ఓ కల కంటే దాన్ని సాకారం చేసి చూపించాలని మా నాన్న, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచానికి చాటి చెప్పారు అని ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించాలనేది తమ కల అని ఆ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని పారిశ్రామిక వాడలో దిగ్గజ సంస్థ కారియర్ ఏసీల తయారీ పరిశ్రమకు మంత్రి నారా లోకేశ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ 75 ఏళ్ల యువకులే అని చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరిలోనూ 25 ఏళ్ల యువకులు ఉన్నారని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే కాదని 20 లక్షల ఉద్యోగాలుకల్పించడమే తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో ముందడుగుపడింది. ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. బుధవారం ఉదయం అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ముందుగా వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు సంస్థ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్ తో కలిసి మంత్రి లోకేష్ క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమకు భూమిపూజ చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి పలు దేశాల నుంచి పెట్టుబడులు వస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. పరిశ్రమల మౌళిక సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తెస్తున్నాం అని హామీ ఇచ్చారు. అవకాశాలను అందిపుచ్చుకునే సమర్ధత ఏపీలో పుష్కలంగా ఉందని...సమర్ధవంతమైన నాయకుడు అయిన సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి అని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
దేశంలో ఐదు దశాబ్ధాలకు పైగా కారియర్ సంస్థ కార్యకలాపాలు
దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నాయి. హర్యానాలోని గుర్ గ్రామ్ లో తయారీ యూనిట్, హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఈ సంస్థ కలిగి ఉంది. ఏసీ తయారీరంగంలో పేరుగాంచిన క్యారియర్ గ్లోబల్.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ ను స్థాపించనుంది. ఈ ప్లాంట్ హెచ్ వీ ఏసీ(HVAC), సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడమే కాకుండా.. కార్యకలాపాల సామర్థ్యాన్ని, విస్తృతిని పెంచనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 39 ఎకరాలను ప్రజాప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి.
ఏసీల తయారీ హబ్‌గా శ్రీ సిటీ
ఇళ్లు, కార్యాలయాల్లో వినియోగించే 1, 2 టన్నుల ఏసీలతో పాటు, డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యం గల భారీ కూలింగ్ సిస్టమ్స్‌ను ఈ కారియర్ సంస్థ శ్రీ సిటీలో తయారు చేయనుంది. మౌలిక సదుపాయాలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ సేవల అనుకూలతతో శ్రీసిటీ దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్‌గా అవతరిస్తోంది. దేశవ్యాప్తంగా తయారయ్యే ఏసీల్లో దాదాపు 40 శాతం శ్రీసిటీలోనే ఉత్పత్తి అవుతుండటం విశేషం. తాజాగా క్యారియర్ రాకతో పాటు ఉన్న కంపెనీల విస్తరణతో 2028 నాటికి ఈ ఉత్పత్తి వాటా ఏకంగా 70 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ క్లైమేట్ సొల్యూషన్స్ ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మేకేల్ ఎల్.గియర్టెస్, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్(క్యారియర్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ డుయిజర్, చీఫ్ పీపుల్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నడియా విల్లెనెవ్, శ్రీసిటీ కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

