Dailyhunt
గుడికట్ల పూజారులకు గుడ్‌న్యూస్...త్వరలో గౌరవ వేతనాలు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

గుడికట్ల పూజారులకు గుడ్‌న్యూస్...త్వరలో గౌరవ వేతనాలు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Times Now Telugu 2 weeks ago

గుడికట్ల పూజారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు.

విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పుకొచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీపరంగా కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. కర్నూలులో ఆదివారం జరిగిన కురబల ఆత్మీయ సమావేశంలో ఎంపీ బత్తిపాటి నాగరాజుతో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐక్యతతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యతోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని, కురబలు తమ బిడ్డలకు ఉన్నత విద్యలు అభ్యసించేలా ప్రోత్సాహించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం
రాజకీయాలకతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, అధికార పార్టీగా కురబల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడమే కాకుండా, శాశ్వత జీవో కూడా ఇచ్చామన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే విషయమై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్య లు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురబలు జిల్లాలు, మండలాల వారీగా తక్షణమే కుల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కురబల సంక్షేమానికి రాష్ట్ర కమిటీ కృషి చేయాలి

రాష్ట్ర స్థాయి కమిటీ నియామకానికి ఆసక్తి కలిగిన వారు తమ పేర్లు అందజేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. ఈ సందర్భంగా కురబ రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షునిగా ఎస్.కే. మల్లికార్జున, గౌరవ అధ్యక్షుడిగా తట్టే అర్జునరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా కర్నూలు శ్రీనివాసరావు, మదనపల్లి లక్ష్మన్న, గుంటూరు సత్యనారాయణ రాజు, నంద్యాల శ్రీరాములు, జనరల్ సెక్రటరీగా ఏలూరి సూర్యనారాయణ, కోశాధికారిగా సంతల శ్రీరాములును అందరి సూచన మేరకు ఎంపిక చేశారు. కార్యదర్శులుగా మహేంద్ర (కర్నూలు), చెన్నప్ప (కొత్తచెరువు), దోనస్వామి (అనంతపురం), వెంకటేశ్వరరావు (మచిలీపట్నం), రఘు (రాయచోటి), కాంతారావు (పీలేరు), ప్రచార కార్యదర్శులుగా ఆదోని సంతోష్, పెనుకొండ రామాంజినేయులు, తిరుపతి శ్రీనివాసులు, బాపట్ల పరమేశ్వరరావు, బక్క రామకృష్ణను ఎంపిక చేశారు. ఎంపికైన వారు కురబల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి సవితకు కురబ సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు జిల్లాకు చెందిన కురబ సామాజిక వర్గీయులు, వివిధ పార్టీలకు చెందని కురబ నేతలు పాల్గొన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu