Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీవితంలోనే అత్యంత కష్టకాలం... తీవ్రమైన మానసిక క్షోభను ఎదుర్కొన్నాం: బండి సంజయ్

జీవితంలోనే అత్యంత కష్టకాలం... తీవ్రమైన మానసిక క్షోభను ఎదుర్కొన్నాం: బండి సంజయ్

Times Now Telugu 1 week ago

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్‌ వేదికగా గత కొద్ది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై ఎమోషనల్ పోస్టు చేశారు. గడిచిన వారం రోజులు తమ జీవితంలోనే అత్యంత కష్టకాలం అని తెలిపారు.

అదే సమయంలో తన తల్లి గుండెపోటుకు గురయ్యారని... అది తమకు తీవ్రమైన మానసిక క్షోభను కలిగించిందని చెప్పారు. అయితే ఈ కష్టకాలంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చూపిన ప్రేమ, మద్దతు తనకు దృఢంగా నిలబడే శక్తిని ఇచ్చాయని చెప్పారు. అదే సమయంలో తన కొడుకు భగీరథ్ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన బండి సంజయ్... వ్యక్తిగత కుటుంబ విషయం అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

''గడిచిన వారం రోజులుగా మా కుటుంబం మా జీవితంలోనే అత్యంత భావోద్వేగభరితమైన కష్టకాలాన్ని ఎదుర్కొంది. బాధ, ఆందోళన, నిస్సహాయత, తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన క్షణాలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితి మా కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ కష్టకాలంలో మా అమ్మ గుండెపోటుకు గురయ్యారు... అది మాకు చాలా తీవ్రమైన మానసిక క్షోభను కలిగించింది. కానీ ఈ కష్ట సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చూపిన అపారమైన ప్రేమ, మద్దతు నాకు దృఢంగా నిలబడే శక్తిని ఇచ్చాయి.

మాకు అండగా నిలిచి, మా కోసం మాట్లాడి, మా కోసం ప్రార్థించి, మానసికంగా మద్దతు ఇచ్చిన ప్రతి బీజేపీ కార్యకర్తకు, నాయకుడికి, మద్దతుదారుడికి, స్నేహితుడికి, మీడియా, సోషల్ మీడియా సభ్యులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు, యువకుల నుండి వృద్ధుల వరకు, లెక్కలేనంత మంది ప్రజలు మా గురించి ఆందోళన చెందారు. ఆప్యాయతతో మాకు మద్దతుగా నిలిచారు.

న్యాయం, నిష్పక్షపాతాన్ని విశ్వసించే చాలా మంది తీవ్రమైన ఒత్తిడి, వేధింపులు ఎదురైనప్పటికీ సత్యం పక్షాన నిలబడాలని ఎంచుకున్నారు. ఆ మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నిజం చెప్పాలంటే ఇన్నేళ్లలో నేను ఇంత ప్రేమను, సద్భావనను సంపాదించుకున్నానని ఎప్పుడూ గ్రహించలేదు. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలే నాకు గొప్ప బలం.

మా వైపు నుండి ఎటువంటి తప్పిదం జరగలేదు అనేది ప్రతి శ్రేయోభిలాషికి, మద్దతుదారునికి, కార్యకర్తకు నేను భరోసా ఇవ్వదలచుకున్నాను. మాకు న్యాయ ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంది. చివరికి సత్యమే గెలుస్తుంది. అదే సమయంలో ఇది ఒక వ్యక్తిగత కుటుంబ విషయం అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో మేము దీనిపై చట్టపరంగా పోరాటం కొనసాగిస్తాము.

బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భావోద్వేగాలకు లోనుకావద్దని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కొనసాగించండి. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం మీ కృషిని కొనసాగించండి. మేము జీవితంలో ఈ క్లిష్టమైన దశను ధైర్యంతో, సహనంతో, విశ్వాసంతో ఎదుర్కొంటాము. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తిరస్కరించబడదు'' అని బండి సంజయ్ పేర్కొన్నారు. నీతి ఉన్నచోట విజయం ఉంటుందని అన్నారు.

బండి భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్...
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి ప్రకటించారు. ఆ తర్వాత భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఈ కేసును పర్యవేక్షిస్తున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ రెండు గంటలకు పైగా భగీరథ్‌ను విచారించారు. అనంతరం భగీరథ్‌కు మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. ఆ తర్వాత భగీరథ్‌ను మేడ్చల్‌లోని మేజిస్ట్రేట్‌ నివాసంలో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే మేజిస్ట్రేట్... భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.

అయితే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించగా... చట్టంపై గౌరవంతో తన కుమారుడు భగీరథ్‌ను పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చెబుతున్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu