Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు, థర్మల్ ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు కేబినెట్ ఆమోదం తెలపడం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నిర్ణయంతో విచారణ మరింత వేగంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముందుగా విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 2024 మార్చిలో రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ప్రారంభమైంది. తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన తప్పుకోవడంతో జస్టిస్ మదన్ బి. లోకూర్ బాధ్యతలు స్వీకరించారు.

కమిషన్ 114 పేజీల నివేదికను 2024 అక్టోబరులో సమర్పించింది. ఈ నివేదికపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను తీసుకుని కేబినేట్ చర్చించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు

1. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయి.

వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ⁠జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది. ⁠

2. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.

3. నిన్న అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

4. నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ( NARMAC) కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది.

5. తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

6. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ( OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

7. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.

8. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

9. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA