ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో సోమవారం కురిసిన అకాల వర్షాలు పంటలకు తీవ్ర నష్టం చేకూర్చాయి. రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడగా 8 మంది మరణించినట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వేసవి కాలంలోనూ ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, మార్కాపురం, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి.
కొన్నిచోట్ల భారీ వర్షం కురవడంతో కాలనీలు, రోడ్లు చెరువులను తలపించాయి. ఈదుగాలులకు పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి. కొన్నిచోట్ల చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం, ఈదురుగాలులకు పలుచోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు కొన్నిచోట్ల కోతకు వచ్చిన మామిడి నేలరాలింది. ఇక, పలుచోట్ల ఆరబెట్టుకుంటున్న ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఆరుగురు మృత్యువాతపడగా, ఐదుగురు గాయపడ్డారు. మర్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో వేర్వేరు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మరణించారు. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బిహార్‌కు చెందిన కన్నయ్య మృతి చెందాడు. యండ్రపల్లి గ్రామానికి సమీపంలో పొలం పనుల్లో ఉన్న రైతు కూలీ బొందలపాటి నాగయ్య ప్రాణాలు విడిచాడు. అలాగే, పని మీద పుల్లలచెరువు మండలానికి వచ్చిన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి పిడుగుపాటుకు గురై మరణించాడు.
ముండ్లమూరు మండలం వేములబండ పొలాల్లో పసుపుగల్లు గ్రామానికి చెందిన రావులపల్లి శివకృష్ణ... దర్శి మండలం శామంతపూడిలో పొలం పనుల కోసం వెళ్లిన ఆవుల మల్లికార్జునరావు.. కనిగిరి సమీపంలో బిహార్‌కు చెందిన కార్మికుడు దుర్గేష్‌కుమార్‌లు పిడుగుపాటులకు గురై మరణించారు. ఇక, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని పొలాల్లో పిడుగులు పడి కూలీలు వి పార్వతి, సింహాచలం ప్రాణాలు కోల్పోయారు.
ఇక, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మంగళవారం (ఏప్రిల్ 7) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, రాష్ట్రంలో సోమవారం రోజున తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 57.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 52.5 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
అలాగే మంగళవారం రోజున నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు.
సోమవారం అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42°C, కడప జిల్లాలో రాజుపాలెంలో 41.9°C, మార్కాపురం జిల్లాలో నందన మారెళ్లలో 40.7°C, నంద్యాల జిల్లా పేరుసోమలలో 40.6°C, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read more news like this on telugu.timesnownews.com

