ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. గత కొద్ది రోజులు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడుతుంది. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో నగరవాసులు గత రోజుల నుంచి అనుభవిస్తున్న ఉక్కపోత, ఎండ తీవ్రత నుంచి కాస్తా ఉపశమనం పొందారు.
అయితే ఏపీలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(ఏపీఎస్‌డీఎంఏ) కీలక హచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాగల మూడు గంటలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అయితే ఈదురుగాలుతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఇక, ఏపీలో ఎండలు రికార్డు స్థాయికి చేరాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం (మే 24) రోజున ఈ వేసవి సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం రోజున తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 48.3°C (ఈ వేసవి సీజన్లోనే అత్యధికం) ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
మే 25 (సోమవారం)న రాష్ట్రంలోని కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో 43°C నుంచి 45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలో 40°C నుంచి 43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రోజున రాష్ట్రంలో 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ పేర్కొంది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు బయటకు రావద్దని ప్రజలకు ఏపీఎస్‌డీఎంఏ సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని హెచ్చరించింది.
Read more news like this on telugu.timesnownews.com

