Dailyhunt
Andhra Pradesh Rains: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు... నేడు ఈ జిల్లాలకు అలర్ట్

Andhra Pradesh Rains: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు... నేడు ఈ జిల్లాలకు అలర్ట్

Times Now Telugu 1 week ago

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. వేసవిలో ఓ వైపు ఎండల తీవ్రత, వడగాలులు వీస్తుంటే... మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏపీలో బుధవారం (ఏప్రిల్ 8) రోజున వాతావరణం ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం...

ఏపీలో బుధవారం రోజున పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బుధవారం రోజున రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

అలాగే, బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 59.5 మి.మీ, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2 మి.మీ, రాజంలో 47 మి.మీ, కె కోటపాడులో 21.2 మి.మీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ చెప్పారు.

ఇదిలాఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం రోజున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం తెలిపింది.

ఇక, గురువారం రోజున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర,రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం పేర్కొంది.

ఇదిలాఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే వేసవి ప్రారంభం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వేసవిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, ఈదరుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

అకాల వర్షాలు, ఈదురుగాలులకు పలుచోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు కొన్నిచోట్ల కోతకు వచ్చిన మామిడి నేలరాలింది. ఇక, పలుచోట్ల ఆరబెట్టుకుంటున్న ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక, ఈ ఏడాది వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu