ఇరాన్, అమెరికాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అలాగే, ఇరాన్‌పై తాము ప్లాన్ చేసిన దాడులను నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించారు.
ఈ కాల్పుల విరమణ ప్రణాళికలో భాగంగా... చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ఈ ప్రణాళికలో భాగంగా... హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఇక ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్, ఒమన్ దేశాలు ఫీజు వసూలు చేయడానికి అనుమతి ఉంటుందని ఆ ప్రాంతానికి చెందిన అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు.
ఇక, హర్మూజ్ జలసంధి... ఒమన్, ఇరాన్ దేశాల ప్రాదేశిక జలాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకు హర్మూజ్ జలసంధిని ప్రపంచ దేశాలు ఒక అంతర్జాతీయ జలమార్గంగా పరిగణించాయి. అందుకే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా సుంకాలు చెల్లించలేదు. అయితే ట్రంప్ దెబ్బ... ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే తాజాగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్, ఒమన్ దేశాలు ఫీజు వసూలు చేయనున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా సేకరించిన డబ్బును ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఉపయోగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన అధికారి తెలిపారు. మరోవైపు ఒమన్ ఇలా సేకరించిన డబ్బును దేనికి ఉపయోగిస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.
US-Iran Ceasefire: పెద్ద విజయం సాధించామన్న ఇరాన్... హర్మూజ్ జలసంధి ఓపెన్, ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ ఇవే
ఇక, హర్మూజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి పరిమిత కాలం పాటు అనుమతి ఇవ్వనున్నట్టుగా ఇరాన్ తెలిపింది. అయితే అది తమ సాయుధ దళాల కఠినమైన సమన్వయంతో మాత్రమే సాధ్యమవుతుందని ఇరాన్ పేర్కొంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ... ''రెండు వారాల పాటు ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో, సాంకేతిక పరిమితులను తగిన విధంగా పరిగణనలోకి తీసుకుని హర్మూజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణం కల్పిస్తాయి'' అని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులు నిలిచిపోతే తమ సాయుధ దళాలు తమ రక్షణ కార్యకలాపాలను నిలిపివేస్తాయని అని ఆయన తెలిపారు.
హర్మూజ్ జలసంధి గుండా నియంత్రిత ప్రయాణం ఇరాన్ దళాల పర్యవేక్షణలో జరుగుతుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన చేసింది. అయితే ఇది ఇరాన్‌కు ప్రత్యేకమైన ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్థానాన్ని ఇస్తుందని పేర్కొంది.
అలాగే, ఈ పరిణామాలను ఇరాన్ ఒక పెద్ద విజయంగా అభివర్ణించింది. తమ దేశం గొప్ప విజయం సాధించిందని పేర్కొంది. చర్చలకు ప్రాతిపదికగా తమ 10-సూత్రాల ప్రణాళికను అంగీకరించేలా అమెరికాను బలవంతం చేసిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తన ప్రకటనలో తెలిపింది.
అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యానికి అవకాశం కల్పించేందుకు పాకిస్తాన్ మొదట కాల్పుల విరమణ ప్రతిపాదించిందని... దానిని ముందుకు తీసుకెళ్లడంతో చొరవ తీసుకున్నందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్‌లకు అరాఘ్చి కృతజ్ఞతలు తెలిపారు.
Read more news like this on telugu.timesnownews.com

