జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తమ సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మొబైల్ ఫోన్లతో నిరసనలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసే జెన్ జెడ్ నిరసనకారులతో పోలీసులు ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ SOPలో ప్రత్యేక సూచనలు ఉన్నాయి.
ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.. పోలీసులు కోపంగా లేదా దూకుడుగా కనిపించే పరిస్థితులను నివారించడం. కెమెరాల ముందు పోలీసుల కోపం, వాగ్వాదం, బలప్రయోగం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'మీ కోపమే వాళ్లకు కంటెంట్'
కొత్త SOPలో నిరసనకారులు పోలీసులతో పోరాడటం కంటే.. వారి స్పందనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నట్లు సమాచారం. అందుకే అధికారులు "విలన్ పాత్రను తిరస్కరించండి" అనే విధంగా వ్యవహరించాలని సూచించారు.
నిరసనకారులు మొబైల్ ఫోన్లను ముఖాల ముందు పెట్టినా అధికారులు ప్రశాంతంగా ఉండాలని, నేరుగా ముందుకు చూస్తూ తటస్థ ముఖ కవళికలు కొనసాగించాలని సూచించారు. వాగ్వాదాలకు దిగడం, వ్యక్తిగత లేదా భావోద్వేగ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.
ఎవరైనా రెచ్చగొట్టేలా మాట్లాడినా.. కుటుంబం, జీతం వంటి వ్యక్తిగత విషయాలు ప్రస్తావించినా స్పందించకూడదని సూచించారు. అవసరమైతే "దయచేసి సహకరించండి.. మేము మా విధిని నిర్వర్తిస్తున్నాం" అని మాత్రమే చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం.
ఫోన్లు, వ్యంగ్యాలకు స్పందించొద్దు..
నిరసనకారులు పోలీసుల చేతుల్లోని ఫోన్లు లేదా వస్తువులను లాక్కోవడానికి ప్రయత్నించినా, వస్తువులు విసిరినా, పాటలు పాడినా, నృత్యాలు చేసినా లేదా వ్యంగ్యంగా ప్లకార్డులు ప్రదర్శించినా కోపంగా స్పందించవద్దని SOPలో సూచించారు.
పువ్వులు, స్వీట్లు, నీళ్ల బాటిళ్లు, టీ వంటి వాటిని అందించడం కూడా కెమెరా ముందు పోలీసుల స్పందనను రికార్డ్ చేయడానికి చేసే ప్రయత్నం కావచ్చని అధికారులు భావించాలని సూచించారు. వాటిపై అతిగా స్పందిస్తే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
మహిళా నిరసనకారుల విషయంలో ప్రత్యేక సూచనలు..
మహిళా నిరసనకారులను పురుష సిబ్బంది తాకకుండా ఉండాలని, అవసరమైన సందర్భాల్లో మహిళా సిబ్బంది పరిస్థితిని నిర్వహించాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి.
అదే సమయంలో పోలీసుల పని కేవలం గుంపును అదుపు చేయడం మాత్రమే కాదని SOP స్పష్టం చేస్తోంది. ఎవరైనా నిరసనకారుడు అనారోగ్యానికి గురైనా, స్పృహ కోల్పోయినా లేదా గాయపడినా వెంటనే సహాయం చేయాలని సూచించారు.
అలాంటి వ్యక్తిని జాగ్రత్తగా పైకి లేపి, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు వెళ్లేందుకు మార్గం ఖాళీ చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోయిన సందర్భాల్లో కూడా పోలీసులు సహాయం చేయాలని సూచించారు.
'మర్యాదగా మాట్లాడాలి'
నిరసనకారులను నియంత్రించేటప్పుడు లాఠీలు ఎత్తడం కంటే ముందుగా మాటల ద్వారా విజ్ఞప్తి చేయాలని పోలీసులు సూచించారు. "అయ్యా.. ఇటు రండి", "దయచేసి సహకరించండి" వంటి మర్యాదపూర్వక పదాలను ఉపయోగించాలని చెప్పారు.
యూనిఫాంలో ఉన్న సిబ్బంది ప్రశాంతంగా, గౌరవంగా మాట్లాడటం వల్ల గుంపులో ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా పోలీసులు నిరసనకారుల కెమెరాలకు "ప్రశాంతమైన ముఖం, సహాయం చేసే చేయి" మాత్రమే కనిపించేలా వ్యవహరించాలని SOP సూచిస్తోంది.
మరిన్ని కఠిన ఆంక్షలు..
ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 163 కింద న్యూఢిల్లీ జిల్లా పరిధిలో అనధికారిక కవాతులు, ప్రదర్శనలు, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడంపై నియంత్రణలు అమల్లో ఉన్నాయి.
జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా ఆకస్మికంగా లేదా పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసనలకు అనుమతి ఉన్న సందర్భాల్లో వాటిని రామ్‌లీలా మైదానం వంటి నిర్ణీత ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. అక్కడ కూడా పాల్గొనే వారి సంఖ్య, నిరసన సమయంపై పరిమితులు ఉండవచ్చు.
అనధికారిక నిరసనలకు ప్రజలను సమీకరించేలా తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా పోస్టులు చేయడం లేదా ప్రచారం చేయడంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

