Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారా?... ఢిల్లీలో ఏం జరిగింది?

బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారా?... ఢిల్లీలో ఏం జరిగింది?

Times Now Telugu 2 weeks ago

మిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే అన్నామలై ఈరోజు ఢిల్లీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసి రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టుగా ప్రచారం సాగుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం అన్నామలై ఇప్పటివరకు బీజేపీకి రాజీనామా చేయలేదని తెలుస్తోంది. అయితే పార్టీని వీడాలనే తన నిర్ణయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి అన్నామలై మౌఖికంగా తెలియజేశారు. అన్నామలై ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసి చర్చలు జరిపారు.

తమిళనాడులోని పరిణామాలపై అన్నామలై బీజేపీ అగ్ర నాయకత్వానికి ఈ సందర్భంగా అన్నామలై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే, పార్టీ నుండి వైదొలగాలనే తన ఆలోచన వెనుక గల కారణాలను తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి వేచి ఉండాలని బీజేపీ అధిష్టానం అన్నామలైకి సూచించింది. దీంతో అన్నామలై రాజీనామా లేఖను సమర్పించలేదు. పార్టీ అధిష్టానం నుంచి అన్నామలైను శాంతిపజేసే హామీ లభించకపోతే... ఆయన రేపు లేదా ఎల్లుండి పార్టీని వీడుతున్న తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు అన్నామలై రేపటి వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే, సోమవారం చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు అన్నామలై మీడియాతో మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని జరుగుతున్న ఊహాగానాల గురించి విలేకరులు ప్రశ్నించగా... దీనిపై రెండు రోజుల్లో సంబంధించిన సమాధానాలు ఇస్తానని, తన వైఖరిని స్పష్టం చేస్తానని అన్నామలై తెలిపారు.

ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి అన్నామలై తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనకమైన ఫలితాలు చూసింది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నామలై పోటీ చేయలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగినప్పటి నుంచి తనకు ఎటువంటి ముఖ్యమైన సంస్థాగత లేదా రాజకీయ పదవులను కేటాయించకపోవడంపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్నామలై వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొందనే వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే అన్నామలైకు, బీజేపీ అధిష్టానానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. అన్నామలై ఇటీవల సీబీఎస్ఈ సవరించిన త్రిభాషా విధానాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. తద్వారా అన్నామలై బీజేపీ అధిష్టానానికి ఒక సందేశం పంపారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అన్నామలై బీజేపీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu