Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2029లో జగన్‌కి ఆ అవకాశం ఇవ్వం... చంద్రబాబుతో పోల్చుకునే స్థాయి ఆయనకు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

2029లో జగన్‌కి ఆ అవకాశం ఇవ్వం... చంద్రబాబుతో పోల్చుకునే స్థాయి ఆయనకు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

Times Now Telugu 1 week ago

2029లో కూడా వైసీపీని ఓడించి తీరుతామని... జగన్‌ను ముఖ్యమంత్రి కానివ్వం అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. రెండో రోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు విధ్వంసం, విద్వేషం నుంచి వికాసం వైపు అనే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ప్రసంగించారు.'విధ్వంసం అనే పేరు జపాన్‌లో బాంబులు పడ్డప్పుడు విన్నాం... రాజుల పోరాటంలో కోటలపై జరిగిన దాడుల్లో విన్నాం. 2019లో ఒక దుర్మార్గుడు పాలన సాగించిన అనంతరం ఆ పదం విన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరుగుతుంది... ఆ ప్రమాదమే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

వైఎస్ఆర్, జగన్‌కు ప్రజలంటే ద్వేషం
'తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచిన వ్యక్తి... 11 ఛార్జ్ షీట్లు, 16 నెలలు జైల్లో ఉన్న దొంగకు అధికారం ఇవ్వడం ప్రజలు చేసిన తప్పు. అధికారాన్ని కనీసం రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఆలోచించకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే లక్ష్యంగా పని చేశాడు'అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. 'దానికి సాక్షులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీలో చూసి అనుభవించి చెబుతున్నాను. తండ్రి వైఎస్ఆర్ నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు రాష్ట్ర ప్రజలంటే వాళ్లకి కోపం ద్వేషం ఎందుకో తెలియదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినా వారు ఉన్నారు. కానీ ఒక దుర్మార్గుడు మాత్రమే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు'అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

లోకేశ్ కాలిగోటికి కూడా జగన్ పనిచేయడు
'30 ఏళ్లు సీఎంగా ఉండాలని కక్ష గట్టి పని చేశాడు. అందులో బాధ్యులు టీడీపీ కార్యకర్తలు. మనల్ని వేధించినా, ఆస్తులను దోచుకున్నా, కష్టపెట్టినా కార్యకర్తలను లోకేష్ అక్కున చేర్చుకున్నారు. ఆ ఫలితమే 2024 ఎన్నికల కూటమి విజయం'అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.'ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ రెడ్డి ధ్వంస రచన మొదలెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. చంద్రబాబుతో పోల్చుకునే స్థాయి, వ్యక్తిత్వం జగన్‌కు లేదు. నారా లోకేశ్ కాలి గోటికి కూడా జగన్ పనిచేయడు'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవినీతి సొమ్ముతో అధికారంలోకి వచ్చిన జగన్

'వైఎస్ జగన్ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి చేసిన సొమ్ముతో అధికారంలోకి వచ్చాడు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు. చంద్రబాబు తెచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి పరిశ్రమను, సాగునీటి ప్రాజెక్టులను జగన్ విధ్వంసం చేశాడు' అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.'విధ్వంసకుడి పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పెట్టకుండా పారిపోయారు. నేడు సమర్థవంతమైన నాయకుడు, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబును చూసి నేడు లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. 24 మాసాల్లో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్
'విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నాం. పోలవరం, అమరావతి శరవేగంగా పూర్తవుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారు'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. '2014-19లో రూ.68 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులను పూర్తి చేశాం. 2019-24లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను రాయలసీమ బిడ్డ జగన్ రెడ్డి రద్దు చేశాడు. సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశాడు. నేడు కూటమి ప్రభుత్వంలో 24 నెలల్లోనే రూ.24 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేశాం'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

గొడ్డలితో రాజకీయం చేస్తున్న జగన్

'వైఎస్ జగన్ ప్రెస్ మీట్ చూస్తే... నాది కాదు మా కుటుంబ నేపథ్యమే ఫ్యాక్షనిజం విధానంలో పుట్టిందని... మాది గొడ్డలి పార్టీ అని ఒప్పకున్నాడు. వైఎస్ రాజారెడ్డిని చేరదీసిన మంగంపేట బైరటీస్ యాజమానినే హత్య చేసిన కుటుంబం మీది. తాత రాజారెడ్డి వేట కొడవళ్లతో, తండ్రి వైఎస్ఆర్ కత్తులతో, మనవడు జగన్ గొడ్డలితో రాజకీయం చేస్తున్నాడు'అంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. 'ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వలేని అసమర్థుడు జగన్... నేడు డీఎస్సీపై మాట్లాడటం సిగ్గుచేటు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు... డీఎస్సీపై జగన్ తీరు అలాగే ఉంది. గొడ్డలి పార్టీని డైవర్ట్ చేసేందుకే నారా లోకేశ్‌పై విమర్శలు చేస్తున్నారు'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

' రాజకీయాల్లో వెన్నుపోటు పదం జగన్‌ రెడ్డికే కరెక్ట్‌గా వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని సోనియా, రాహుల్ గాంధీని ఉపయోగించుకొని వైఎస్ఆర్ సీఎం అయ్యాడు. ఆ పదవిని అడ్డు పెట్టుకొని జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడు. సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పోడిచిన వాడు జగన్'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.'ఐదేళ్ల పాలనలో రూ.13 లక్షల కోట్ల అప్పులు... రూ.2.26 లక్షల బకాయిలు. రెండేళ్ల పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేశాం. సీపీఎస్ రద్దు అన్ని ఉద్యోగులను వెన్నుపోటు పోడిచిన వ్యక్తి జగన్'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.'చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పుకోలేక పోవడంతో 2019లో మనకు నష్టం జరిగింది. 2029లో జగన్ రెడ్డి ఆ అవకాశం ఇవ్వమని చెబుతున్నాం.. జగన్‌లా అబద్ధాలు కాకుండా చేసింది చెబుతాం. చంద్రబాబు, లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసంవైపు తీసుకెళ్తున్నారు'అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu