Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్లు... కేంద్రం వాటా కోసం ఎదురు చూస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లు... కేంద్రం వాటా కోసం ఎదురు చూస్తున్నాం: మంత్రి పొంగులేటి

Times Now Telugu 1 week ago

ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి సుమారు ఒక లక్షా 13 వేల రూపాయిల వాటా విడుదల కావాల్సి ఉందని చెప్పారు. కేంద్రం నుంచి నిధుల వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు ఫైనల్ బిల్లులు ఆపడం జరిగిందని అన్నారు. అయితే ఆ నిధుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం రోజున మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా కేంద్రాని అభ్యర్థన చేశానని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని... ఈ క్రమంలోనే ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 1.60 లక్షల రూపాయిలను తాత్కాలికంగా ఆపామని తెలిపారు. ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. జూన్ నెలాఖరుకల్లా 68 నుంచి 72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తవుతుందన్నారు.

రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వివిధ రకాల వెసులుబాట్లను కల్పిస్తామని అన్నారు. గోడలు, బేస్‌మెంట్ లెవెల్‌, శ్లాబ్ వరకు ఉన్న గోడలు, శ్లాబ్ లేని ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈనెల 21న కేబినెట్ చర్చించి ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

గత 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో రెవెన్యూ, హౌసింగ్‌, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ , సర్వే అంశాలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కొన్ని విషయాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పరిష్కరించామని చెప్పారు. ఈ సారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించామని తెలిపారు. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసేలా ఆదేశించామని వెల్లడించారు. 1/70 సమస్యపై కూడా చర్చించామని... రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయని వీటి పరిష్కారానికి జయింట్ సర్వే నిర్వహించి శాశ్వ పరిష్కారం చూపబోతామన్నాని అన్నారు.

గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 38 వేల ఇళ్లకు లబ్దిదారులను ఖరారు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. తర్వాత ఏడాది పాటు సైంటిఫిక్ సర్వే నిర్వహించగా వీరిలో సుమారు 16వేల మంది అసలు ఆ ఇండ్లలో దిగలేదని తేలిందని అన్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు వారు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు. అర్హులను ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో మూడు కార్పోరేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ఒకే స్ధలంలో అన్నదమ్ములు ఇందిరమ్మ ఇళ్లనును వన్ ప్లస్ వన్ పద్దతిలో కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సుమారు 40-50 ఏళ్ల క్రితం కట్టిన వాంబే,ఎన్ఆర్‌జేఏఎంఎస్ తదితర కాలనీల్లో ఇండ్లు కూలిపోయే స్ధితికి చేరుకుంటున్నాయని... వాటి స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులు స్ధానికంగా ఇసుకను ఉచితంగా పొందేలా, ఎర్త్ ఫిల్లింగ్ కుకూడా మట్టిని పొందేలా అవకాశం ఇవ్వాలని, ఎటువంటి అభ్యంతరాలు తెలుపకూడదని అధికారులను ఆదేశించామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu