ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లకు రూ. కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌నపు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఆదేశించారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రోజున రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంనుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందించే పౌరసేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత పెంచేందుకు, సమర్థంగా వినియోగించేందుకు వీలుగా నిపుణులతో కూడిన సలహా మండలి ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో డ్రోన్‌ల వినియోగం పెంచేలా వర్క్‌షాపు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మైనింగ్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ ద్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్న తీరును అధ్యయనం చేసి ఏపీలోనూ అమలు చేసేలా చూడాలన్నారు. అవేర్ సాంకేతికతను వినియోగించుకుని వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వచ్చంధ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు.
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్లకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. కొరత ఉన్నచోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. బోర్లు కూడా మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదాన్ని తెలియచేశారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తయ్యేలా చూడాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే వివిధ పౌర సేవలు మెరుగ్గా అందించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవల్లో మెరుగైన ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ కనెక్ట్ అనేది కీలకమని చెప్పారు. ప్రజల్లో విశ్వాసాన్ని, క్రెడిబిలిటీని పెంచేలా ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ ప్రభుత్వ శాఖ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్టుగా పనిచేయాల్సిందేనని సీఎం చంద్రబాబు సూచించారు. పంటలకు ధర విషయంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్టీజీఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించేలా సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కార్యదర్శులస్థాయి అధికారులు నెలలో 3 రోజులపాటు, హెచ్ డీలు 6 రోజులపాటు, జిల్లా కలెక్టర్లు 8 రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కాల్ సెంటర్ ద్వారా వివరాలను సేకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారులు ఏ అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారో అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని.. మిగిలినచోట్ల కూడా ఇదే చొరవ చూపాలన్నారు.
అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖలు అందించే మిగతా అన్ని సేవల్ని ఆన్‌లైన్‌లో అందించాలని స్పష్టం చేశారు. చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత అవేర్ ద్వారా వచ్చే డేటా ఆధారంగా చేపలు సమృద్ధిగా లభించే ప్రాంతాలను మత్స్యకారులకు అందజేయాలని చెప్పారు.
Read more news like this on telugu.timesnownews.com

