శేషాచలపు ట్రెక్కింగులకు అనుమతి లేకపోవటంతో ఈ దఫా కేరళ వయనాడులో ట్రెక్కింగులు చేయాలని నిశ్చయించుకున్నాను. పైగా వయనాడులో కొన్నేళ్ల క్రితం landslide జరిగి ఊళ్ళకి ఊళ్లు కొట్టుకుపోయి విపరీతంగా జనం చనిపోవటం, మానవ చరిత్రలో ఒక భయంకరమైన human tragedy జరిగిన చోటును కూడా చూడాలని వుండె.
అంతకుమునుపు లదఖ్ లో mud flood జరిగిన చోటు చూసి ఉన్నాను.

తిరుపతి నుండి కోజికోడ్ కు చేరటం చాలా ఆలస్యమైంది. విమాన ప్రయాణం. రాత్రి heritage beach hotel check in కాగానే గబా గబా డిన్నర్ కానిచ్చేసి వాస్కోడగామా మే 20, 1498 అడుగుపెట్టిన స్థలానికి బయలుదేరినాము.

వాస్కో మొట్టమొదటి ఐరోపావాసి. cape of goodhope నుండి సముద్ర ప్రయాణంలో కాలికట్ చేరుకున్నవాడు. అద్దాలు, స్కార్ఫ్ లు లాంటివి తీసుకొచ్చి మన లవంగాలు,మిరియాలు,ఏలకులు, చిరింజాకు లాంటివి కొని పోవటం అతని ఉద్దేశ్యం. జామరోన్ ను కలిసి వొప్పందం చేసుకున్న సంవత్సరమది.ఆ రోజు నుండి 500 ఏళ్లుగా కొనసాగిన వ్యాపారానికి అప్పుడే బీజం పడింది. చాలా ఉద్వేగంతో పోయిన నాకు ఒక చిన్న స్మారకపు రాయి మాత్రం అక్కడ గుర్తుగా ఉంది. బాగా చీకటి కనుక సరిగ్గా చూడలేకపోయినాను. కప్పడ్ బీచు మాత్రం చాలా బావుంది. ముగించుకుని మా వసతికి వస్తే ఎదురుగా విపరీతమైన జన తొక్కిడి. బీచు నిండా జనమే జనం. 1893లో కట్టిన మా వసతిని అడుగడునా అనుభవించి పొద్దు పొద్దున్నే వయనాడుకు బయలుదేరినాము.

ఘాట్ ఎక్కగానే chain tree దగ్గర ఆగితే అక్కడ ఒక గిరిజనుడి విగ్రహం వుంది. చెట్టుకు చైను వుంది. ఏందిరా అని ఆరా తీస్తే ఆ గిరిజనుడి పేరు కొలినేతానందన్. ఇతని సహాయం వల్లనే బ్రిటిషు వాడు ఒక ఘాట్ రోడ్డు పూర్తి చేసి, పూర్తి అయ్యి అవ్వగానే ఆ గిరిజనుడిని చంపేసినారు. పూర్తి credit తామే కొట్టెయ్యడానికి. అక్కడ ఏదో దెయ్యం దాగి accidents కు కారణమవుతున్నదని స్థానికులు చెట్టును గొలుసుతో కట్టివేసినారు. ఎన్ని వింతలూ, విడ్డురాలో మన దేశంలో.

నేరుగా మా వసతి చేరుకొని అక్కడే ఆ కొండ చుట్టూ తిరిగొచ్చినాను. resort వారే ప్రతిదినమూ guided trek ఏర్పాటు చేస్తున్నారు. చిన్నదే అయినా కొండ చుట్టూ, కొండ నది మధ్యన నడవటం చుట్టూ లోయలను చూడటం బాగుండె.

మరుసటి రోజున ఎడుక్కల్ గుహకు బయలుదేరినాము. ఎక్కడం పూర్తిగా ఎక్కుడే. మరీ స్టీప్ గా ఉండే చోట స్టీలు నిచ్చెనలు ఏర్పాటు చేసినారు. ప్రవేశ రుసుము 50 రూపాయలు. జనం బాగానే ఉన్నారు. సర్ అని ఎక్కితే 50 నిమిషాలు పట్టింది. సహజసిద్ధమైన పేద్ద గుండు రెండు కొండల మధ్యన నిలబడి మహా అద్భుతంగా ఉంది. ఆ మధ్యలో 6000 ఏళ్ల కిందటి ఆర్ట్ ఉంది. మా శేషాచలం యుద్ధగళంలో ఉన్నట్టుగా, మానవ ఆకారాలు,జంతువుల గుర్తులతో సింధునాగరికత నాటి గుర్తులు కానొచ్చినాయి. వయనాడు అత్యంత ప్రాచీన నాగరికతకు సంబంధించిన ప్రదేశంగా అనిపించింది. హరప్పా,సింధు,మెసపటోమియాల మాదిరిగా అనంతమైన ఈ గుర్తులు మానవ చరిత్ర మహోన్నత్వాన్ని అందిస్తున్నట్లుగా అనిపించింది. ఆ రాళ్ల అందం మన రాళ్ల అందం మాదిరిగానే ఉంది.అసలా రాతి సౌందర్యం ఎంత అమోఘమో కదా! రెండు కొండల నడుమా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. కోతులు, పక్షుల కోతల మధ్యన అరగంటకంతా దిగి వచ్చేసినాను.

మరుసటిరోజు సూచిపర జలపాతానికి ఛలో భలే. మా డ్రైవర్ భయపెట్టినట్టే ఉంది. చాలా లోతుకి దిగాలి. ఎక్కడం కష్టం అని , పావయ్యా, పా అని బయలుదేరినా అతడిని తోడు తీసుకుని. అక్కడ అటవీశాఖ వారే అన్ని ట్రెక్ లు నిర్వహిస్తారు. మనిషికి 150 రూపాయల ఫీజు.నీళ్లు అటవీ శాఖ వారే దారెంటా ఏర్పాటు చేసి ఉన్నారు. life guards కూడా ఉన్నారు. system బాగుంది. ఎక్కడా కానీ plastic లేదు.ఇట్లా మన అటవీ శాఖ వారు చెయ్యగలిగితే ఎంత బావున్నో కదాని అడుగడుగునా అనుకున్నాను. అడుగే పెట్టనియ్యని అటవీ శాఖ చేస్తుందని ఎందుకనుకోవటం. అస్సలు ఎంతమందికి ఉపాధి లభిస్తుందో అటవీ శాఖ వారిని ఎవరైనా ఆలోచింపచేస్తే బావుండు. సర్రున 40 నిముషాల్లో దిగేసినాను. వారు చెప్పే సమయం గంట.మా శేషాచలపు అనుభవం ముందు ఇదేమంతా పెద్దది కాదు.ఇలాంటివి కొన్ని పదులు చూసి ఉన్నాను. కాకపోతే మా శేషాచలపు జలపాతాల మాదిరిగానే ఉంది. పెద్ద పెద్ద గుండ్లు, రాళ్లతో నీళ్లు హొయలు పోతున్నాయి.సూచి అంటే సూది పార అంటే రాయి. సూదంటూ రాయి జలపాతమిది.

అక్కడ నుండి మొప్పాడు దగ్గర జరిగిన మానవ విషాదము, landslide జరిగిన చోటు చూసి,off Road లో 8 కి.మీ జీపు ప్రయాణం చూసి 360 డిగ్రీ view point చూసి చాలా ఆహ్లాదానికి గురైనాను. చుట్టూ పచ్చ పచ్చాట అడవి.చూసినంత దూరం అత్యంత మనోహరంగా ఉంది.
చివరి రోజున మీన్ ముట్టి జలపాతానికి పోతే కొంచెం కష్టమయినా ఫర్వాలేదు. కాకపోతే సన్నటి ధార మాత్రమే నడకకు పనికొచ్చింది.
మొత్తానికి పేరున్న ఈ మధ్యతరహ ట్రెక్కింగులతో పాటు సన్నాబన్నాని ఐదు చేసి తిరిగి ఇంకో మారు వైత్రి, తెన్నిలలో చెయ్యాలనే సంకల్పంతో తిరిగొచ్చినాము. తిరిగొస్తూ వస్తూ కోజికోడ్ లో ప్రసిద్ధి చెందిన హల్వా రుచి చూడ్డం ఒక మంచి అనుభవం.

