Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ విజయం.. దేశ రాజకీయాలకు కొత్త సంకేతమా?

విజయ్ విజయం.. దేశ రాజకీయాలకు కొత్త సంకేతమా?

మిళనాడు అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో తమిళ సినిమా అగ్రనటుడు 51 ఏళ్ల చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ సాధించిన ఘనవిజయం అందరినీ అబ్బురపరిచింది అనటంలో సందేహం లేదు.

తమిళగ వెట్రి ఖజగం (టీవీకే) అన్న పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి కేవలం రెండే సంవత్సరాలే అయ్యింది. రాజకీయ అనుభవం లేదు. పార్టీ ప్రణాళిక కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కులాన్ని ధనాన్ని నమ్ముకోలేదు. కేవలం ఆత్మస్థయిర్యం తో ఒంటరి పోరాటం చేశాడు. ఎంతో చరిత్ర కలిగిన రెండు ద్రావిడ పార్టీలను మట్టి కరిపించాడు. అసెంబ్లీ లో మెజారిటీకి సరిపడా సీట్లు గెలవక పోయినా ఎక్కువ సీట్లు గెలిచిన ఏకైక పార్టీగా విజయ్ ఘనవిజయం సాధించాడు అని దేశం అంతా సంబ్రమాశ్చర్యానికి లోనైంది. కానీ మెజారిటీ లేదన్న నెపంతో గవర్నరు విజయ్ ని మూడుసార్లు తన ఇంటి చుట్టూ తిప్పించుకున్నా, ఎట్టకేలకు చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ని ముఖ్య మంత్రి గా నియమించటం తప్పలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించి మెజారిటీకి కేవలం పది పన్నెండు సీట్లు తగ్గిన కారణంగా ఒక ఉత్కంఠభరితమైన అనిశ్చిత పరిస్థితి నెలకొంది చెన్నైలో దాదాపు వారం రోజుల పాటు. మే 4 న ఎన్నికల ఫలితాలు వెలువడితే, వారం రోజుల ఉత్కంఠ తరవాత మే 10వ తారీఖున వేలాది మంది అభిమానుల సమక్షంలో విజయ్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

ఈ నేపథ్యంలో విజయ్ విజయం నూతన శకానికి నాందిగా భావించారు అందరూ. ఎన్నికల ప్రచారంలో ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు పోవటం పెద్ద ఎదురుదెబ్బ అయినా జంకకుండా మొక్కవోని ఆత్మస్థైర్యం తో చాలా హుందా గా విజయ్ ఎన్నికల ప్రచారం సాగింది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకోగలిగాడు. అతన్ని మార్పుకు దూతగా చూసింది తమిళ యువజనం. యువజనం ప్రోద్బలంతో పెద్దవాళ్ళు కూడా విజయ్ కే ఓటు వేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అఖండ విజయం సాధించాడు అని అందరూ భావించారు, ఒక్క గవర్నరు తప్ప. సరే ఎట్టకేలకు విజయ్ కి పట్టం కట్టటం గవర్నరుకి తప్పలేదు. ఈ విషయంలో గవర్నరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారు అని చాలా మంది భావించారు. గవర్నరు వ్యవస్థ పతనం తమిళనాడు ఉదంతంతో పరాకాష్టకు చేరిందని సామాన్య జనంతో పాటుగా మేధావులూ, మీడియా మరియూ రాజ్యాంగ నిపుణులు చాల మంది అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో గవర్నరు పాటించవలసిన నియమావళిని 1984లోనే సర్కారియా కమిషను స్పష్టంగా పొందుపరిచింది. కేంద్రంలో రాష్ట్రపతి కూడా అదే నియమావళిని అనుసరించారు. కానీ తమిళనాడు గవర్నరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యదలుసుకున్నావారు తమకు మెజారిటీ ఉందని తనకు నమ్మకం కలిగించాలని మెలిక పెట్టటం అందరి సహనాన్ని పరీక్షించింది. ముఖ్యంగా తమిళ్ యువత చాలా ఆందోళనకు గురి అయ్యింది. కథ సుఖాంతమైనందుకు విజయ్ విజయానికి కారణమైన అభిమానులతో పాటు సామాన్య జనం కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ముఖ్యమంత్రి విజయ్ పరిపాలన ఏవిధంగా వుండబోతుంది అన్న ఆసక్తి అందరిలోనూ వుంది. విజయ్ వేసే ప్రతి అడుగునూ క్షుణ్ణంగానూ నిశితంగానూ పరిశీలిస్తారని విజయ్ కు తన బృందంలోని సభ్యులకు తెలియనిది కాదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చేతిలో ఒక కాగితంతో ఎదో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వెళుతున్నట్లుగా గవర్నరు ఇంటికి పోవటం సామాన్య జనానికి తప్పు అనిపించకపోయినా విశ్లేషకులకు అది సరైన పద్ధతి కాదూ అనిపించింది. సరే అనుభవం లేదు, సలహాలు ఇచ్చేవారు లేరు అనుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వేదికమీద ముఖ్యమంత్రిగా చేసిన మొదటి ప్రసంగంలోనే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందన్న మాట అపస్వరంగా అనిపించినా, ప్రభుత్వ ధనాన్ని తాను దుర్వినియోగం చెయ్యను అని ప్రమాణం చెయ్యటం ప్రజల్లో కొత్త ఆశలను లేపింది. సినిమా రంగంలో పేరున్న నటుడు. కిందిస్ధాయినుంచి వచ్చినా, విజయవంతమైన నటుడుగా ఎదిగాడు. సంపన్నుడైనాడు. కనుక ప్రజా ధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోడు అని ప్రజలు గట్టిగా విశ్వసించారు.

ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే ఎన్నికల్లో తన స్థానాన్ని కూడా గలవలేని డీఎంకే నేత స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీసులు తీసుకోవటం అందరినీ ఆకట్టుకుంది. తమిళ రాజకీయాల్లో పగా ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటాయి. శుభకార్యాలకుగానీ, అశుభకార్యాలకు గానీ అవతల పార్టీ నేతల ఇళ్లకు వెళ్ళటం తమిళనాడులో లేని ఆచారం. వేరే పార్టీ అంటే వైరి పార్టీ అనే అర్ధం. నేడు ఆంధ్రాలో కూడా ఈ తరహా రాజకీయం వేళ్లూరుతుంది. ఇదొక దురదృష్ట పరిణామం. వేరే పార్టీ వైరి పార్టీ అన్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి డీఎంకే మరియూ దాని మిత్ర పక్షాల నాయకుల ఇళ్లకు వెళ్ళటం ఒక సుహృద్భావ వాతారణానికి నాంది అని అందరూ సంతోషించారు. అయితే అంతకు ముందు రోజే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించడం, ఆ మరునాడే ఆ నేత ఇంటికి వెళ్ళటం అసహజంగా అనిపించింది విశ్లేషకులకు. కనీసం రాష్ట్ర సచివాలయానికి వెళ్లి ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించిన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిమీద వ్యాఖ్యానించితే సముచితంగా ఉండేది. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని నిందించటం ఒక పరిపాటి అయ్యింది. విజయ్ కూడా అదే పందాలో వెళ్తున్నాడా అన్న సందేహం కలిగింది. ఈరోజు విమర్శించి, రేపు సందర్శించి ఆలింగనం చేసుకొని శాలువాలు కప్పుకోవటం కాస్త అసహజం అనిపించింనా కొత్త కదా అనుకున్నారు.

అయితే విజయ్ కి గుక్కతిప్పుకునే అవకాశం లేకుండా పోయింది. వారం రోజులు గవర్నరు ఇబ్బంది పెట్టటం, పదవ తేదీన ప్రమాణ స్వీకారం, పదమూడవ తేదీన అసెంబ్లీలో బలనిరూపణ చెయ్యాలన్న గవర్నరు ఆదేశం, ఈ లోపు 11వ తారీఖున అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, 12వ తారీఖున స్పీకరును ఎన్నుకోవటం, 13వ తారీఖున బల పరీక్ష ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి. అయితే, యువతలో కొత్త ఆశలు రేకెత్తించి, మంచి మార్పునకు ప్రతినిధి అన్న విశ్వాశం పుట్టించి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యను, చెయ్యనివ్వను అని ప్రకటించిన రెండవ రోజే తప్పటడుగు వెయ్యటం జనానికి చాలా ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన కలిగించింది. అదే తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా నియమించటం. ఆయనే రాధన్ పండిట్ వెట్రివేలు. తన వ్యక్తిగత వైద్యుడినో వంటవాడినో ముఖ్యమంత్రి కార్యాలయంలో నియంఉంచుకుంటే ఎవరూ ఆక్షేపించరుగానీ, ఒక జ్యోతిష్యుడిని ముఖ్య మంత్రికి ప్రత్యేక అధికారిగా నియమించటం అందరినీ తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఇదేనా విజయ్ విజయం వలన వచ్చే మార్పు? ఇదేనా ప్రజలు, ముఖ్యంగా యువత విజయ్ నుంచి ఆశించేది? చిన్నపిల్లలు విజయ్ మామ చేసే పనులను ప్రశ్నించలేరు అనుకోండి. ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారి అంటే ఆ అధికారి జీతభత్యాలు, తిరగటానికి వాహనం, ఉండటానికి నివాసం గట్రాకి అయ్యే ఖర్చు అంతాకూడా ప్రభుత్వ ఖజానా నుంచేకాదా వెళ్ళేది! ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది?

