Dailyhunt
ఏపీ రైతులకు గుడ్ న్యూస్... రబీ ధాన్యం సేకరణపై బిగ్ అప్‌డేట్

ఏపీ రైతులకు గుడ్ న్యూస్... రబీ ధాన్యం సేకరణపై బిగ్ అప్‌డేట్

Times Now Telugu 1 week ago

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు గుడ్ న్యూస్... రబీ ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

శుక్రవారం నిడదవోలులోని నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌ను కూటమి ప్రభుత్వం అత్యంత విజయవంతంగా ముగించిందని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావంటి ప్రాంతాల్లో సాగు ఆలస్యమైనప్పటికీ, అక్కడ రికార్డుస్థాయిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని వెల్లడించారు.

ఇదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణకు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం నుంచే ధాన్యం సేకరణ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పనిచేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 - 23లో 14.12 లక్షలు, 2023-24లో కేవలం 12.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని.. కానీ కూటమి ప్రభుత్వం గత రబీలో 22 లక్షల లక్ష్యానికి గానూ 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించిందని చెప్పారు. మొత్తంగా 2.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,575 కోట్లను ఆయా రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే జమ చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.

ఖరీఫ్ సీజన్‌లో కూటమి ప్రభుత్వం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి రూ.11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేవలం 24 గంటల్లోనే జమ చేశామని తెలిపారు. అందులో సుమారు రూ.7,300 కోట్ల రూపాయలు కేవలం 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

ఈ రబీలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రుల తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,917 సేకరణ కేంద్రాలు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని తెలిపారు. రైతులకు ఇబ్బంది. కలగకుండా కల్లాల వద్దే, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోదాలు అందిస్తామన్నారు. 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... రబీ సీజన్ ధాన్యం సేకరణలో నిడదవోలు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ రబీ సీజన్‌లో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని అన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేసి రైతులకు వేగంగా చెల్లింపులు చేసినట్లే... ఈ రబీ సీజన్‌లో కూడా రైతులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శక సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu