IPL 2026 GT vs PBKS: ఐపీఎల్ 2026 సీజన్ ఫస్టాఫ్‌లో ఓటమి ఎరుగని పంజాబ్ కింగ్స్, సెకండాఫ్‌లో వరుసగా రెండో ఓటమిని చవి చూసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది పంజాబ్ కింగ్స్.
పంజాబ్ కింగ్స్ విధించిన లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది గుజరాత్ టైటాన్స్.
5 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ని అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. 22 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన జోస్ బట్లర్‌ని విజయ్‌కుమార్ వైశాఖ్ అవుట్ చేశాడు.
నిషాంత్ సింధు 11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా 6 బంతుల్లో 2 పరుగులు చేయగా జాసన్ హోల్డర్ 5 పరుగులు చేశాడు.
- ఆఖరి ఓవర్‌లో హై డ్రామా...
గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం అయ్యాయి. వైడ్‌తో మొదలుపెట్టిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదాడు అర్షద్ ఖాన్. 5 బంతుల్లో 6 పరుగులు అవసరం అయ్యాయి. రెండో బంతికి 2 పరుగులు కాగా, మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. 2 బంతుల్లో 3 పరుగులు కావాల్సిన సమయంలో సిక్సర్ బాదిన వాషింగ్టన్ సుందర్ మ్యాచ్‌ని ముగించేశాడు. వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్ కింగ్స్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్.
2 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్యని అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్, ఆ తర్వాతి బంతికి కూపర్ కొనెల్లీని గోల్డెన్ డకౌట్ చేశాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్. 14 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్‌ని కగిసో రబాడా అవుట్ చేశాడు. 6 బంతులు ఫేస్ చేసిన నేహాల్ వదేరా, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 21 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
- 47 పరుగులకే 5 వికెట్లు...
47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్. ఈ సమయంలో సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్ కలిసి పంజాబ్ కింగ్స్‌ని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్జ్‌ని కగిసో రబాడా అవుట్ చేశాడు. దీంతో ఈ భాగస్వామ్యానికి తెరబడింది.
31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్‌ని జాసన్ హోల్డర్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి జోవియర్ బర్ట్‌లెట్ డకౌట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన మార్కో జాన్సన్ ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.
Read more news like this on telugu.timesnownews.com

