Dailyhunt
Gold: బ్యాంకుల్లో వేలం వేసే బంగారు నగలను ఎలా కొనుగోలు చేయాలి...? ఇలా కొనుగోలు చేస్తే లాభమా నష్టమా..?

Gold: బ్యాంకుల్లో వేలం వేసే బంగారు నగలను ఎలా కొనుగోలు చేయాలి...? ఇలా కొనుగోలు చేస్తే లాభమా నష్టమా..?

Times Now Telugu 3 days ago

భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే బంగారం అనేది కేవలం అలంకారం వస్తువు మాత్రమే కాదు, బంగారాన్ని ఒక ఆస్తిగా కూడా పరిగణిస్తారు.

గడచిన రెండు సంవత్సరాలుగా గమనించినట్లయితే బంగారం ధర విపరీతంగా పెరిగింది. గడచిన ఏడాది కాలంలో బంగారం ధర దాదాపు 80 శాతం వరకు పెరిగినట్లు చూడవచ్చు.

మన దేశంలో బంగారం కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి సాంప్రదాయంగా చెప్పవచ్చు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కచ్చితంగా బంగారు నగలను కొనుగోలు చేయడం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా తమ కష్టార్జితం లో కొంత మొత్తాన్ని పొదుపు చేసి మరి కొనుగోలు చేస్తుంటారు. నగల షాపుల వారు కూడా మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు అనేక రకాల స్కీములను అందుబాటులో ఉంచుతారు.

అయితే బంగారం కొనుగోలు చేసేందుకు మరొక పద్ధతి కూడా ఉంది, అదే బ్యాంకుల ద్వారా వేలంపాటలో కొనుగోలు చేయడం. అవును, మీరు వింటున్నది నిజమే. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతం బంగారం నగలను వేలంపాట వేస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం ఎవరైతే తాకట్టు పెట్టి బంగారం లోన్లు తీసుకుంటారు, వారు తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకులు ఆ బంగారు నగలను వేలంపాటలో విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. ఇలా విక్రయించి తమకు రావాల్సిన వడ్డీ, అలాగే అసలు పొందుతుంటాయి. మీరు కూడా ఈ బంగారు నగలను వేలంపాట ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే జాగ్రత్తగా వేలంపాటలో కొనుగోలు చేయాలని హెచ్చరిస్తుంటారు. అసలు బ్యాంకులు వేలంపాటలో విక్రయించే బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలైన ముత్తూట్, మనప్పురం వంటి సంస్థలు సైతం పేపర్, న్యూస్ పేపర్‌లో ఈ వేలంపాటకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను న్యూస్ పేపర్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తాయి. ఈ వేలంపాటలో పాల్గొనే ముందు ముందుగా కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. దీన్నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా చేసుకోవచ్చు. ఇందులో మీ పూర్తి వివరాలను ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వేలంపాటలో పాల్గొనే ముందు కొంత మొత్తం డిపాజిట్ కూడా చేయమని కోరుతుంటారు. అలాంటి పూర్తి నిబంధనలను ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఈ వేలంపాట ప్రక్రియ అనేది కొన్నిసార్లు సంబంధిత బ్యాంకు బ్రాంచీలో కానీ, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి కానీ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ వేలంపాటలో ఎవరైతే ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారో వారికి ఆ నగలను సొంతం చేసుకునే హక్కు కల్పిస్తారు. దీనికి సంబంధించిన నగదు చెల్లింపులను నిర్ణీత సమయంలోగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు నగలు సొంతం అవుతాయి.

వేలంపాటలో నగలను కొనుగోలు చేస్తే లాభమా నష్టమా
నిజానికి వేలంపాటలో నగలను కొనుగోలు చేయడం ద్వారా కొన్ని లాభాలు ఉన్నాయి. సాధారణ మార్కెట్ ధర కన్నా కూడా ఈ వేలంపాటలో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంకులు తమకు రావాల్సిన వడ్డీ, అలాగే అసలు మాత్రమే వసూలు చేసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాయి. కనుక ఈ రకంగా చూస్తే వేలంపాటలో నగలు కొనుగోలు చేయడం అనేది కాస్త లాభదాయకమైనదే అని చెప్పవచ్చు. ఈ వేలంపాటలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో మరో ప్రధానమైన లాభం మేకింగ్ చార్జీలు లేకపోవడమే. ఈ వేలంపాటలో ముఖ్యంగా మేకింగ్ చార్జీలు లేకుండా కేవలం బంగారం నాణ్యత ఆధారంగానే విలువను నిర్ణయిస్తారు.

వేలంపాటలో బంగారం కొనుగోలు చేయడంలో ఉన్న రిస్కులు ఇవే
వేలంపాటలో కొనుగోలు చేసే బంగారు ఆభరణాలు మీకు నచ్చిన మోడల్స్ ఉండకపోవచ్చు. పాత మోడల్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా బంగారంలో కలిపి లెక్కించే అవకాశం ఉంటుంది. కనుక అది జాగ్రత్తగా చూసుకోవాలి. రెండింటినీ వేరువేరుగా లెక్కించాలి. వేలంపాటలో ఎక్కువ మంది పాల్గొన్నట్లయితే మార్కెట్ ధరకు మాత్రమే మీకు నగలు లభించే అవకాశం ఉంటుంది. వేలంపాటకు వెళ్లే ముందు మార్కెట్లో బంగారం ధరను కనుక్కొని వెళ్లడం మంచిది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu