పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ఆ తర్వాత ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 10 గంటల వరకు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే క్లియర్ పిక్చర వచ్చే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాలలో ఓటర్లు ఎటువంటి తీర్పునిచ్చారు?, విజయం ఎవరిని వరించనుంది?, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని గంటల్లోనే దొరకనున్నాయి. అయితే ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
పశ్చిమ బెంగాల్...
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే ఫాల్టా నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో మే 21న రీపోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు ఈరోజు జరగనుంది. అయితే బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారం దక్కించుకుంటారా? లేదా అక్కడ బీజేపీ తొలిసారి అధికారం చేపట్టనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు సాగుతుందని... బీజేపీ మెజారిటీకి చేరువవుతుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధిస్తాయని కూడా పేర్కొన్నాయి.
ఇక, పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టేందుకు మేజిక్ ఫిగర్ 148 సీట్లు. పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం 92.93 శాతానికి చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే. ఏప్రిల్ 29న జరిగిన రెండో విడతలో 92.67 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో 93.19 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే రెండో విడతలో పోలింగ్ జరిగిన ఫాల్టాలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఓట్ల లెక్కింపు సందర్భంగా బెంగాల్‌లో ఎటువంటి హింస, అల్లర్లు చెలరేగకుండా ఈసీ చర్యలు చేపట్టింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించింది. బెంగాల్‌లో మొత్తంగా 75 వేల కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపింది.
తమిళనాడు...
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ఫిగర్ 118 సీట్లు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ 85.10 శాతంగా నమోదైంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పోటీ కొనసాగుతూ వస్తుంది. అయితే ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ఎన్నికల బరిలో నిలవడంతో ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయనేది ఉత్కంఠగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకేలలో విజయ పార్టీ ఎవరికి నష్టం చేకూరుస్తుంది? అనేదే ఇప్పుడు చర్చ సాగుతుంది.
ఇక, అయితే తమిళనాడులో డీఎంకే కూటమి అధికారం నిలుపుకుంటుందా?, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారం కైవసం చేసుకుంటుందా?, విజయ్ పార్టీ అనుహ్యరీతిలో ఫలితాలు సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో డీఎంకే అధికారం చేపట్టొచ్చని అంచనా వేయగా... ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. అయితే టీవీకే కూడా భారీగా ఓట్లను సొంతం చేసుకుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
కేరళ...
కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 9న జరగగా... పోలింగ్ శాతం 79.70గా నమోదైంది. ఇక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కూటమిలో భాగంగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF), బీజేపీలు కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నించాయి. అయితే కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమికి షాక్ తప్పదని... యూడీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
అస్సాం...
అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ఫిగర్ 64 సీట్లు. అస్సాంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. అస్సాంలో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ సహా పలు పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంది. ఇక, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9వ తేదీన జరిగాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.9 శాతం పోలింగ్ నమోదైంది.
అస్సాంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కన్నేసింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అస్సాంలో బీజేపీదే విజయం అని అంచనా వేశాయి.
పుదుచ్చేరి...
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ఫిగర్ 16 సీట్లు. పుదుచ్చేరిలో ఎన్డీయే, ఇండి కూటమిల మధ్య పోటీ నెలకొనుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగగా... ఎన్నికల సంఘం గణంకాల ప్రకారం పుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమిదే అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నారు.
గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల కూడా ఈరోజే వెలువడనున్నాయి.
Read more news like this on telugu.timesnownews.com