ఆయనికి ఉత్సాహంగా ఓట్లు వేసి గెలిపించిన యువతకు ఆయన ఇచ్చే సందేశం ఏమిటి అన్న ప్రశ్న అందరి మదిలో మెదిలింది. మీ భవిషత్తు మీ చేతుల్లో లేదు, మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అన్నదేనా యువతకు ఆయన ఇచ్చే సందేశం అని అసెంబ్లీ సాక్షిగా ఆయనకు మద్దతు పలికిన మిత్రపక్షాలే తీవ్రంగా స్పందించాయి. ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది అనేదానికి ఇదొక మచ్చుతునకా అని గట్టిగానే నిర్మొహమాటంగా అసెంబ్లీలో ప్రశ్నించారు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు. 12వ తారీఖున ప్రత్యేక అధికారిగా నియమించిన జ్యోతిష్యుడికీ 13వ తారీఖునే ఉద్వాసన పలికాడు ముఖ్యమంత్రి విజయ్. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్నట్లు అంత చపలమైన నిర్ణయం తీసుకోవటం ఎందుకు? అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వేసే ప్రతి అడుగును, సమాజంలో అనేక వర్గాల వారు, అది సామాన్య ప్రజానీకం కావచ్చు, మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు, అధికారులు కావచ్చు, యువత కావచ్చు, సునిశితంగా పరిశీలిస్తారు అన్న విషయం తెలియదా? లేక అధికారం నా చేతులో వుంది గనక నేను ఏమైనా చెయ్యగలను అన్న అహంభావమా? ఈ జ్యోతిష్యుడి నియామకం రద్దు నిర్ణయాన్ని అసెంబ్లీ లోనే ప్రకటించివుంటే హుందాగా వుండేది. సభ్యుల అభిప్రాయాలకు సునిశితంగా తక్షణమే స్పందించినట్లు కూడా వుండేది. ఏదేమైనా వివాదాస్పదమైన నియామకం రద్దు హర్షించదగిన విషయమే.

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ చేసిన ప్రసంగంలో ఒక ముఖ్యమైన అంశం: తన ప్రభుత్వంలో అధికార కేంద్రాలు వుండవు, తానే అధికారానికి అంతటికీ కేంద్రబిందువును అని. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడోగానీ, మరి జోసెఫ్ కి స్టాలిన్ కి ఏముంది తేడా? ఇదేనా తమిళ రాజకీయంలో విజయ్ తీసుకొచ్చే కొత్త మార్పు? మంత్రులు డమ్మీలేనా? నాయకుడు అంత మాట అన్నతరవాత మంత్రులు స్వేచ్ఛగా పనిచేయగలరా? స్వేచ్ఛతోనే బాధ్యత వస్తుంది అన్న సత్యాన్ని మన నేతలు అప్పుడు గుర్తిస్తారు? ముఖ్యమంత్రిగా విజయ్ ప్రయాణం భవిషత్తులో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేకపోయినా, ఈ జ్యోతిష్యుడి ఉదంతం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది అనటంలో సందేహం లేదు. అధికారానికి తానే కేంద్రబిందువును అనటం కూడా రాజకీయ పరిపక్వత లేనిమాటే.

ప్రాంతీయ పార్టీల రాజకీయాలు నాయకుడి చుట్టూ తిరుగుతాయి అనేది జగమెరిగిన సత్యం. పార్టీని స్థాపించిన నాయకుడు, పార్టీని సొంత ఆస్తిగా భావిస్తాడు. ప్రాంతీయ పార్టీలలో వ్యవస్థలు వుండవు. నాయకుడు, తన కుటుంబ సభ్యులే వ్యవస్థ అంటే. జాతీయ పార్టీలో అయితే పైనుంచి గమనిస్తారు అన్న భయం ఉంటుంది. అదే నాయకుడిని జాగ్రత్త పరుస్తుంది, జవాబుదారీని చేస్తుంది. ప్రాంతీయ పార్టీలో అయితే అంతా నాయకుడి ఇష్టమే. అటువంటి పరిస్థితిలో నాయకుడు నిష్క్రమిస్తే పార్టీ చిన్నాభిన్నమైపోతుంది. జయలలిత పార్టీలో నేడు జరుగుతున్నది అదే. ఆమె ఉన్నంతవరకూ ఎవరినీ ఎదగనివ్వలేదు. ఆమె పోయాక అందరూ మేమంటే మేమే నాయకులం అని జుట్టు పట్టుకుంటున్నారు. నేడు జయలలిత పార్టీలో అందరూ నాయకులే, అనుచరులే లేరు.

ప్రాంతీయ పార్టీలలో నాయకుడికి సలహాలు ఇచ్చేవారు కూడా నిజాయితీతో కూడుకున్న సలహాలు కాకుండా నాయకుడు మెచ్చే సలహాలు మాత్రమే ఇస్తారు. నిజాయితీగా సలహాలు ఇస్తే అట్టి సలహాదారుల భవిషత్తు అంధకారం అవుతుం దని అందరికీ తెలుసు. ఎవరికళ్ళు వాళ్ళే పొడుచుకోరు కదా! విజయ్ మంత్రులకు స్వేచ్ఛగా వ్యవహరించే చోటు ఇవ్వాలి. విశ్వాసం బాధ్యతను పెంచుతుంది. అపనమ్మకం, అనుమానం బాధ్యతను విస్మరించేలా చేస్తుంది. సమస్యలను అర్ధం చేసుకోవటానికి, సమాచారాన్ని అనేక వర్గాలనుంచి సేకరించి, క్రోడీకరించి సమస్యలను పరిష్కారం చేయాలంటే సమిష్టి నాయకత్వం, సమిష్టి బాధ్యత, సమిష్టి నిర్ణయం అనేవి చాలా కీలకం. అప్పుడే ఒక కొత్త ఒరవడికి మార్గదర్శనం చేసినవాడు అవుతాడు నిజమైన నాయకుడు. లేకపోతే వినాయకుడుగానే మిగిలిపోతాడు. అంతా నాయకుడే చూసుకుంటాడులే అన్న భావన కలగచేస్తుంది. అట్లాటి పరిస్థితిలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారుగానీ నాయకులుగా ఎదగలేరు. ప్రాంతీయ పార్టీలలో జరుగుతున్న తంతు ఇదే. విజయ్ ఈ పంథాకి భిన్నంగా వ్యవహరించాలని, మంచి మార్పుకు శ్రీకారం చుట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రజల కోరికను వమ్ము చెయ్యడని ఆశించుదాం.

ఉదయనిధి సనాతన ధర్మం అన్న పేరుతో పెట్టిన ఉచ్చులో విజయ్ పడకూడదు. సనాతన ధర్మం చాలా వివాదాస్పదమైన అంశం. దానిమీద సమాజం, మేధావులు, మీడియా గట్రా చర్చించాలి. ప్రభుత్వం కాదు. ఉదయనిధి విధానం ఉదయానిధిది. కానీ, తన విధానమే ప్రభుత్వ విధానం కావాలనుకోవడం అవివేకం, అజ్ఞానం. అందునా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా తరుణంలో అది మరీ విచిత్రం. ఆ చర్చలో విజయ్ పాల్గొనకూడదు. ఆ ఉచ్చులో తాను పడకూడదు. తన ఎమ్మెల్యేలను కూడా కట్టడి చెయ్యాలి. ప్రతిపక్ష నేత వ్యక్తిగత అజెండాకి ప్రభుత్వ నేత వత్తాసు పలకనవసరం లేదు.

చివరగా విజయ్ జ్యోతిష్యుడిని కాకుండా ఒక మంచి జర్నలిస్ట్ ని సలహాదారుగా పెట్టుకోవడం సముచితం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The FEDERAL TELANGANA