Dailyhunt
టీఆర్ఎస్ విషయంలో కవితకు ఎన్నికల కమిషన్ షాకిచ్చిందా ?

టీఆర్ఎస్ విషయంలో కవితకు ఎన్నికల కమిషన్ షాకిచ్చిందా ?

దురోజుల క్రితం తెలంగాణలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ విషయంలో గందరగోళం పెరిగిపోతోంది. ఈనెల 25వ తేదీన కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 'తెలంగాణ రాష్ట్ర సేన' ఏర్పాటుచేస్తున్నట్లు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పటినుండి బీఆర్ఎస్‌లో గోల పెరిగిపోతోంది. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలోని 'భారత రాష్ట్ర సమితి' పేరు ఒకపుడు 'తెలంగాణ రాష్ట్ర సమితి' కావటమే కారణం. తెలంగాణ నుండి పార్టీని జాతీయస్ధాయికి విస్తరించే ఉద్దేశ్యంతో కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మార్చారు. అయితే మెజారిటి జనాలు మాత్రం పార్టీమార్పుపై సానుకూలత చూపించలేదు. 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీ నేతలు, క్యాడర్లో కూడా బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే చెప్పారు. పార్టీ పేరు మార్పును నాయకత్వం పరిశీలిస్తోందని కూడా కేటీఆర్ చెప్పారు.

ఈలోగానే కవిత ఏర్పాటుచేసిన కొత్తపార్టీ టీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వంలో ఒకపుడు ఏర్పాటైన టీఆర్ఎస్ సంక్షిప్తంగా ఒకటిగా ఉండటంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గురువారం కవిత పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తిస్తు సమాచారం ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు ప్రకారం కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనగా ఉంది. అసలే టీఆర్ఎస్ అనే పేరుతో గందరగోళం మొదలైందని అనుకుంటున్న సమయంలో సడెన్ గా ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేనగా గుర్తింపు ఇవ్వటం మరింత గందరగోళాన్ని పెంచేసింది. ఇంతకీ కవిత కొత్తపార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేననా లేకపోతే తెలంగాణ రక్షణ సేననా అన్నది అర్దంకావటంలేదు.

పేరుతోనే జనాలను కవిత ఎందుకింత గందరగోళంలోకి నెట్టేస్తున్నారో అర్ధంకావటంలేదు. మొదటినుండి కవిత వైఖరి ఇలాగే ఉడటం గమనార్హం. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన కవిత పార్టీ పేరును 'తెలంగాణ ప్రజా జాగృతి' అని కేంద్ర ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరు అనధికారికంగా బయటకు వచ్చిన తర్వాత కవిత పార్టీ ఆఫీసులో ఇదే పేరును లాంఛనంగా ప్రకటించారు. అయితే మొన్నటి 25వ తేదీన వేలాదిమంది సమక్షంలో పార్టీ పేరును కవిత తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వ్యూహాత్మకంగా కవిత పార్టీ పేరు విషయంలో సీక్రెసీ మెయిన టెన్ చేశారని, బీఆర్ఎస్ ముఖ్యులకు షాక్ ఇవ్వటానికే పార్టీ పేరును బయటకు ఒకటిచెప్పి బహిరంగసభ సమయంలో అసలు పేరును ప్రకటించారని అందరు అనుకున్నారు. మొత్తానికి తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులను కవిత భలే దెబ్బకొట్టారనే విశ్లేషణలు వెలువడ్డాయి.

తీరా ఇపుడు చూస్తే కేంద్ర ఎన్నికల కమిషనే కవితకు పెద్ద షాక్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. తాజా షాక్ తో జనాల్లో తీవ్ర గందరగోళం పెరిగిపోతోంది. ఎందుకంటే కవిత పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన కాదు తెలంగాణ రక్షణ సేన అని అధికారికంగా ఎన్నికల కమిషన్ కవితకు సమాచారం అందించింది. దాంతో కవిత పెట్టిన పార్టీ పేరు ఏమిటో తెలియక అందరిలోను గందరగోళం పెరిగిపోతోంది.

ఇక్కడే కొన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. అవేమిటంటే పార్టీ పేరును గుర్తించటంలో ఎన్నికల కమిషన్ పొరబాటుపడిందా ? లేకపోతే ఎన్నికల కమిషన్ ఆమోదించిన పేరును ప్రకటించటంలో కవిత పొరబాటుపడ్డారా ? లేకపోతే ఎన్నికల కమిషన్ దెబ్బకు నిజంగానే కవితకు మతిపోయిందా ? ఈ మూడింటిలో ఏది కరెక్టో కూడా జనాలకు అర్ధంకావటంలేదు.

ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేన అని ఆమోదించిన పేరును కవిత పొరబాటుగా తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించే అవకాశాలు లేవు. ఎందుకంటే తన పార్టీ పేరును కవితే పొరబాటుగా తప్పుగా చెబితే ఇక జనాలు పార్టీని ఎందుకు పట్టించుకుంటారు ? జనాల ముందు కవిత పరువు పోదా ? ఒకవేళ ఎన్నికల కమిషన్ కు పేర్లను ప్రతిపాదించేటపుడు కవిత తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన అనే రెండుపేర్లను ప్రతిపాదించారా ? రెండు పేర్లలో తెలంగాణ రాష్ట్ర సేనకు మొదటి ప్రయారిటి ఇచ్చారా ? అన్నది తెలీదు. మొదటి పేరుకే తాను ప్రయారిటి ఇచ్చాను కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా మొదటిపేరు తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరును ఖాయం చేస్తుంది అన్న ఆలోచనతో కవిత పార్టీ పేరును బహిరంగసభలో ప్రకటించారా ? అనే అనుమానం పెరిగిపోతోంది. పార్టీ పేరు విషయంలో ఎన్నికల కమిషన్ నుండి సరైన సమాచారం రాకుండానే కవిత పార్టీ పేరును తొందరపడి తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించేశారా ?

ఏదేమైనా ఎన్నికల కమిషన్ తాజా సమాచారంతో కవిత పార్టీ పేరు విషయంలో జనాల్లో గందరగోళం పెరిగిపోతొందన్నది అయితే వాస్తవం. పార్టీ పేరులోనే ఇంత గందరగోళం అయితే ఇక పార్టీ నడపే విషయంలో ఇంకెన్ని అవస్తలు పడుతారో అనే సెటైర్లు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే తెలంగాణ రాష్ట్ర సేన అయినా తెలంగాణ రక్షణ సేన అయినా సంక్షిప్తంగా టీఆర్ఎస్ అనే ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు సమస్యలు తప్పేట్లు లేవు.

2వ తేదీన క్లారిటి

ఇదే విషయమై కవిత పీఆర్వో మహేంద్రను తెలంగాణ ఫెడరల్ సంప్రదించింది. మహేంద్రరెడ్డి మాట్లాడుతు అన్నీ అనుమానాలకు మే 2వ తేదీన కవిత మీట్ ది ప్రెస్ లో క్లారిటి ఇస్తారని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA