దేశవ్యాప్తంగా 'ప్రజా పంపిణీ వ్యవస్థ' ద్వారా సరఫరా చేసే బియ్యంలో '10 శాతం' నూకల (బ్రోకెన్ రైస్) విధానానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోపాటు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకమైన పెండింగ్ సమస్యలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిన 10 శాతం నూకల పైలట్ ప్రాజెక్టు కేంద్ర ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు అత్యంత నాణ్యమైన బియ్యం సరఫరా చేయ డమే లక్ష్యంగా ఈ విధానానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.
వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దేశ వ్యాప్తంగా 10 శాతం నూకల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న 25 శాతం నూకల విధానానికి బదులుగా 10 శాతం నూకల విధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం సరఫరా అవుతుందని తెలిపారు.బియ్యం పంపిణీ సక్రమంగా సద్వినియోగం అయ్యేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా ఏపీలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. ఏపీ స్ఫూర్తిగా నిలిచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు కాబోతుండటం సంతోషంగా ఉందని అన్నారు.
ఏపీలో వచ్చే ఖరీఫ్ పంట సన్నద్ధతపైనా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చించినట్లు చెప్పారు. పౌరసరఫరాల విభాగం ద్వారా బయటకు వెళ్లే ప్రతి బియ్యం బస్తాను గుర్తించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ రబీ సీజన్‌లో ఏపీ నుంచి పెద్ద మొత్తంలో ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) దిగుబడి అయిందన్నారు. దీనిలో భాగంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపిందని అన్నారు. మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించేందుకు కూడా కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు. రక్షణ దళాలకు చెందిన అన్ని 'స్టోర్స్'లో అరకు కాఫీ లభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని మనోహర్ వెల్లడించారు.
రేషన్ పంపిణీకి గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని త్వరలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో అమల్లోకి తీసుకురానున్నట్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. చౌకధరల దుకాణాల ద్వారా అందించే బియ్యం, పంచదారలాంటి వస్తువులను గుజరాత్ తరహాలోనే తాము కూడా సీబీడీసీ ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి చెబితే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కొత్త విధానం కింద ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ వ్యాలెట్ ప్రారంభిస్తామని చెప్పారు.
Read more news like this on telugu.timesnownews.com

