Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జవహర్ నగర్ నేపాలీ గ్యాంగ్ దోపిడి కేసును ఛేదించిన పోలీసులు...నలుగురు అరెస్ట్

జవహర్ నగర్ నేపాలీ గ్యాంగ్ దోపిడి కేసును ఛేదించిన పోలీసులు...నలుగురు అరెస్ట్

Times Now Telugu 1 week ago

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ ముఠా దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కౌకూర్‌లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసించే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని గమనించిన రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనానికి వ్యూహం రచించారు. ఇందుకోసం వారు సబీనా అలియాస్ సునీత, చాంగ్, సామ్రాట్, బిస్వాల్, కమల్, జంకర్ అలియాస్ శంకర్ అనే మరికొంతమంది నేపాల్ వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.

పుట్టినరోజు వేడుక పేరిట ఇంట్లోకి..

పథకం ప్రకారం మీనా అనే నిందితురాలు సబీనాను బాధితుడి ఇంట్లో పనిమనిషిగా చేర్పించింది. అదేవిధంగా రాజేష్‌ను ఆమె భర్తగా పరిచయం చేసింది. గత నెల ఏప్రిల్ 25 నుంచి సరైన సమయం కోసం వేచి చూసిన ఈ ముఠా, మే 11న సర్వెంట్ క్వార్టర్స్‌లో మీనా పుట్టినరోజు వేడుక పేరిట ఒక నాటకానికి తెరలేపింది. ఆ రాత్రి రాజేష్, సబీనా, మీనా, చాంగ్, సామ్రాట్ అనే ఐదుగురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించగా, మిగిలిన నిందితులు బయట కాపలాగా ఉన్నారు.

మత్తుమందు ఇచ్చి ఘాతుకం
రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన నిందితులు వృద్ధ దంపతులను బంధించారు. వారికి బలవంతంగా ఒక అపరిచిత మత్తు/విష పదార్థాన్ని తినిపించి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం ప్లాస్టిక్ టేపులు, గుడ్డలతో వారి కాళ్లు, చేతులు కట్టేసి, గడ్డపారలతో (Crowbars) బెదిరిస్తూ అల్మారాలను పగలగొట్టారు. ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు, 3,000 యూఎస్ డాలర్ల నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు.

250 కి పైగా సీసీ కెమెరాల పరిశీలన
ఘటన అనంతరం నిందితులు ఆటో, స్కూటర్‌పై పారిపోయారు. యాప్రాల్ సమీపంలో స్కూటర్‌ను వదిలివేసి, అక్కడి నుంచి రెండు టాక్సీలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని దేశం దాటిపోయేందుకు ప్రయత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రాత్రి వేళ ఇళ్ల దొంగతనం కేసులో మీనా, రాజేష్‌లకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో జరిపిన వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోలాయి. నిందితులను పట్టుకునేందుకు లా అండ్ ఆర్డర్, సీసీఎస్, ఎస్‌ఓటీ విభాగాలతో కలిపి మొత్తం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బెంగళూరు, లక్నో, నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సమాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి నిందితులను పట్టుకున్నారు.

నలుగురు నిందితుల అరెస్ట్.. సొత్తు రికవరీ

శనివారం (16-05-2026) ఉదయం 10:45 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వివరాలు:
సునీత అలియాస్ సబీనా (28),
బిస్వాల్ అలియాస్ విస్వాల్ (30),
కమల్ బహదూర్ చలానే (34),
జంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్ (38),
వీరంతా నేపాల్ దేశానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, వారి వద్ద నుంచి దొంగిలించబడిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును రికవరీ చేసినట్లు వివరించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu