Dailyhunt
అమెరికాకు బిగ్ షాక్?... ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేశామన్న ఇరాన్

అమెరికాకు బిగ్ షాక్?... ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేశామన్న ఇరాన్

Times Now Telugu 1 week ago

జ్రాయెల్-అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్దంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌లోకి కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా భీకర దాడులు చేస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదనే సంకేతాలు పంపుతుంది. తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థల ప్రకారం... అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది.

ఐఆర్‌జీసీకి చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ టెలిగ్రామ్ పోస్ట్‌లో... ఆ ఎఫ్-35 ఫైటర్ జెట్ పూర్తిగా ధ్వంసమై కూలిపోయిందని తెలిపింది. విమానం తీవ్రంగా దెబ్బతినడం వల్ల పైలట్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. ఎఫ్-35 ఫైటర్ జెట్ కూలిపోయినప్పుడు భయంకరమైన పేలుడు సంభవించిందని.. ఆ కారణంగా పైలట్ బయటకు దూకి ఉండటం అసంభవం అని ఇరాన్ మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఎఫ్-35 ఫైటర్ జెట్‌కు చెందినవిగా చెబుతున్న శిథిలాల చిత్రాలను కూడా టెలిగ్రామ్ పోస్టులో షేర్ చేశారు. ఈ చిత్రాలలో విమానం తోక భాగంలా కనిపించే దానిపై ''యూఎస్ ఎయిర్ ఫోర్సెస్ ఇన్ యూరప్'' అనే పదాలు ఉన్నట్లు కనిపించే ఒక ఫోటో కూడా ఉంది. అయితే యూఎస్ సెంట్రల్ కమాండ్, ఇప్పటివరకు ఈ దాడిని ధృవీకరించడం గానీ, ఖండించడం గానీ చేయలేదు. అయితే అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేయడం నిజమే అయితే... అది అగ్రరాజ్యానికి భారీ ఎదురుదెబ్బగా మిగలనుంది.

ఇక, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఇరాన్‌తో యుద్దంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలు చాలా వరకు నాశనమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే... తాము ఇరాన్ కీలక లక్ష్యాలపై, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలపై చాలా తీవ్రంగా దాడి చేయబోతున్నామని ట్రంప్ హెచ్చరించారు.ఇరాన్ చమురును కూడా లక్ష్యంగా చేసుకుంటామని... అవి అంతమైపోతాయని చెప్పుకొచ్చారు.

ఈ సంఘర్షణ ముగింపు దశకు చేరుకుందని ట్రంప్ తన వాదనను పునరుద్ఘాటించారు. ''రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై అమెరికా అత్యంత తీవ్రంగా దెబ్బకొట్టబోతుంది. వారిని రాతియుగానికి తీసుకువెళ్తాం, అదే వారికి సరైన చోటు'' అని ట్రంప్ పేర్కొన్నారు. అణు ఆయుధాల విషయంలో ఇరాన్‌ను ఎన్నటికీ విశ్వసించలేమని పేర్కొన్నారు. అమెరికా తన లక్ష్యాలను సాధించడానికి చాలా దగ్గరలో ఉందని అన్నారు. కీలక వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు పూర్తి కావొస్తున్నాయని... అమెరికా ఈ దాడులను చాలా వేగంగా పూర్తిచేస్తుందని ట్రంప్ అన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu