కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇవాళ సెల్ బ్రాడ్ కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించింది.ఈ పరీక్షలలో భాగంగా చాలా మందికి వారి ఫోన్లలో పెద్ద శబ్ధంతో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ అందింది.
అయితే ఇది కేవలం వ్యవస్థ పనితీరును తనిఖీ చేయడానికి చేసిన పరీక్ష మాత్రమేనని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ అలర్ట్ మెసేజ్ ఒక్కొక్కరికి ఒక్కసారే వస్తుందా? ఎక్కువ సార్లు వస్తుందా? అందరికీ వస్తుందా? అన్న సందేహం నెలకొంది.
మెుబైల్స్‌కి వచ్చిన టెస్ట్ మెసేజ్ ఇదే
భారతదేశ వ్యాప్తంగా పలు మెుబైల్స్ టింగ్ టింగ్ అంటూ మార్మోగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు ఉదయం నుంచి మెుబైల్స్‌కు టెస్ట్ మెసేజ్ వస్తోంది. ఈ టెస్ట్ మెసేజ్ తెలుగు, ఇంగ్లీషు బాషలలో వస్తోంది. మరోవైపు ఈ టెస్ట్ మెసేజ్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున శబ్ధం వస్తుంది. అయితే ఈ మెసేజ్‌లు వచ్చేటప్పుడు పెద్దపెద్ద శబ్ధంవచ్చే అవకాశం ఉందని ఈ క్రమంలో ఎలాంటి ఆందోళన వద్దు ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. ఇకపోతే ఆ టెస్ట్ మెసేజ్‌ను పరిశీలిద్దాం. 'భారతదేశం తన స్వదేవీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తమ పౌరుల కొరకు తక్షణ విపత్తునిర్వహణ హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్ అలర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులు, సురక్షితమైన దేశం. ఈ సందేశాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం భారత ప్రభుత్వం' అని టెస్ట్ మెసేజ్ వచ్చింది.
ఒకటికంటే ఎక్కువసార్లు సైరన్ రావొచ్చు
ఇది కేవలం టెస్టింగ్ మాత్రమే కావడంతో ఒకటికి రెండు సార్లు సైరన్ అలర్ట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఇది కేవలం ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగంగా ట్రయల్ రన్ లాంటిది కాబట్టి కొందరికి రెండు సార్లు వచ్చినా ఏమీ ఆందోళన చెందవద్దు అని సూచించింది. దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అలర్ట్ సైరన్ అని కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దు అని భారత ప్రభుత్వం పేర్కొంది.
అలర్ట్ సైరన్‌లతో భయాందోళనలు వద్దు
ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు ఇవాళ ఒక ప్రత్యేక హెచ్చరిక సందేశం రానుంది. పెద్ద బీప్ సౌండ్‌తో కూడిన ఈ సందేశం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...ఇది కేవలం ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగమేనని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అలర్ట్ సైరన్ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకే అలర్ట్ సైరన్
మొబైల్ నుంచి వచ్చే శబ్దాలు లేదా సందేశాలు చూసి భయపడ వద్దని అధికారులు సూచించారు.ఈ అలర్ట్ సైరన్ వచ్చినప్పుడు మెుబైల్ వినియోగదారులు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.ఈ అధునాతన హెచ్చరిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎన్‌డీఎంఏ వెల్లడించింది.ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం అని పేర్కొంది. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు అని ఎన్‌డీఎంఏ పేర్కొంది. ఈ ఫ్లాష్ మెసేజ్ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుందని అయితే ఈ ట్రయల్ రన్ ద్వారా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని, హెచ్చరికలు చేరే వేగాన్ని అధికారులు అంచనా వేయనున్నారు. భవిష్యత్తులో తుపానులు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడనుంది అని ఎన్‌డీఎంఏ పేర్కొంది. ఈ వ్యవస్థ ద్వారా నెట్‌వర్క్ జాప్యం లేకుండా నేరుగా వినియోగదారుల మొబైల్ స్క్రీన్‌పైకి హెచ్చరికలను పంపవచ్చని... ఇది కేవలం ఒక సాంకేతిక పరీక్ష మాత్రమేని ఎన్‌డీఎంఏ అధికారులు వెల్లడించారు.
Read more news like this on telugu.timesnownews.com

