తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు.
హరీష్ రావు ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు... బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మా సిటీ నిర్మాణం తలపెట్టామని తెలిపారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్ట్‌లో డీవియేషన్ ఉంటే రైతుల భూములను తిరిగి ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో జిమ్మిక్కు చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీని కొనసాగిస్తామని తెలిపిందని అన్నారు. కానీ బయట మాత్రం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో 75 శాతం ఇతర వ్యాపారాలకు, కేవలం 25 శాతం మాత్రమే ఫార్మా రంగానికి కేటాయించేలా మార్పులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇది చట్టబద్ధం కాదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. లక్షలాది ఉద్యోగాల లక్ష్యంతోనే ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామని తెలిపారు.
Read more news like this on telugu.timesnownews.com

