Dailyhunt
చేతిలో రూ. 40, బ్యాంక్ అకౌంట్‌లో రూ. 44... ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆమె ఆస్తి రూ. 84 మాత్రమే!

చేతిలో రూ. 40, బ్యాంక్ అకౌంట్‌లో రూ. 44... ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆమె ఆస్తి రూ. 84 మాత్రమే!

Times Now Telugu 1 week ago

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభ్యర్థుల నామినేషన్‌లు, హోరాహోరీ ప్రచారాలతో సందడి వాతావరణం నెలకొంది.

అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చాలా మంది కోట్లలో ఆస్తులను ప్రకటిస్తున్న రోజులివి. అయితే కేరళ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తితో ఉన్న ఓ అభ్యర్థి మాత్రం... తన ఆస్తిని రూ. 82గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు... సాధారణంగా ఎన్నికలు అనగానే హోరాహోరీ ప్రచారాలు, భారీ ఆర్థిక వ్యయాలతో కూడుకున్నవి. అయితే కేరళలోని ఎట్టుమానూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు ఆష్నా తంపి... తన ఆస్తులను రూ. 84గా పేర్కొన్నారు.

సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీకి చెందిన 26 ఏళ్ల ఆష్నా తంపి... తన ఎన్నికల అఫిడవిట్‌లో కేవలం రూ.84 విలువైన ఆస్తులను ప్రకటించారు. తద్వారా కేరళ ఎన్నికలు 2026లో అత్యంత తక్కువ సంపద కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ఆమె సమర్పించిన వివరాల ప్రకారం... తంపి చేతిలో రూ.40 నగదు, బ్యాంకు ఖాతాలో రూ. 44 ఉన్నాయి. అలాగే, ఆష్నాకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. ఆమెకు ఆస్తి, భూమి, ఇల్లు, ఆభరణాలు లేదా వాహనాలపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది.

అయితే మరి ఇంత తక్కువ ఆస్తి కలిగిన ఆష్నా తంపి... తన ఎన్నికల ప్రచారాన్ని ఇతరులకు భిన్నంగా సాగిస్తున్నారు. ఆమె కరపత్రాలు, పోస్టర్లు ముద్రించడాని... స్నేహితులు, పార్టీ కార్యకర్తలు, స్థానికుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఆష్నా తంపి పెద్ద పెద్ద ర్యాలీలు ఏం లేకుండా... ఇంటింటికీ వెళ్లి, కరపత్రాలు పంచుతున్నారు. అలాగే, ఓటర్లతో మాట్లాడుతూ... తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే తాను గెలిస్తే ఏం చేయాలని అనుకుంటున్నానే దానిపై ఓటర్ల వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొట్టాయం మెడికల్ కాలేజీలో వైద్యుల కొరత, వరి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రజల తాగునీటి సమస్యలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు.

అయితే ఇతర అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ... ఎన్నికల విజయం డబ్బుపై ఆధాపడి ఉండకూడదని ఆష్నా తంపి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆమె అన్నారు. ఇక, ఆష్నా తంపి దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.

ఇక, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థికి చట్టబద్ధమైన వ్యయ పరిమితి రూ. 40 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనధికారికంగా చాలా మంది అభ్యర్థులు ఇంతకంటే ఎక్కువగానే ఖర్చు చేస్తారనేది బహిరంగ రహస్యమే. అయితే ఇందుకు భిన్నంగా ఆష్నా తంపి ప్రచారం, ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు సేకరిచడం... వంటివి పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆష్నా తంపి గురించి చర్చ జరుగుతుంది.

ఇదిలాఉంటే, ఎన్నికల నిబంధనల ప్రకారం... నామినేషన్ దాఖలు చేసిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 10,000, షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు రూ. 5,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన కనీస ఓట్లను అభ్యర్థి సాధించలేకపోతే, ఈ డిపాజిట్‌ను జప్తు చేస్తారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu