితురాలి ని భరోసా కేంద్రం ద్వారా మరోసారి పూర్తి వివరాలను సేకరించి నివేదిక రూపొందించామని తెలిపారు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఃబండి భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీసీపీ రితిరాజ్ పేర్కొన్నారు.విచారణకు హాజరుకావాలని ఇప్పటికే భగీరథ్‌కు నోటీసులు ఇచ్చామని, విచారణకు రానందున చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిందితుడు విదేశాలకు వెళ్లినా తిరిగి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
చట్టం ముందు అందరూ సమానులే...
బండి భగీరథ్ కేసు తుది ఫలితం కోర్టు తీర్పు తర్వాతే స్పష్టమవుతుంది. అయితే ఈ ఘటన తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులపై విస్తృత చర్చకు దారి తీసింది. బాధితులకు రక్షణ, వేగవంతమైన దర్యాప్తు, కఠిన శిక్షలు...ఇవే ఇటువంటి నేరాలను అరికట్టడానికి కీలకం. చట్టం ముందు సాధారణ పౌరుడైనా, రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడైనా ఒకటేననే సూత్రాన్ని ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది.

